చెరిగిపోనిది నీ నవ్వు.. చిరంజీవివి నువ్వు

చెరిగిపోనిది నీ నవ్వు.. చిరంజీవివి నువ్వు - Sakshi


నువ్వు వస్తావని ఆంధ్రావని ఆశగ చూస్తోందన్నా.. రాజన్నా..!

 నువ్వు వెళ్లిపోయావని అంటున్నారు కొందరు.. ఎక్కడికీ వెళ్లలేదని చెబుతున్నాయి.. నీ పథకాల ఫలాలు.. వాటిని అందుకున్న పేదల గుండె చప్పుళ్లు.. నిరంతరం నీ పేరునే స్మరిస్తున్నాయి.. నీ పాలన మళ్లీ రావాలని తపిస్తున్నాయి.ఐదున్నరేళ్ల పాలనలో నువ్వందించిన ప్రాజెక్టులు, పథకాలు.. ఎన్నో.. ఎన్నెన్నో.. దేని గురించని ప్రస్తావించాలి.. దేనికదే ప్రత్యేకమైనది.. వర్సిటీ ఏర్పాటు చేసి ఉన్నత విద్య కల సాకారం చేశావు. రిమ్స్‌నిచ్చి ఆధునిక ఆరోగ్యభాగ్యం కల్పించావు. వంశధార, తోటపల్లి విస్తరణకు ఊతమిచ్చి రైతు బాంధవుడివయ్యావు. ఇక ఆరోగ్యశ్రీ, పింఛన్ల ఫలాలు అందుకున్న ప్రతి ఇంటా నువ్వు నిత్యం వర్థిల్లుతూనే ఉన్నావు. నువ్వు భౌతికంగా దూరమైన ఈ ఐదేళ్లు.. మాకు ఐదు యుగాలు.. ఈ సంధి కాలంలో ఎన్నో కష్టాలు.. సమస్యలు.. విభజన ఉత్పాతాలు.. నువ్వుంటే ఇవన్నీ జరిగేవా?.. అందుకే రాజన్నా.. నువ్వు మాతోనే.. మాలోనే ఉండాలి.. నీ పాలన మళ్లీ కావాలి.. దాని కోసం.. ఆ సువర్ణయుగం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాం.

 

 పలు సేవా కార్యక్రమాలు

 శ్రీకాకుళం అర్బన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం వాడవాడలా పార్టీశ్రేణులు, అభిమానులు నిర్వహించాలని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మంగళవారం ఉదయం 10 గంటలకు శ్రీకాకుళంలోని వైఎస్‌ఆర్ కూడలి వద్ద ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తామన్నారు.  10.30 గంటలకు కరజాడలోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేస్తామని, 11 గంటలకు నరసన్నపేటలోని వృద్ధజనాశ్రమంలో, 11.30 గంటలకు చల్లవానిపేటలో, 11.45 గంటలకు కోటబొమ్మాళిలో వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు టెక్కలిలోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తామన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు శ్రీకాకుళం అఫీషియల్ కాలనీలోని శరణ్య మనోవికాసకేంద్రంలో పండ్లు పంచిపెట్టనున్నామన్నారు.

 

 ధర్మానకు స్వాగతం పలకండి

 కాగా ఈ నెల మూడో తేదీన వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులై జిల్లాకు తొలిసారిగా వస్తున్న సందర్భంగా ఆరోజు ఉదయం 9.30 గంటలకు  పార్టీ శ్రేణులంతా  ఆమదాలవలస చేరుకుని స్వాగతం పలకాలని కోరారు.

 

 బాపు మృతికి సంతాపం

 ప్రముఖ చిత్రకారుడు, చలనచిత్ర దర్శకుడు బాపు మర ణం తెలుగుజాతికి తీరనిలోటని, పార్టీ తరపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామన్నారు. బాపు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  ఈ సమావేశంలో ధర్మాన కృష్ణదాస్ తదితరులు పాల్గొన్నారు.

 

  ఘన స్వాగతం

 ఎచ్చెర్ల: వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షురాలిగా నియమితులైన తరువాత తొలిసారిగా శ్రీకాకుళం వచ్చిన రెడ్డి శాంతికి నాయకులు, కార్యకర్తలు కుశాలపురం సింహద్వారం జాతీయ రహదారి వద్ద ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి డే అండ్ నైట్ కూడలి మీదుగా వైఎస్‌ఆర్ కూడలి వద్దకు చేరుకుని  వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top