డ్వాక్రా మహిళలకు..మాఫీ దగా


 ‘రుణాలు చెల్లించకండి. అధికారంలోకి వచ్చాక అన్నీ మాఫీ చేస్తాం’ అంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊరూవాడా ఊదరగొట్టేశారు. ఆ మాట నమ్మిన మహిళలు ఓటేసి అధికారాన్ని కట్టబెట్టారు. ఆయన గద్దెనెక్కి ఏడాదైంది. రుణమాఫీతో తమ బతుకులు బాగుపడతాయని మహిళలంతా భావించారు. మాఫీ సొమ్ము తమ ఖాతాలో జమ కావడమే మిగిలి ఉందని ఎదురు చూస్తున్నారు. మాఫీ హామీ అమలు చేయకపోగా, సంఘ సభ్యురాలికి మూడు విడతల్లో విడతకు రూ.3వేల చొప్పున మూలధన నిధికి జమ చేస్తామంటూ సర్కార్ నమ్మిస్తోందని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మాఫీపై తమ ఆశలు ఆవిరైపోయాయని ఆవేదన చెందుతున్నారు.

 - సాక్షి ప్రతినిధి, కాకినాడ

 

 జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 89 వేల స్వయం సహాయక సంఘాలున్నాయి. వాటి పరిధిలో ఉన్న మహిళా సంఘాల సభ్యులకు 2014 నాటికి రూ.వెయ్యి కోట్ల రుణ బకాయిలున్నాయి. బాబు గద్దెనెక్కాక బకాయిలు చెల్లించాలంటూ బ్యాంకర్లు తెచ్చిన ఒత్తిళ్లు భరించలేక మహిళలు అప్పోసొప్పో చేసి సుమారు రూ.600 కోట్లు తిరిగి చెల్లించేశారు. ఇంకా రూ.400 కోట్ల బకాయిలున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

 

 గ్రామీణ ప్రాంతాల్లోని 81,155 సంఘాల్లో 8,04,549 మంది మహిళలున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చేపట్టిన ఆధార్ సీడింగ్ ప్రక్రియలో నమోదైన మహిళలు ఏడున్నర లక్షల పైమాటే. రుణమాఫీకి కొత్త అర్థం చెబుతూ  సర్కార్ ప్రకటించిన కేపిటల్ ఇంక్లూజన్ (మూలనిధికి జమ) ప్రకారొ ఒక్కో సభ్యురాలికి రూ.10 వేల చొప్పున 7,34,811 మందికి రూ.734.81 కోట్లు జమ చేస్తామంటున్నారు. ఇందులో మొదటి విడత ఒక్కో సభ్యురాలికి రూ.3 వేల చొప్పున రూ.220.44 కోట్లు, వడ్డీ రాయితీ కింద రూ.74.63 కోట్లు జమ అవుతాయని డీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు.

 

  పట్టణ ప్రాంతాల్లో 16,826 సంఘాలున్నాయి. వాటిలో 1,74,514 మంది సభ్యులున్నారు. వారిలో 1,59,484 మంది ఆధార్ సీడింగ్‌లోకి వచ్చారు. వీరికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.159.48 కోట్లు జమ చేస్తామంటున్నారు. ఇందులో తొలి విడతగా 1,59,484 మంది సభ్యులకు రూ.47.84 కోట్లు జమ చేస్తామని చెబుతున్నారు. వడ్డీ రాయితీగా రూ.11 కోట్లు ఇస్తామని అంటున్నారు.అయితే, అధికారులు చెబుతున్న ఈ మాటల్ని డ్వాక్రా మహిళలు విశ్వసించలేకపోతున్నారు. దీనికి చంద్రబాబు ప్రభుత్వ తీరే కారణం. అధికారంలోకి రాగానే అణాపైసలతో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పారు. తీరా అందలమెక్కాక రూ.10వేలు రివాల్వింగ్ ఫండ్ ఇస్తామని నమ్మబలికారు. ఏడాదిగా నాన్చుతూ చివరకు తొలి విడత రూ.3 వేల చొప్పున ప్రకటించిన సర్కార్, ఆ మొత్తాన్ని జమ చేసేందుకు సవాలక్ష నిబంధనలు పెట్టింది. ఇచ్చేది మూలధనం కిందే అయినా రుణాలన్నీ మాఫీ చేసేస్తున్నామంటూ తమను నిలువునా దగా చేసిందని మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. రుణమాఫీతో సంబంధం లేకుండా బకాయిలున్నా, లేకున్నా.. 2014 మార్చి 31 వరకూ ఉన్న సంఘాల్లోని సభ్యులందరికీ రూ.3వేల వంతున ఖాతాలో వేస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనివల్ల తమకు ఎటువంటి ప్రయోజనమూ లేదని, బ్యాంకులకు మాత్రమే మేలని మహిళలు మండిపడుతున్నారు.

 

  ఈ మొత్తాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకోబోమని, పూర్తిగా పొదుపు ఖాతాలోనే ఉంచుతామంటూ తీర్మానాలు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. దీనిపై మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటువంటప్పుడు బాబు ఎన్నికల్లో ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీ వాగ్దానం ఏమైనట్టని మహిళలు ప్రశ్నిస్తున్నారు.

  రూ.3వేలపై పది రెట్ల రుణం (రూ.3 లక్షలు) ఇప్పిస్తామని సర్కార్ చెబుతోంది.

 

 అదే బ్యాంకులో ఆ సంఘానికి వడ్డీతో కలిపి రూ.2 లక్షల నుంచి రూ.నాలుగైదు లక్షల వరకూ బకాయిలుంటే కొత్త రుణం ఏవిధంగా ఇస్తుందో చెప్పడం లేదు. ఒక వేళ నిజంగానే రుణం ఇచ్చినప్పటికీ ఆ మొత్తాన్ని ఇప్పటికే రుణ మాఫీ అమలవక పేరుకుపోయిన బకాయిలకు మినహాయించుకుంటాయని డ్వాక్రా సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇటీవల గొల్లప్రోలు మండలం చేబ్రోలులో సుమారు 30 సంఘాల మహిళలు ఆందోళన చేశారు.

 

 పొదుపు కూడా ఇవ్వడం లేదు

 ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని రుణం కట్టడం మానేశాం. అయితే రుణం మాఫీ కాకపోగా మా ఖాతాలోని డబ్బును కూడా తీసేసుకున్నారు. బ్యాంకుకు వెళితే పొదుపు చేసుకున్న డబ్బులు కూడా ఇవ్వమంటున్నారు. ప్రస్తుతం రూ.3వేలు ఇస్తామంటున్నారు. అవి ఎప్పటికి వస్తాయో తెలియడం లేదు.

 

 - కర్నీడి పాపాయమ్మ, సుంకటరేవు, తాళ్లరేవు మండలం

 పూర్తి రుణమాఫీ జరుగుతుందని ఆశపడ్డాం

 మా గ్రూపు సభ్యులం ఒక్కొక్కరం 2013లో సుమారు రూ.20 వేలు రుణం తీసుకున్నాం. ప్రతి నెలా సక్రమంగా వాయిదా చెల్లించేవాళ్లం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం టీడీపీ ప్రభుత్వం పూర్తిగా రుణమాఫీ చేస్తుందని ఆశపడి కొన్ని నెలలు బాకీ చెల్లించలేదు. కానీ ప్రస్తుతం రూ.10 వేలు మాత్రమే రుణమాఫీ చేస్తున్నారు. అది కూడా వాయిదాల పద్ధతిలో, మూలధనం కింద వేస్తున్నారని తెలిసింది. పూర్తి రుణమాఫీ అవుతుందనుకున్న మా ఆశల మీద ప్రభుత్వం నీళ్లు చల్లింది.

 

 - కె.రమాదేవి, గోకవరం

 గాదెలో బియ్యంలా..

 గాదిలో బియ్యం గాదిలోనే ఉండాలి, బిడ్డలు మాత్రం నవరత్నాల్నా తయారవ్వాలన్న సామెత మాదిరిగా చంద్రబాబు తీరు ఉంది. మాఫీ అన్నాడు. ఇప్పుడు పెట్టుబడి నిధిగా ఉంచుకోండి, వాడుకోవద్దంటున్నాడు. ఇదేం విచిత్రం?    - ముసమల్ల వెంకాయమ్మ, రాజానగరం

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top