సేవా నివాళి

సేవా నివాళి - Sakshi


 శ్రీకాకుళం సిటీ: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డికి జిల్లా ప్రజలు ఘన నివాళులర్పించారు. పేదలకు ఆయన అందించిన పథకాలను, చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ వై.ఎస్. విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేసి, పూల మాలలు వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలతోపాటు ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ నేతలు కూడా వై.ఎస్. వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడంతో జిల్లా అంతా వై.ఎస్. నామస్మరణతో మార్మోగింది.

 

  జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆధ్వర్యంలో ఏడు రోడ్ల కూడలిలోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. వైఎస్‌ఆర్ దేశానికే ఆదర్శనీయ నేత అని, ఆయన ఆశయాల సాధనకు సమిష్టిగా కృషి చేస్తామని వక్తలు పేర్కొన్నారు. అనంతరం శరణ్య మనోవికాస కేంద్రం, బెహరా మనోవికాస కేంద్రంలోని బధిరులకు పండ్లు, బిస్కెట్లు, దుప్పట్లు తదితర సామగ్రిని పంపిణీ చేశారు. ఈక ార్యక్రమంలో పార్టీ సీఈసీ సభ్యురాలు వరుదు కళ్యాణి, సీజీసీ సభ్యుడు అంధవరపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

 

  నరసన్నపేటలో పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో వైఎస్ వర్ధంతి నిర్వహించారు. స్థానిక వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ రాజన్న పాలనను జనం ఎన్నటికీ మరచిపోలేరని, ఆ మహానేత పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి, సారవకోట ఎంపీపీ కూర్మినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలసలో మాజీ మంత్రి తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ విగ్రహాన్ని పూలమాలలతో ముంచెత్తారు. రాష్ట్రంలో ఈ రోజు కోట్లాది మంది ఆరోగ్యంగా, సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఉన్నారంటే అదంతా వైఎస్సార్ పుణ్యమేనని ఈ సందర్భంగా సీతారాం అన్నారు. సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి అందించిన ఘనత ఎన్టీఆర్, వైఎస్సార్‌లదేనని అన్నారు.

 

 

  టెక్కలిలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో వైఎస్‌ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి, రాష్ట్ర బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ నేతలు సంపతిరావు రాఘవరావు, దువ్వాడ వాణి, జెడ్పీటీసీ కె.సుప్రియ, పేరాడ తిలక్ తదితరులు పాల్గొన్నారు. పలాసలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి జుత్తు జగన్నాయకులు ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించారు. ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ శ్రీధర్ ఆధ్వర్యంలో 500 మంది పేదలకు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పార్టీ నేతలు వజ్జ బాబూరావు, కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

 

  ఇచ్ఛాపురంలో నియోజకవర్గ ఇన్‌చార్జి నర్తు రామారావు ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.   ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుమిత్ర అనే పేదరాలికి పార్టీ నేత శ్యాంప్రసాద్‌రెడ్డి రూ. 3వేల ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పి.రాజ్యలక్ష్మి, కంచిలి ఎంపీపీ ఇప్పిలి లోలాక్షి తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో పాతపట్నం, హిరమండలం, కొత్తూరు, మెళియాపుట్టి, ఎల్‌ఎన్.పేట మండలాల్లో వైఎస్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

 

  పాలకొండ నియోజకవర్గంలో పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం తదితర మండలాల్లో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా మండలాల పార్టీ కన్వీనర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. రాజాం నియోజకవర్గంలో రాజాం, వంగర, సంతకవిటి, రేగిడిలలో వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ మండల కన్వీనర్లు, జెడ్పీటీసీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో పార్టీ ఇన్‌చార్జి గొర్లె కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top