జీఆర్పీ ఇంజినీర్లపై కలెక్టర్ ఆగ్రహం

జీఆర్పీ ఇంజినీర్లపై కలెక్టర్ ఆగ్రహం - Sakshi


మంత్రాలయం :

 ‘‘కరెంట్ ఇప్పించి 45 రోజులైంది. ఇప్పటి వరకు నీళ్లు పంపింగ్ చేయలేదు. కాలయాపనతో రైతాంగానికి నష్టం తెచ్చారు. కాంట్రాక్టర్ ఇంతగా నిర్లక్ష్యం చేస్తున్నా ఇంజినీర్లుగా మీరేం చేశారు..  కలెక్టర్ ఆదేశించినా లెక్కలేదా..తమాషాగా ఉందా.. ఈ జిల్లా నుంచి గెంటేస్తా.’’ అంటూ కలెక్టర్ విజయమోహన్ గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఇంజినీర్లు, కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మూడోసారి గురురాఘవేంద్ర ప్రాజెక్టు పరిధిలోని మాధవరం, బసలదొడ్డి ఎత్తిపోతల పథకాల పరిశీలన జరిపారు.



నాలుగేళ్లుగా పనులు చేస్తూనే ఉన్నారు. కాలయాపన చేసి విలువైన ప్రభుత్వ సొమ్మును వృథా చేశారు. రైతులకు చుక్క నీరు ఇవ్వలేదు. జిల్లాకు తీరని నష్టం కల్గించారు. కాంట్రాక్టర్ ఇంతగా నిర్లక్ష్యం చేస్తున్నా ఇంజినీర్లుగా మీరేం చేశారు.’’ అంటూ నిలదీశారు. కలెక్టర్ నిలదీతకు బదులు చెప్పుకోలేక అధికారులు, కాంట్రాక్టర్ నీళ్లు నమిలారు. వెంటనే సదరు కాంట్రాక్టర్ సంస్థను బ్లాక్ లిస్టులో ఉంచాలని ఆదేశించారు. మీ నిర్లక్ష్యం మూలంగా మూడుసార్లు ప్రాజెక్టును పరిశీలించాల్సి వచ్చిందన్నారు.



ఏడాదిలో మూడు పర్యాయాలు రిజర్వాయర్లను నింపాల్సి ఉందని, ఇప్పటికీ చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. మీ నిర్లక్ష్యం మూలంగా నదిలోని నీరంతా కిందకు పోయిందన్నారు. రైతు పొలాలకు చుక్కనీరు ఇవ్వలేదు. కోట్లు వెచ్చించినా లాభమేముందన్నారు. ఒక్కరోజులో పంపుహౌస్‌లను రన్ చేయాలని, లేనిపక్షంలో అందరిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.



సహనానికి పరీక్ష పెట్టొదని, వెంటనే పనులు చేయకపోతే ప్రభుత్వ ధనాన్ని వృథా చేసినందుకు కాంట్రాక్టు సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. ముందుగా ఆయన బసలదొడ్డి పంపుహౌస్ స్టేజ్-1, మాధవరం జలాశయాలను పరిశీలించారు. సబ్ కాంట్రాక్టు ఇచ్చిన సంస్థను బ్లాక్ లిస్టు ఉంచేందుకు నివేదికలు తయారు చేయాలని ఆర్డీవో వెంకటకృష్ణకు ఆదేశించారు. అందుకు ఎస్‌ఈ నాగేశ్వరరావుకు తగు సూచనలు చేశారు. పర్యటనలో తహశీల్దార్ శ్రీనివాసరావు, జీఆర్పీ ఈఈ నారాయణస్వామి, డీఈ అన్వర్‌బాష, సర్వేయర్ జ్ఞానప్రకాష్ పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top