హెచ్‌బీఎల్‌లో కార్మికుడి మృతి


పూసపాటిరేగ: మండలంలోని కందివలస సమీపంలో గల హెచ్‌బీఎల్ పరిశ్రమలో   క్రేన్‌బెల్ట్ తెగిపడడంతో ఐరెన్‌పోల్  మీద పడి బుధవారం ఓ ఎన్‌ఎంఆర్ కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలలోకి వెళ్తే నెల్లిమర్ల మండలం గుషిణి గ్రామనికి చెందిన జమ్ము రమణ (43) హెచ్‌బీఎల్ పరిశ్రమలో గల సీబీడీ యూనిట్‌లో రెండు నెలలు క్రితం ఎన్‌ఎంఆర్ కార్మికునిగా చేరాడు. విధినిర్వహణలో భాగంగా యూనిట్‌లో  క్రేన్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం 12.30 సమయంలో నిలబడి ఉండగా  హఠాత్తుగా క్రేన్‌కు ఉన్న వైర్ తెగి, ఐరెన్ పోల్ అతని తలపై పడింది. దీంతో పోల్ కింద చిక్కుకున్న రమణ  అక్కడికక్కడే మృతి చెందాడు.

 

 వెంటనే యాజమాన్యం అంబులెన్స్‌లో రమణ మృతదేహాన్ని ఫ్యాక్టరీ బయటకు తరలించింది.   విషయం తెలుసుకున్న మిగతా కార్మికులు  గేటు వద్దకు వచ్చి బైటాయించి, పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మృతదేహాన్ని తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ యాజ మాన్యం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే  ఈ ప్రమాదం జరిగిందని  వారు ఆరోపించారు. హెచ్‌ఆర్ మేనేజరు రామకృష్ణను కార్మికులు చుట్టుముట్టి మృతిచెందిన కార్మికుని కుటుబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

 

 సీఐటీయూ   జిల్లా ప్రదానకార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణతో పాటు ,కార్మికులు,గుషిణి గ్రామస్తులు పరిశ్రమ గేటు వద్ద పెద్ద ఎత్తున  ఆందోళన చేశారు.  బోగాపురం సీఐ వైకుంఠరావు ,ఎస్‌ఐ శ్రీనువాస్‌తో పాటు పోలీస్ సిబ్బంది గేటువద్ద వచ్చి  కార్మికులను శాంతింపజేశారు. కార్మికుల ఆందోళనతో యాజమాన్యం దిగివచ్చింది. రమణ కుటుంబానికి రూ.11 లక్షలు నష్టపరిహారంగా అందజేసేందుకు అంగీకరించింది. అలాగే రమణ భార్య ఆది లక్ష్మికి నెలకు రూ1800, ఇద్దరు పిల్లలు మహేష్, సత్తిబాబులకు రూ.400 చొప్పున పింఛన్ అందజేసేందుకు అంగీకరించింది.  మృతుని కుమారులు సతివాడలోగల ఆదర్శపాఠశాలలో చదువుతున్నారు. రమణ మృతి చెందడంతో భార్యాపిల్లలు భోరున విలపిస్తున్నారు. యాజ మాన్యంతో జరిగిన చర్చలలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పతివాడ అప్పలనాయుడు,చనమల వెంకటరమణ, అంబళ్ల శ్రీరాములునాయుడు, పిన్నింటి వెంకటరమణ పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top