అవును.. టెన్త్‌ పేపర్‌ లీకైంది!

అవును.. టెన్త్‌ పేపర్‌ లీకైంది! - Sakshi


శాసనసభలో అంగీకరించకనే అంగీకరించిన చంద్రబాబు

ప్రతిపక్షం సభ నుంచి వాకౌట్‌ చేశాక లీకేజీలపై స్పందించిన సీఎం



సాక్షి, అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రం లీకయినట్లు సీఎం చంద్రబాబు అంగీకరించకనే అంగీకరించారు. నెల్లూరు లోని ధనలక్ష్మీపురంలోని నారాయణ హైస్కూల్‌లో పనిచేసే వాచ్‌మన్‌ ప్రవీణ్‌ ఈనెల 25న ఉదయం 9.25 గంటలకు సెల్‌ఫోన్‌ ద్వారా పదో తరగతి ప్రశ్నపత్రాన్ని ఫోటో తీసి వాట్సాప్‌లో పంపారని శాసనసభలో చెప్పారు. పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయి. అంటే.. పరీక్ష ప్రారంభానికి ముందే ప్రశ్నపత్రం లీకైనట్లు సీఎం చంద్రబాబే అంగీకరించినట్లు స్పష్టమైంది. కానీ.. ఇది లీకేజీ కాదని మాల్‌ ప్రాక్టీస్‌ కిందకు వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.



ప్రతిపక్షం సభలో లేని సమయంలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ధనలక్ష్మీపురంలోని నారాయణ హైస్కూల్‌లో పనిచేసే వాటర్‌ బాయ్‌ ప్రవీణ్‌ సెల్‌ఫోన్‌లో ప్రశ్నపత్రాన్ని ఫోటో తీసి.. వాట్సప్‌లో పంపారని తెలిపారు. అదే పశ్నపత్రాన్ని నెల్లూరు సాక్షి టీవీ విలేకరి 10.25 గంటలకు డీఈవోకు వాట్సాప్‌లో పంపారని చెప్పారు. దీనిపై పాఠశాల విద్య డైరెక్టర్‌కు 11.15 గంటలకు డీఈవో ఫిర్యాదు చేశారని.. ఆ వెంటనే ఆ పరీక్ష కేంద్రానికి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ను, జిల్లా పరిశీలకుడు, రాష్ట్ర పరిశీలకుడిని పంపి విచారణ చేయించామని చెప్పారు.



పరీక్ష కేంద్రంలో ఏడో నెంబర్‌ గదిలో పరీక్ష పత్రం లీకైందని గుర్తించి.. ఇన్విజిలేటర్‌ మహేష్‌ను సస్పెండ్‌ చేశామని తెలిపారు. పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేయించి.. విచారణ చేయాలని నెల్లూరు ఎస్పీని ఆదేశించామని.. దోషులు ఎవరైనా వదిలిపెట్టే ప్రశ్నే లేదని చెప్పుకొచ్చారు. పశ్నపత్రం ‘సాక్షి’ టీవీ విలేకరికే ఎలా వచ్చిందని.. డీఈవోకు ఎందుకు పంపారని.. ఇందులో ఏదో కుట్ర ఉందని.. విచారణలో అన్ని విషయాలు వెల్లడవుతాయని చెప్పారు. ఇది మాల్‌ప్రాక్టీస్‌ మాత్రమేనని. లీకేజీ కాదంటూ చెప్పుకొచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top