సమన్వయంతో వ్యవహరించాలి

సమన్వయంతో వ్యవహరించాలి - Sakshi


సెప్టెంబర్ 30 నాటికి జిల్లాలో నూరుశాతం మరుగుదొడ్లు నిర్మించాలి

సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే




చిలకలూరిపేటరూరల్: నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసేందుకు మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించి జిల్లాలో నూరు శాతం మరుగుదొడ్లను నిర్మించేందుకు రూపొందించిన ప్రణాళికను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే చెప్పారు. పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్‌లో మంగళవారం నిర్మల్ భారత్ అభియాన్, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్ధాయి సమీక్షా సమావేశంలో ఆయనప్రసంగించారు.

 

జిల్లాలోని 57 మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో 1,25,000 మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. నియోజకవర్గంలోని మూడు మండలాల్లోని 53 గ్రామాల్లో నూరుశాతం మరుగుదొడ్లు నిర్మించేందుకు 16 గ్రామాలను ఎంపిక చేశామన్నారు. ఇందులో 4025 మరుగుదొడ్లు నిర్మాణం చేయాలని నిర్ణయించుకుంటే ఇప్పటివరకు 791 దొడ్లు పూర్తికాగా, 779 నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. మరో 2455 దొడ్లను నిర్మించాల్సి ఉందన్నారు.

 

మండల పరిధిలో ఎంపీడీవో, తహశీల్దార్, గ్రామీణ మంచినీటి సరఫరా, హౌసింగ్, ఉపాధి హామీ, వెలుగు శాఖలకు చెందిన అధికారులు ఎంపిక చేసిన గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. గ్రామస్ధాయిలో పంచాయతీ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ అధికారులు సర్పంచి, ఎంపీటీసీ, వార్డు మెంబర్‌లు, అంగన్‌వాడీ, ఆశ వర్కర్‌ల సహాయ సహాకారాలతో మరుగుదొడ్డి లేని ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి వారిని మరుగుదొడ్లు నిర్మించుకునేలా ఒప్పించాలన్నారు.

 

మండలానికి లక్ష రూపాయలు

మరుగుదొడ్ల నిర్మాణానికి ఆర్థిక సమస్యలు ఎదురైన లబ్ధిదారులకు అత్యవసర సహాయం ద్వారా అందించేందుకు లక్షరూపాయలు విడుదల చేశామని జిల్లా కలెక్టర్ చెప్పారు. ముఖ్యమైన సందర్భాల్లో వాటిని డ్రా చేసి లబ్ధిదారులకు అందించి బిల్లులు మంజూరైన అనంతరం జమచేయాలని తెలిపారు. సమావేశంలో తొలుత హౌసింగ్‌బోర్డు ఎస్‌ఈ, నియోజకవర్గ ప్రత్యేకాధికారి ఎస్.సురేష్‌బాబు, జెడ్పీ సీఈవో సుబ్బారావు, డ్వామా పీడీ  ఢిల్లీరావు మరుగుదొడ్ల ఆవశ్యకత గురించి వివరించారు.



కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ పి.ప్రశాంతి,  జిల్లా పంచాయతీ అధికారి పి.గ్లోరియా, నరసరావుపేట ఆర్డీవో ఎం.శ్రీనివాసరావు, ఐకేపీ ఏపీఎం టి.శ్రీనివాసరావు, సీసీలు, మూడు మండలాలకు చెందిన గ్రామీణ మంచినీటి సరఫరా, ఉపాధిహామీ, హౌసింగ్, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు వివిధ శాఖలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top