ఉద్దేశపూర్వకంగానే ఫెయిల్‌ చేశారు!

ఉద్దేశపూర్వకంగానే ఫెయిల్‌ చేశారు! - Sakshi


► యోగా విభాగ విద్యార్థుల ఆరోపణ

► 43 మందిలో పరీక్ష తప్పిన 42మంది

► యోగా కేంద్ర ప్రాంగణంలో ఆందోళన

► ఒక్కరినే పాస్‌ చేయడంపై ఆగ్రహం


ఏయూ క్యాంపస్‌ (విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయం యోగా విభాగం విద్యార్థులు ఆకస్మిక ఆందోళనకు దిగారు. పరీక్షలలో తమను ఉద్దేశపూర్వకంగా ఫెయిల్‌ చేశారని ఆరోపిస్తూ వీరంతా బుధవారం రాత్రి యోగా కేంద్రం ప్రాంగణంలో ఆందోళన చేశారు. కేంద్రం గేట్లు మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు వచ్చి విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటీకే పరీక్షల ఫలితాలు ఇవ్వడంతో తాము చేసేది ఏమీ లేదని, రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

43మందిలో ఒక్కరే..

యోగా కేంద్రం నుంచి ఏడాది కాలవ్యవధి కలిగిన పీజీ డిప్లమో కోర్సులో 43 మంది విద్యార్థులు చేరారు. ఇటీవల నిర్వహించిన రాత పరీక్షలు, వైవా పరీక్షలలో కేవలం ఒక విద్యార్థిని మాత్రమే ఉత్తీర్ణత సాధించింది.  42 మంది ఫెయిల్‌ అయ్యారు. అంతమంది విద్యార్థులు పరీక్ష తప్పడంతో మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు.

ఉదాసీనతే కారణమా..!

యోగా కేంద్రంలో సిబ్బంది, విద్యార్థులు ఎవరికి వారే అన్న చందంగా ఉంటున్నారని విమర్శలు వస్తున్నాయి. అంతర్గత కుమ్ములాటలు, రాజకీయాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ బోధన, శిక్షణ గాలికొదిలేశారని వినిపిస్తోంది.  యోగా కేంద్రం ఉన్నతాధికారుల ఉదాసీనతే ఇంతవరకు తీసుకువచ్చిందని సిబ్బంది అంటున్నారు. వర్సి టీ పాలకులు యోగా కేంద్రంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గతంలో ఇదే కేంద్రంలో భారీగా నిధులు గల్లంతయ్యాయి. కానీ ఇప్పటికీ అధికారులు ఈ సంఘటనకు బాధ్యులను గుర్తించి, చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గతంలో ఇక్కడ పనిచేసే ఉద్యోగులను ఇష్టారాజ్యంగా బదిలీలు చేయడం, కొన్ని థెరపీ విభాగాలను మూసివేయడం జరిగాయి. వీటన్నింటిపై వర్సిటీ అధికారులు దృష్టి పెడితే యోగా కేంద్రం పూర్తిస్థాయిలో ప్రక్షాళన జరిగే అవకాశం ఉంది.  

హాజరే లేకుంటే పరీక్షలకు అనుమతెలా?

యోగా కేంద్రం కోర్సుల నిర్వహణలో డొల్లతనం బయటపడుతోంది. నామమాత్రంగా కోర్సులు నిర్వహించడం ఇక్కడ సర్వసాధారణ విషయంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నిర్వహించిన కోర్సులో అధిక శాతం మంది తరగతులకు నామమాత్రంగా హాజరయ్యారని తెలుస్తోంది. దీంతో వీరికి అవగాహన లేక పరీక్షలలో తప్పారని ఆచార్యులు అంటున్నారు. వీరు తరగతులకు హాజరు కానప్పుడు వీరిని పరీక్షలకు ఏ విధంగా అనుమతించారనే విషయానికి యాజమాన్యం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది.

విచారణ చేస్తాం

విద్యార్థుల నుంచి ఫిర్యాదు వచ్చింది. దీనిపై అధ్యాపకుల నుంచి ప్రాథమికంగా వివరాలు తీసుకున్నాం. గత నవంబర్‌లో జరిగిన పరీక్షల ఫలితాలు ఇవి. విద్యార్థులు సరిగా తరగతులకు రాలేదని, పరీక్షలలో సమాధానాలు సరిగా రాయలేదని అధ్యాపకులు అంటున్నారు. విద్యార్థులు మాత్రం కావాలనే ఫెయిల్‌ చేశారని వాదిస్తున్నారు. ఇద్దరి వాదనలు విన్నాం. రిజిస్ట్రార్‌ దృష్టికి సమస్యను తీసుకువెళ్లాం. ప్రశ్నాపత్రాలను మరొకరితో మూల్యాంకనం చేయించే దిశగా ఆలోచన చేస్తున్నాం. సమస్యను త్వరలో పరిష్కరిస్తాం.

                                                                                             – ఆచార్య టి.వి.ఆనందరావు, సంచాలకుడు, ఏయూ యోగా కేంద్రం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top