‘‘నువ్వు కాదు.. నేనే చంపేస్తా’’

‘‘నువ్వు కాదు.. నేనే చంపేస్తా’’ - Sakshi


రాజమండ్రి క్రైం :చున్నీతో మెడను బిగించి యువతిని హత్య చేసిన సంఘటన రాజమండ్రి నగరంలలో కలకలం రేపింది. విగతజీవిగా పడి ఉన్న ఆ యువతి మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. త్రీ టౌన్ పోలీసుల కథనం ప్రకారం...

 

 పరిచయం ప్రేమగా మారి...

 గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన ఎ.సత్యనారాయణ, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని మండపాక గ్రామానికి చెందిన జి. వరలక్ష్మి ఇరువురు రాజమండ్రిలోని ప్రముఖ స్టార్ హోటల్‌లో పని చేసేవారు. వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లకు ఆ హోటల్‌లో పని మానేసిరాజమండ్రి రూరల్ మండలం కాతేరు గ్రామంలోని తిరుమల స్కూల్లో సత్యనారాయణ కుక్‌గా, వరలక్ష్మి సూపర్‌వైజర్‌గా చేరారు. అయితే వీరిద్దరి ప్రవర్తన నచ్చని స్కూల్ యాజమాన్యం పది రోజుల క్రితం వారిని పని నుంచి తొలగించింది. అప్పటి నుంచి ఖాళీగానే ఉంటున్నారు.

 

 నాలుగు నెలల క్రితమే మల్లయ్యపేటకు

 స్టార్ హోటల్‌లో పని మానేసిన తర్వాత సత్యనారాయణ నాలుగు నెలల క్రితం మల్లయ్యపేట సెంటర్లోని వైన్ షాపు సమీపంలో నారాయణరావు అనే వ్యక్తి ఇంటిలో అద్దెకు దిగాడు. రెండు నెలల అనంతరం వరలక్ష్మిని మల్లయ్యపేట ఇంటికి తీసుకు వెళ్లాడు. వరలక్ష్మిని మేనకోడలిగా యజమాని నారాయణరావుకు పరిచయం చేశాడు.

 

 పెళ్లి చేసుకోమని అడిగినందుకు

 తిరుమల స్కూల్ యాజమాన్యం పని నుంచి తొలగించడంతో పది రోజులుగా ఖాళీ ఉంటున్న సత్యనారాయణను వివాహం చేసుకోవాలంటూ వరలక్ష్మి సోమవారం రాత్రి ఒత్తిడి చేసింది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. తనను వివాహం చేసుకోని పక్షంలో చచ్చిపోతానంటూ వరలక్ష్మి తన చున్నీతో మెడకు బిగించుకుంది. ‘నువ్వు చచ్చిపోయేదేంటి.. నేనే నిన్ను చంపేస్తానని’ చున్నీ బిగించడంతో వరలక్ష్మి ఊపిరాడక చనిపోయిందని పోలీసులు తెలిపారు.

 

 ఏమీ ఎరగనట్టుగా...

 మంగళవారం ఉదయం లేచిన సత్యనారాయణ ఏమీ తెలియనట్టుగా ఇంటికి తాళం వేసుకుని తన స్వగ్రామం మల్లేపల్లి వెళ్లిపోయాడు. అయితే మల్లయ్యపేటలో ఉంటున్న అద్దె ఇంటిలో అందరికీ కలసి ఒకే మరుగుదొడ్డి ఉంది. ఆ ఇంటి పక్క వారు అటుగా వెళుతూ సత్యనారాయణ ఇంటి కిటికిలోంచి లోనికి చూడగా వరలక్ష్మి విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించారు. విషయాన్ని ఇంటి యజమాని నారాయణరావుకు సమాచారమిచ్చారు. నారాయణరావు త్రీ టౌన్ పోలీసులుకు సమాచారం అందించగా డీఎస్పీ నామగిరి బాబ్జి, సీఐ రమేష్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

 

 చాకచక్యంగా రప్పించారు

 మల్లేపల్లి వెళ్లిపోయిన సత్యనారాయణను పోలీసులు చాకచక్యంగా రాజమండ్రి రప్పించారు. ‘నీ గదిలో నీ మేడకోడళు లేచి మంచినీళ్లు, టీ అడిగిందని లేచి బాగానే తిరుగుతోందని’ పోలీసులు ఫోన్‌లో సత్యనారాయణకు చెప్పించారు. దీంతో వరలక్ష్మి స్పృహ తప్పి పడిపోయి ఉంటుందని భావించిన సత్యనారాయణ రాజమండ్రి మల్లయ్యపేట చేరుకున్నాడు. దీంతో త్రీ టౌన్ పోలీసులు సత్యనారాయణను అదులోకి తీసుకున్నారు. వరలక్ష్మి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు ఆమె బంధువులకు సమాచారం అందించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top