దారుణంగా పడిపోయిన ధాన్యం ధర

దారుణంగా పడిపోయిన ధాన్యం ధర

  • ఎన్నికల మిషతో సొమ్ము చెల్లింపు వాయిదా

  •  ఖర్చులు గిట్టుబాటు కాక రైతుల ఆందోళన

  •  ప్రేక్షక పాత్ర వహిస్తున్న మార్కెటింగ్ శాఖ

  • తిరువూరు, న్యూస్‌లైన్ : ఎన్నికల హడావుడిలో పడి అధికారులు, ప్రజాప్రతినిధులు రైతుల గోడు పట్టించుకోవట్లేదు. దాళ్వా వరికోతలు చివరిదశకు చేరుతున్నా పౌరసరఫరాల సంస్థ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు ఇష్టానుసారం ధర నిర్ణయించి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. తిరువూరు నియోజకవర్గంలోని రెండు వ్యవసాయ సబ్‌డివిజన్లలో 20 వేల ఎకరాల్లో దాళ్వా సాగైంది.



    ఎకరాకు గరిష్టంగా 45 బస్తాల ధాన్యం దిగుబడి రావడంతో గత ఖరీఫ్ సీజన్లో ప్రకృతి అననుకూలతతో పంటనష్టం చవిచూసిన రైతాంగం ఈ దాళ్వా సీజన్లో తమ అప్పులు కొంతమేర తీరతాయని ఆశ పడ్డారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మద్దతు ధర లభించక పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి నెలకొనడంతో ఆందోళన చెందుతున్నారు. మిల్లర్లు, ధాన్యం వ్యాపారులు కొన్న ధాన్యానికి వెంటనే డబ్బు చెల్లించలేమని, ఎన్నికల కారణంగా చెక్‌పోస్టులలో నగదు సీజ్ చేస్తున్నందున మే రెండోవారంలో సొమ్ము ఇస్తామని చెబుతుండటంతో గిట్టుబాటు ధర రాకపోగా అసలు సొమ్ములకే ఎసరు వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

     

    దారుణంగా పడిపోయిన ధరలు...

     

    దాళ్వా ధాన్యానికి ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు రోజుకొక ధర నిర్ణయిస్తున్నారు. సీజన్ ప్రారంభంలో క్వింటాలు ధర రూ.950 చొప్పున నిర్ణయించిన మిల్లర్లు ఇప్పుడు రూ.780కి మించి ఇవ్వలేమంటున్నారని రైతులు వాపోతున్నారు. యంత్రాలతో కోసిన వరి క్వింటాలుకు 17 కిలోల తరుగు వస్తున్నందున మద్దతు ధర వర్తించదని వ్యాపారులు చెబుతున్నారు. ఆరుదల ధాన్యానికి మాత్రమే 75 కిలోలకు రూ.1010 చొప్పున చెల్లిస్తున్నామని, దాళ్వా ధాన్యానికి ధర పలకట్లేదని వ్యాపార వర్గాలు కరాఖండిగా చెబుతుండటంతో గత్యంతరం లేక రైతులు ధాన్యం విక్రయిస్తున్నారు.  

     

    కలెక్టరు దృష్టికి తీసుకెళ్లినా...

     

    దాళ్వా  ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆవశ్యకతను ఇటీవల తిరువూరు వచ్చిన జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు దృష్టికి పలువురు రైతులు తీసుకెళ్లారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అంశం పరిశీలిస్తామని కలెక్టరు తెలిపినప్పటికీ ఇంతవరకు తదనుగుణంగా చర్యలు చేపట్టకపోవడంతో దాళ్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.



    ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అప్పు ఇచ్చిన వ్యాపారులు కల్లాల్లోనే ధాన్యాన్ని తక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నా తప్పనిసరి పరిస్థితుల్లో తెగనమ్మవలసి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా రైతుల ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. కనీసం గిట్టుబాటు ధర లభించేవరకు మార్కెట్ కమిటీ గోదాముల్లో రైతుబంధు పథకంపై రైతుల ధాన్యాన్ని నిల్వ చేసుకునే సదుపాయం కల్పించాలని కోరుతున్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top