‘తమ్ముళ్ల' ఇసుక ‘తాండవం’


సాక్షి ప్రతినిధి, కాకినాడ : తుని నియోజకవర్గంలో దాదాపు మూడు దశాబ్దాలు చక్రం తిప్పిన తెలుగుదేశం పార్టీ తర్వాత ప్రజాగ్రహంతో ఓటమి పాలైంది. అయినా తెలుగుతమ్ముళ్ల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. తమ స్వార్థం తాండవ ఆయకట్టు రైతులకు అనర్థంగా పరిణమిస్తున్నా వారికి ఇసుక రేణువంత లక్ష్యం లేదు. తాండవ తుని, కోటనందూరు మండలాల్లోని పంట పొలాలను సస్యశ్యామలం చేస్తూ ప్రవహిస్తోంది. ఈ నదిలో తుని మండలం మరువాడ, కొలిమేరు, కుమ్మరిలోవ, డి.పోలవరం, తుని శ్మశానం, కోటనందూరు మండలంలో అగ్రహారం, అల్లిపూడి, బొద్దవరంల వద్ద ఇసుక ర్యాంపులు ఉన్నాయి.

 

 ఆ ర్యాంపులలో ఇదివరకు కూడా అప్పుడప్పుడూ అక్రమ తవ్వకాలు జరిగినా అధికారులు నిఘాతో నిలువరించే వారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక పార్టీ కార్యకర్తలకు దోచిపెట్టే సాధనంగా ఇసుక తవ్వకాలకు తెరతీశారు. పేరు స్వయం సహాయక సంఘాలది, ఫలితం తమ్ముళ్లకు అన్నట్టు ప్రస్తుతం ఇసుక దందా మూడు లారీలు ఆరు ట్రాక్టర్‌లుగా నడిచిపోతోంది. గడచిన ఏడాదిగా రూ.కోట్ల విలువ చేసే ఇసుక అక్రమ రవాణా జరిగిపోగా, ఇప్పటికీ అడ్డూఅదుపూ లేకుండా సాగిపోతూనే ఉంది.

 

 అక్రమాల్ని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే రాజా యత్నం

 ఈ ఇసుక దందాను నిలువరించేందుకు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఇటీవల బొద్దవరంలో ప్రయత్నించారు. ఇసుక లోడుతో ఉన్న వాహనాలను కోటనందూరులో రెవెన్యూ, పోలీసు అధికారులకు అప్పగించినా ఆగడాలకు అడ్డుకట్ట పడలేదు. రైతుల ఫిర్యాదులపై మరోమారు ఎమ్మెల్యే రాజా డి.పోలవరం ర్యాంపులో అక్రమాలను అడ్డుకున్నారు. ఆ తరువాత కథ షరా మామూలే. రెవెన్యూ, పోలీస్ అధికారులు చేతులెత్తేయడంతో ఒక అమాత్యుని అండదండలతో తమ్ముళ్లు యథేచ్చగా ఇసుకను కొల్లగొడుతున్నారు. ప్రస్తుతం తుని మండలంలో డి.పోలవరం, కొలిమేరు గ్రామాల పరిధిలో నిత్యం సుమారు 300 ట్రాక్టర్‌ల ఇసుకను దొడ్డిదారిన తరలిస్తూ తమ్ముళ్లు లక్షలు వెనకేసుకుంటున్నారు.

 

 వే బిల్లుల నుంచి విక్రయూల వరకూ సొమ్ముల  దండుడు

 ఇళ్లు నిర్మించుకునే వారికి వారానికి మూడు ట్రాక్టర్ల ఇసుక తీసుకునేందుకు అనుమతి ఉంది. అలా  తీసుకువెళ్లే ట్రాక్టర్ ఇసుకకు రూ.134 వంతున గ్రామపంచాయతీకి చెల్లించాల్సి ఉంది. దాని ఆసరాగా అధికారపార్టీ వందిమాగధులు వేబిల్లులను రూ.134 వంతున చెల్లించి తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. రూ.134కు కొనుగోలుచేసే వేబిల్లును బయట రూ.1000కు విక్రయిస్తున్నారు. అంటే  వే బిల్లు నుంచిరూ.866 అక్రమంగా ఆర్జిస్తున్నారు. కేవలం వే బిల్లులపైనే రోజుకు రెండున్నర లక్షలు వెనకేసుకుంటున్నారు. ఇక విక్రయాల ద్వారా ఇంతకు రెట్టింపు సొమ్ములు దండుకుంటున్నారు. వాస్తవంగా ఒక వేబిల్లు రూ.134, ఎగుమతి, దిగుమతికి రూ.300, కిరాయి రూ.200 మొత్తంగా ఒక ట్రాక్టర్ ఇసుక రూ.634కు వినియోగదారుడి ఇంటికిచేరాలి. తెలుగుతమ్ముళ్లు ట్రాక్టర్ ఇసుక రూ.3000కు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్ ఇసుకపై వినియోగదారుడికి పడుతున్న అదనపు భారం సుమారు రూ.2,400. ఆ మేరకు రోజుకు రవాణా అవుతున్న 300 ట్రాక్టర్‌ల ద్వారా సుమారు ఏడున్నర లక్షలు తమ్ముళ్లు జేబులోకి పోతున్నాయి. అలా తునిలో  తమ్ముళ్ల నెలవారీ ఆదాయం రూ.రెండు కోట్లకు పైమాటే.

 

 అక్రమాలకు అడ్డుకట్ట ఎప్పుడు?

 హైకోర్టు ఉత్తర్వులను, వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి తాండవలో ఇసుక అక్రమ తవ్వకాల వల్ల నది లోతు పెరిగిపోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరదలు వచ్చినప్పుడల్లా పరీవాహక భూములు, విలువైన కట్టడాలు కోతకు గురై నదిలో కలిసిపోతున్నాయి. తుని, కోటనందూరు మండలాల పరిధిలో 16 కిలోమీటర్ల మేర వందల ఎకరాలు నది కోతకు కరిగి, కనుమరుగైపోతున్నాయి. తమ భూములను కాపాడాలంటున్న రైతులు ఆక్రందనలు ఇసుకను తరలించే వాహనాల హోరులో  కలిసిపోతున్నాయే తప్ప అధికారులకు పట్టడం లేదు. ఇకనైనా రెవెన్యూ, పోలీసు శాఖలు మత్తువీడి ఇసుక అక్రమార్కులను కట్టడి చేయాలని రైతులు కోరుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top