‘ఇన్నర్ ఇంజనీరింగ్’తో సామర్థ్యం పెంపు

‘ఇన్నర్ ఇంజనీరింగ్’తో సామర్థ్యం పెంపు - Sakshi

  • ఒత్తిడిని జయించేందుకు శిక్షణా తరగతులు దోహదం: సీఎం

  • మంత్రులు, అధికారులకు ఆధ్యాత్మిక, యోగా తరగతులను ప్రారంభించిన చంద్రబాబు

  • సాక్షి, హైదరాబాద్: మంత్రులు, అధికారులు పనిలో ఒత్తిడికి గురైనప్పుడు, సమస్యలు తలెత్తినప్పుడు, సంక్షోభం వచ్చినప్పుడు సమర్థంగా ఎదుర్కోవడానికి ‘ఇన్నర్ ఇంజనీరింగ్ ఫర్ జాయ్‌ఫుల్ లివింగ్’ పేరిట జగ్గీ వాసుదేవ్ నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక, యోగా తరగతులు ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. దీనివల్ల అధికార యంత్రాంగం సామర్థ్యం పెరుగుతుందని విశ్వాసం వెలిబుచ్చారు. మూడు రోజులపాటు సాగనున్న శిక్షణా తరగతులను గురువారం ఆయన ప్రారంభించారు.



    ఈ సందర్భంగా మంత్రులు, అధికారులనుద్దేశించి మాట్లాడారు. ‘‘ఒత్తిడిలో ఉంటే ఏకాగ్రత ఉండదు. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. బీపీ, షుగర్ వ్యాధులు పీడిస్తాయి. ‘ఇన్నర్ ఇంజనీరింగ్’ శిక్షణా తరగతులకు హాజరైన తర్వాత.. మంత్రులు, అధికారులు ఒత్తిడిని జయిస్తారు. ఫలితంగా ఏకాగ్రతతో మరింత మెరుగ్గా పనిచేస్తారనే నమ్మకం నాకుంది’’ అని చెప్పారు. జీవితాలను సౌకర్యవంతం, సుఖమయం చేయడానికి టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో, మనసును ఆరోగ్యంగా ఉంచడానికి ఇన్నర్ ఇంజనీరింగ్ దోహదం చేస్తుందని పేర్కొన్నారు.



    ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన తొలిరోజు కార్యక్రమానికి మంత్రులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. తొలి రోజు మూడు ఆసనాలు వేయటాన్ని జగ్గీ వాసుదేవ్ నేర్పించి.. వాటివల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. వ్యక్తిత్వ వికాసంతోపాటు అధికారులు, రాజకీయనేతలు సామాజిక బాధ్యతతో ఎలా వ్యవహరించాలో ఉద్బోధించారు.

     

    పాలనకు బ్రేక్



    ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పాలనకు నాలుగు రోజులు బ్రేక్ పడింది. మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు గురువారం నుంచి నాలుగు రోజుల పాటు విధులకు దూరంగా ఉండనున్నారు. గురువారం నుంచి శనివారం వరకు మూడు రోజులపాటు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో ‘ఇన్నర్ ఇంజనీరింగ్, ఆనందమయ జీవనానికి’ పేరిట మంత్రులు, అఖిల భారత సర్వీసు అధికారులకు ప్రభుత్వం ఆధ్యాత్మిక తరగతులు నిర్వహిస్తోంది. తదుపరి ఆదివారం సెలవు కావడంతో.. మంత్రులు, అధికారులు తిరిగి సోమవారమే విధులకు హాజరుకానున్నారు. ఆధ్యాత్మిక తరగతులు ప్రారంభమైన తొలిరోజు.. గురువారం సచివాలయం బోసిపోయి కనిపించింది. ఇదే పరిస్థితి శనివారందాకా కొనసాగనుంది.

     

    కలెక్టర్లూ హైదరాబాద్‌లోనే..

    మరోవైపు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు కూడా ఆధ్యాత్మిక శిక్షణలో ఉండటంతో జిల్లాల్లోనూ పాలన గాడి తప్పుతోందనే విమర్శలొస్తున్నాయి.

     

    ఐఏఎస్‌లతోపాటు ఐపీఎస్‌లూ శిక్షణలో పాల్గొంటున్న నేపథ్యంలో.. శాంతిభద్రతల పరిరక్షణపై ఆందోళన నెలకొంది.

     

    ఏపీకి ఏఎస్‌వోల కొరత..

    సచివాలయంలో ప్రస్తుతం 380 విభాగాలు(సెక్షన్లు) ఉన్నాయి. విభజన తర్వాత 440 మంది ఏఎస్‌వోల(అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్)ను ఏపీకి కేటాయించారు. సాగునీటి శాఖలో 13 సెక్షన్లకు.. ముగ్గురే ఏఎస్‌వోలు ఉన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top