అధ్వానం

అధ్వానం - Sakshi


జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం  సక్రమంగా అందడం లేదు. ఫలితంగా చిన్నారులు, గర్భవతులు, బాలింతలకు ఆకలి కేకలు తప్పడం లేదు. అంగన్‌వాడీ  కేంద్రాలకు అన్నీ సక్రమంగా అందిస్తున్నామని అధికారులు చెబుతున్న మాటలకు వాస్తవ పరిస్థితికి పొంతనే కుదరడం లేదు. నెలల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

 

 సాక్షి కడప :  ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులు ఆకలికేకలు పెడుతున్నారు. సక్రమంగా భోజనం, పౌష్టికాహారం అందించలేని దుస్థితిలో పలు అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. కాంట్రాక్టర్లు ఇష్టానుసారం పంపిణీ చేస్తున్నా అడిగేవారు లేకపోగా.. ఉన్నతాధికారులకు చెప్పడం ఎందుకులే అని కొంతమంది అంగన్‌వాడీ వర్కర్లు  మిన్నకుండిపోతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోయినా....అధికారులు చూడకపోయినా తీవ్రంగా నష్టపోతున్నది మాత్రం చిన్నారులే.



 సింహాద్రిపురం మండలంలో అందని భోజనం పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలంలో పలుచోట్ల అంగన్‌వాడీ కేంద్రాలలో చదువుకుంటున్న చిన్నారులకు భోజనం అందడం లేదు. కందిబేడలు సక్రమంగా సరఫరా కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మండలంలోని దాదాపు 10 గ్రామాల్లో చిన్నారులకు భోజనం కరువైంది. అందులోను ఈసారి కందిబేడలు కొన్ని మాత్రమే రావడంతో అందరికీ సర్దినట్లు పలువురు వర్కర్లు చెబుతున్నారు. మైదుకూరు ప్రాంతంలో కూడా పదుల సంఖ్యలో అంగన్‌వాడీ సెంటర్లలో అటు చిన్నారులకు, ఇటు గర్భవతులకు కూడా భోజనం కరువైంది.



 పాలు..గుడ్లు అంతంత మాత్రం

  జిల్లాలో సుమారు 15 అంగన్‌వాడీ ప్రాజెక్టులుండగా.. వాటి పరిధిలో 3621 అంగన్‌వాడీ సెంటర్లు నడుస్తున్నాయి.  ప్రతిరోజు చిన్నారులకు పౌష్టికాహారంలో భాగంగా 15 గ్రాముల శనగలతోపాటు పాలు, గుడ్లు అందివ్వాల్సి ఉంది. అయితే, పులివెందులలో నాలుగు రోజుల క్రితం గుడ్లు సరఫరా చేశారు. అంతకుముందు అసలే లేదు. పాలు కూడా సక్రమంగా రావడం లేదని పేర్కొంటున్నారు. మైదుకూరు, జమ్మలమడుగు ప్రాంతాలలో నెలల తరబడి గుడ్లు, పాలు ఇవ్వడం లేదు. దాదాపు రెండు నెలలుగా శనగలు కూడా ఇవ్వడం లేదని పలువురు చిన్నారులు చెబుతున్నారు. బద్వేలులో కూడా నాలుగు నెలలుగా శనగల ఊసే లేదు. ప్రొద్దుటూరులో కూడా పాలు, శనగలు రావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. రైల్వేకోడూరులో కూడా దాదాపు మూడు నెలలుగా గుడ్లు అందజేయలేదు. పాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు.



 వడియాలకు మంగళం

 ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన బాల బడి వడియాలకు ప్రభుత్వం మంగళం పాడింది. చిన్నారుల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరినీ నోరూరించిన వడియాలు ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాలకు రావడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం వడియాల స్థానంలో ఒక్కో చిన్నారికి 15 గ్రాముల శనగలు అందించాలని నిర్ణయించింది.  ఇంతవరకు బాగానే ఉన్నా శనగలు కూడా విద్యార్థులకు సక్రమంగా అందించడం లేదు. ఎక్కడ చూసినా శనగలు అందలేదని చిన్నారులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని చూస్తే జిల్లాలో అంగన్‌వాడీ  కేంద్రాల నిర్వహణ అధ్వానంగా ఉందని స్పష్టమవుతోంది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అంగన్‌వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడాల్సిన అవసరం ఉంది.



 ఐసీడీఎస్ పీడీ రాఘవరావు ఏమంటున్నారంటే....

  జిల్లాలోని పలు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో కందిబేడలు, ఇతర నిత్యావసర సరుకుల సమస్యతో చిన్నారులకు భోజనం అందడంలేదని ‘సాక్షి’ పీడీ రాఘవరావు దృష్టికి తీసుకెళ్లగా అలాంటి పరిస్థితి ఎక్కడా లేదన్నారు. అన్నిచోట్ల అవసరమైన సరుకులు ఉన్నాయని, ఎక్కడా కూడా చిన్నారులకు సమస్య రాలేదని వివరించారు.

 

  ‘ఇక్కడ కనిపిస్తున్నది వనిపెంట అంగన్‌వాడీ కేంద్రం. ఇందులో పిల్లలు 30మందికి పైగా ఉన్నారు. అయితే పిల్లలు, గర్భవతులు, బాలింతలకు భోజనం అందించే పరిస్థితి లేదు. కారణం అవసరమైన సరుకులు రాకపోవడమే. ఇక్కడ ఒక్కచోటే కాదు. చాలాచోట్ల ఇదే పరిస్థితి. పౌష్టికాహారంలో భాగమైన శనగలు కూడా నెలల తరబడి కేంద్రాలకు అందలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top