నేరాలకు చెక్

నేరాలకు చెక్ - Sakshi


ప్రజలు చెప్పిన సమస్యలు.

 కృష్ణానగర్, రాజ్‌విహార్, బిర్లా జంక్షన్ వద్ద మద్యం షాపుల ముందే తాగుతున్నారు. దీనిని అరికట్టాలి.

 

 చైన్ స్నాచింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి.

 

 పోలీసులు బీట్లు సరిగా చేయడం లేదు. ఉన్న బీటు సిబ్బంది కూడా మామూళ్ల కోసం ఇసుక ట్రాక్టర్ల వెంట పడుతున్నారు.

 

 కొత్త బస్టాండ్ వద్ద వ్యభిచారం జోరుగా సాగుతోంది.

 విద్యార్థులు త్రిబుల్ రైడింగ్ చేస్తున్నారు. వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

 

 ఎస్పీ హామీలు...!

 

 బీట్ల సంఖ్య పెంచి పోలీసుల గస్తీ ముమ్మరం చేస్తాం.

 మద్యం షాపుల ముందు తాగకుండా చర్యలు తీసుకుంటాం.

 చెన్ స్నాచింగ్‌లను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు రంగంలో ఉన్నాయి. గతంలో వాహనాల మీద వచ్చి చైన్‌స్నాచింగ్‌లు చేసేవారు. కొత్తగా కాలినడకన వచ్చి చేస్తున్నారు. వీరిపై కూడా నిఘా పెట్టాం.

 వాహనాల తనిఖీలు ముమ్మరం చేస్తాం.

నేరాల అదుపులో ప్రజల భాగస్వామ్యం పెంచుతాం. ప్రజల అవగాహన పెంచేలా ఇంటికో కరపత్రాన్ని పంచుతాం.

 వ్యభిచారాన్ని అరికట్టేందుకు వెంటనే చర్యలు తీసుకుంటాం.  

 

 ఆయన పేరు ఆకె రవికృష్ణ. కర్నూలు జిల్లా పోలీసు బాస్ ఆయన. ప్రజల శాంతి భద్రతలతోపాటు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం ఆయన ప్రత్యేకత. ఆర్డర్లీ రాజ్యమేలే పోలీసు వ్యవస్థలో తన కింద పనిచేసే సిబ్బందికి ఏదైనా ఆపద వస్తే ఆదుకునే తత్వం ఆయనది. తాజాగా ప్రమాదంలో చనిపోయిన గూడూరుకు చెందిన కానిస్టేబుల్ స్వర్ణకుమార్ ఇంటికి వెళ్లారు. తన కోసం ప్రత్యేకంగా ఏమీ వంట చేయవద్దని.. మీరు వండుకున్నదే పెట్టాలన్నారు. నేను మీ బిడ్డనే అని కానిస్టేబుల్ తల్లిదండ్రులకు ఊరటనిచ్చారు.



ఇదీ ఆయనలో ఉన్న బాస్ నైజానికి ఒక కోణం కాగా... పనిచేయకుండా బద్దకిస్తే అంతేస్థాయిలో ఫైర్ అవుతూ మెమోలు ఇవ్వడం ఆయనలోని మరో కోణం. పోలీసు అంటే కేవలం శాంతి భద్రతలే కాదు.. అంటరానితనం వంటి సామాజిక దురాచారాలను కూడా పారదోలాలనేది ఆయన నైజం. కొద్దిరోజుల క్రితం జిల్లెల, జలదుర్గం గ్రామాల్లో అంటరానితనం పారదోలేందుకు దగ్గరుండి మరీ దళితులందరికీ క్షవరం చేయించారు. అంతేకాదు.. రాత్రివేళల్లో పోలీసుస్టేషన్‌కు వెళితే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందా? లేదా తెలుసుకునేందుకు ఏకంగా రాత్రిపూట కె. నాగలాపురం పోలీసుస్టేషన్‌కు సామాన్యుడిగా వెళ్లారు.



పోలీసుల నిర్లక్ష్యాన్ని కళ్లారా చూసి... ఇలాంటివి జరిగితే సహించేది లేదని పోలీస్ బాస్ అంటే ఎలా ఉండాలో చూపారు ఆకె రవికృష్ణ. ఆయనతో ఈ వారం సాక్షి ‘వీఐపీ రిపోర్టర్’ కార్యక్రమం.. సాక్షి వీఐపీ రిపోర్టర్ కార్యక్రమంలో భాగంగా ఆయన కర్నూలులోని అవుట్‌డోర్ స్టేడియానికి శనివారం ఉదయం ఆరు గంటలకే వచ్చారు. స్టేడియంలో జాగింగ్ చేస్తున్న వాకర్లను జిల్లాలో పోలీసు తీరును, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ఇంకా ఏం చేయాలో సలహాలు ఇవ్వాలని కోరారు. వారు చెప్పిన సమస్యలపై వెంటనే స్పందించారు. ఏం చర్యలు తీసుకుంటామో తెలిపారు.



ప్రత్యేకంగా ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన చైన్ స్నాచింగ్, మందు బాబుల ఆగడాలు, వ్యభిచారం, పోలీసులు గస్తీ చేయకపోవడంపై వెంటనే స్పందించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని హామీనిచ్చారు. అపార్టుమెంట్లు, వాణిజ్య ప్రాంతాల్లో తప్పనిసరిగా నిఘా ఉండేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఇదీ వాకర్స్‌తో ఎస్పీ సాగించిన మాటామంతీ....



 ఎస్పీ : నేను జిల్లా ఎస్పీ రవిక్రిష్ణ. సాక్షి తలపెట్టిన వీఐపీ రిపోర్టర్ జిల్లా పోలీసింగ్‌పై అవగాహన కార్యక్రమం చేస్తున్నాం. ముందుగా మీ పేరు చెప్పండి.?

 వాకర్ : నా పేరు శ్రవణ్‌కుమార్, స్కంద రియల్ ఎస్టేట్ జీఎం.

 ఎస్పీ : పోలీసింగ్ ఎలా ఉంది?

 శ్రవణ్‌కుమార్ : మీరొచ్చిన తర్వాత అవేర్‌నెస్ పెరిగింది. మీరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టగానే సైకిల్‌పై తిరగడం, కాలనీల్లో పర్యటించడం, ట్రాఫిక్ కంట్రోల్‌పై దృష్టి మళ్లించడం వంటి చర్యలు చేపట్టడం వల్ల మిగతా సిబ్బంది కూడా తమ పనులపై దృష్టి పెట్టారు.

 ఎస్పీ : వ్యాపార సముదాయాల వద్ద భద్రత ఎలా ఉంది ?

 శ్రవణ్‌కుమార్ : గతంలో బ్యాంకుల వద్ద దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడేవారు. ప్రస్తుతం పోలీస్ గస్తీ ఉండటం వల్ల పర్వాలేదు. అలంకార్ , యుకాన్ ప్లాజాల వద్ద గట్టి చర్యలు తీసుకుంటున్నారు.  

 ఎస్పీ : మీరు చెప్పండి. మీ పేరేంటి.? నగరంలో పోలీసుల పనితీరు ఎలా ఉంది.?

 వాకర్ : నా పేరు రమణ. కాలేజి పిల్లలు త్రిబుల్ రైడింగ్ పోతున్నారు. దీనివల్ల ఎదురుగా వచ్చే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అతివేగంగా వెళుతూ పక్కవాళ్లు ప్రమాదాలకు గురయ్యే విధంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల అతివేగంపై నిఘా పెట్టాలి.

 ఎస్పీ : డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. ఎలా ఉంది ?

 వాకర్ : నా పేరు రాజశేఖర్. మీరు మొదలెట్టిన డ్రంకెన్ డ్రైవ్ కార్యక్రమం బాగుంది. మద్యం ప్రియులకు అడ్డుకట్ట వేసినట్లయింది.

 శ్రవణ్‌కుమార్ : సార్.. మరో విషయం..

 ఎస్పీ : చెప్పండి ..

 శ్రవణ్‌కుమార్ :అపార్ట్‌మెంట్లలో సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోండి. గతంలో అపార్ట్‌మెంట్లలో నేరాలు ఎక్కువగా జరిగాయి. తరచుగా కూడా జరుగుతున్నాయి. మీ ఆఫీస్‌కు సమీపంలోనే గతంలో అపార్ట్‌మెంట్‌లో జంట హత్యల సంఘటన కూడా చోటుచేసుకుంది. సీసీ కెమెరాలు, వాచ్‌మెన్‌లను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటే నేరాలు తగ్గించేందుకు అవకాశం ఉంటుంది.

 ఎస్పీ : ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు డయల్ 100కు ఎప్పుడైనా ఫోన్ చేశావా ?

 శ్రవణ్‌కుమార్ : ఊ.. చేస్తూనే ఉన్నాం సార్. వారొచ్చేలోగా అల్లరి మూకలు వెళ్లిపోతున్నారు.

 ఎస్పీ : మీ సమస్య ఏమిటి చెప్పండి.

 వాకర్ : నాపేరు దావూద్ ఖాన్. కొత్తపేట. మునిసిపల్ కార్యాలయం దగ్గర ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.

 ఎస్పీ : ట్రాఫిక్ నియంత్రణ కోసం చర్యలు తీసుకుంటాం.

 ఎస్పీ : మీ ప్రాంతంలో రౌడీలున్నారా ?

 వాకర్ : సార్.. నా పేరు శంకర్ గౌడ్. మా ప్రాంతంలో రౌడీలు ఉన్నారు. అయితే వారిలో వచ్చిన మార్పో లేక మీరు తీసుకున్న చర్యలో తెలియదు కానీ రౌడీయిజం తగ్గింది. అయినా వారిపై నిఘా ఉంచడమే మంచిదని నా అభిప్రాయం సార్. ప్రస్తుతం ప్రజలు ఇంట్లో నుంచి ధైర్యంగా బయటికి వెళ్లగలుగుతున్నారు.

 ఎస్పీ : నగరంలో ఏమైనా సమస్య వస్తే పోలీసులకు చెబుతున్నావా.. ఎవరికి చెబుతున్నారు ?

 వాకర్ : సార్.. నా పేరు సునీల్‌కుమార్. మాంటిస్సోరిలో చదువుతున్నా. ఏవైనా సంఘటనలు జరిగితే డయల్ 100కు ఫోన్ చేస్తున్నాం. క్యూఆర్‌టీ వాహనం కూడా కాలనీలోకి వస్తుంది సార్.

 ఎస్పీ : మీ పేరు చెప్పండి ? మీ కాలనీలో పోలీసులు గస్తీ తిరుగుతున్నారా ?

 వాకర్ : నా పేరు మధుసూదన్. మెడికల్ రెప్. అశోక్‌నగర్‌లో ఉంటున్నాం.

 ఎస్పీ : సమస్యలేమైనా ఉన్నాయా ?

 మధుసూదన్ : అశోక్‌నగర్‌లో అల్లరి మూకల సమస్య ఎక్కువగా ఉంది. పల్సర్ వాహనాలపై చక్కర్లు కొడుతూ రాత్రి వేళల్లో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గతంలో రెండు సార్లు రెండవ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. పోలీసులు వెళ్లినప్పుడు మాత్రం అల్లరి మూకలు పరారవుతారు. పోలీసులు వెళ్లిపోగానే మళ్లీ యధా ప్రకారం వ్యవహరిస్తున్నారు. శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోండి.

 ఎస్పీ : మీ సమస్య ఏంటి ?

 వాకర్ : సార్.. నా పేరు శ్రీనివాసులు. ప్రభుత్వ ప్రెస్‌లో పని చేస్తున్నాను. ఎస్‌బీఐ కాలనీలో ఇళ్ల ముందు నిలబెట్టిన వాహనాలను చోరీ చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఇళ్ల ముందు ద్విచక్ర వాహనాలు పార్క్ చేసుకోవాలంటేనే భయపడుతున్నాం. శివారు కాలనీలకు గస్తీ పోలీసులు రావడం లేదు.

 ఎస్పీ : పోలీసులెలా పని చేస్తున్నారు.. సమస్యలేమైనా ఉన్నాయా..? ట్రాఫిక్ సమస్యలేమైనా ఉన్నాయా ?

 శ్రీనివాసులు : ఎస్పీ బంగ్లా ముందు తరుచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మీరు రాక ముందు ఎక్కువగా వుండేవి. ఇప్పుడు కూడా అడపాదడపా జరుగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఆటో డ్రైవర్ల నిర్లక్ష్యం. ఆటో డ్రైవర్లపై కఠినంగా వ్యవహరిస్తేనే ట్రాఫిక్ నియంత్రణ జరుగుతుంది.

 వాకర్ : సార్.. నా పేరు రవి. మద్యం షాపుల ముందు వాహనాలు పార్క్ చేసుకుని వాటిపైనే కూర్చుని తాగుతున్నారు. దీనివల్ల వాహనాల రాకపోకలకు సమస్య అవుతోంది. ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి వైన్ షాప్ దగ్గర ఇలాగే జరుగుతుంది.  రోడ్డుపైనే కూర్చుని తాగుతున్నారు.. కృష్ణానగర్‌లో మరీ ఎక్కువగా ఉంటుంది.

 ఎస్పీ : ఈ సమస్య డయల్ 100కు చెప్పారా..?

 రవి : లేదు సార్.. నేరుగా మీతోనే చెప్పాలని అనుకున్నాం. కానీ అనుకోకుండా మిమ్మల్ని కలిసే అవకాశం లభించింది. దాదాపు కిలోమీటరు పొడవున వైన్ షాపుల ముందు తోపుడు బండ్లు పెట్టి చికెన్, చేపలు, గుడ్లు, మిక్సర్ అమ్ముతున్నారు. మటన్ విక్రయాలు కూడా జరుపుతున్నారు. ఆ ప్రాంతంలో తిరగాలంటేనే మహిళలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే పోలీసులను పెట్టి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలి.

 ఎస్పీ : బీట్ సిస్టమ్ ఎలా ఉంది..?

 వాకర్ : సార్.. నా పేరు రమణారెడ్డి. రియల్టర్. పోలీసుల గస్తీ బాగానే ఉంది. కానీ గస్తీ విధుల కంటే కూడా ఇసుక ట్రాక్టర్లపైనే వారికెక్కువ నిఘా ఉంటుంది. మామూళ్ల కోసం పశువులు, బండల లారీలపై నిఘా ఉంచి మామూళ్లు దండుకుంటున్నారు. తుంగభద్ర నది నుంచి ఇసుక తీసుకెళ్లే వాహనాలను వెంబడించి మామూళ్లు వసూలు చేసుకుంటున్నారు తప్పా శివారు కాలనీలకు వెళ్లడం లేదు. కల్లూరు ఏరియాలో ఎక్కువగా ఈ వ్యవహారం జరుగుతుంది.

 ఎస్పీ : నగరంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి..

 వాకర్ : సార్.. నా పేరు శ్రీదేవి, మాది బాలాజీ నర్సింగ్ హోమ్ దగ్గర నాగిరెడ్డి కాలనీ. చైన్ స్నాచింగ్‌లు జరుగుతుండటంతో ఉదయం పూట వాకింగ్‌కు రావడానికి భయపడుతున్నాం. గట్టి చర్యలు తీసుకుంటే ఏమి ఇబ్బంది లేదు. మీరే పోలీసులకు సూచనలు ఇచ్చి గట్టి నిఘా ఏర్పాటు చేయాలి సార్.

 వాకర్ : సార్.. నా పేరు సురేష్. కొత్త బస్టాండ్ ఏరియాలో ఎక్కువగా వ్యభిచారం జరుగుతుంది. ఆ ప్రాంతంలో చిన్న పిల్లలు, మహిళలు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. వ్యభిచార కార్యక్రమాలపై నిఘా ఉంచాలి సార్.. లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు ఇబ్బంది పడతారు. నేను ఈ విషయం చెబుతున్నందుకు ఏమీ అనుకోవద్దు.. థ్యాంక్యూ సార్.

 ఎస్పీ : మీ పేరేంటి ?

 వాకర్ : అబ్దుల్లా సార్. ప్రమాదాల నివారణ కోసం మీరు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి. అక్కడక్కడ ప్రమాదాల నివారణ కోసం గోడలపై రాయించిన సూక్తులు చైతన్యపరుస్తున్నాయి. దిక్కులు చూడకు జాగ్రత్త.. అనే సూక్తులను నేను ట్రావెల్ చేసేటప్పుడు చూసి జాగ్రత్తగా నడుపుతున్నాను. అయితే ఎదుటి వారు కూడా అలా వ్యవహరిస్తే బావుంటుంది. ఇతర వాహనాలు వచ్చి కొట్టేస్తున్నాయి. ఇద్దరు పల్సర్ బైక్‌పై వస్తున్నారు. వెనుక నుంచి వచ్చి కొట్టారు. బండి నంబర్ కూడా చూసుకోలేదు. ట్రాఫిక్‌పై మరింత చర్యలు తీసుకుంటే బాగుంటుంది సార్.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top