మాట మార్చారు.. మోసం చేశారు

మేనిఫెస్టోలో  చంద్రబాబు ఇచ్చిన హామీకి ఈ పోస్టర్లే సాక్షి.


 విజయవాడలో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఏకంగా హామీలనే మార్చేసిన సీఎం చంద్రబాబు

 వ్యవసాయ రుణాలు అనలేదని, పంట రుణాలు రద్దు చేస్తామనే హామీనిచ్చానని బుకాయింపు

  వ్యవసాయ, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో  హామీ

 టీవీల్లో విస్తృతంగా ప్రకటనలు, భారీ హోర్డింగ్‌లు, కరపత్రాలతో ప్రచారం

 ఆరునెలలైనా ఒక్క రైతుకూ ఒక్క రూపాయి రుణమూ మాఫీ కాని వైనం

 

 సాక్షి, హైదరాబాద్:  ఆరునెలలు సావాసం చేస్తే వాళ్లు వీళ్లవుతారన్నది పాతసామెత... ఆరునెలల కాలం గడిస్తే హామీలు, వాటి అర్థాలు కూడా మారతాయన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా సామెత. అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా ఇచ్చిన హామీలిచ్చిన చంద్రబాబు ఆరునెలల్లోనే ప్లేటు ఫిరాయించారు. ఏ పార్టీ వేదికగా హామీ ఇచ్చారో అదే పార్టీ వేదికగా మాట మార్చారు. స్వయంగా మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను కూడా మార్చి చెప్పడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. శాసనసభ ఎన్నికలకు ముందు మార్చి 31 వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విడివిడిగా పార్టీ మేనిఫెస్టోలను విడుదల చేశారు. వ్యవసాయ రుణాలు, డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తామని వాటిలో స్పష్టమైన హామీ ఇచ్చారు.


రైతులు ఎదుర్కొంటున్న సాధక బాధకాలను మేనిఫెస్టోలో సుదీర్ఘ ప్రస్తావన చేస్తూనే వ్యవసాయ రుణాల మాఫీ హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత వ్యవసాయ రుణాలను మాఫీ చేసే ఫైలుపైనే తొలి సంతకం చేస్తామని స్పష్టంగా చెప్పారు. ఈ మేరకు ఎన్నికలకు ముందు ప్రతీ సభలోనూ ఊదరగొట్టారు. ఇదే విషయాన్ని భారీ హోర్డింగ్‌లు, టీవీల్లో విస్తృతంగా ప్రకటనలు ఇచ్చి ప్రచారం చేశారు. బ్యాంకుల్లో కుదవపెట్టిన బంగారాన్ని విడిపిస్తామని, త్వరలోనే బంగారం మీ ఇంటికొస్తుందని మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇదే అంశంపై టీడీపీ నేతలు ఇంటింటికీ తిరిగి విస్తృతంగా ప్రచారం చేశారు. పెద్ద ఎత్తున కరపత్రాలు పంచారు. వాటిని నమ్మిన ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చారు. ప్రమాణ స్వీకారం రోజున తొలి సంతకంతోనే చంద్రబాబు ‘తొండి’ మొదలైంది. అధికారం చేపట్టిన తర్వాత రుణమాఫీపైనే తొలిసంతకం చేస్తానని ఊర్లన్నీ ఊదరగొట్టిన చంద్రబాబు ఆ రోజు వచ్చేసరికి రుణమాఫీ అమలు విధివిధానాలు నిర్ణయించేందుకు కోటయ్య కమిటీని ఏర్పాటుచేస్తూ సంతకం చేసి సరిపుచ్చారు. ఆ తర్వాత రుణమాఫీ జరిగిపోయిందంటూ సన్మానాలు చేయించుకున్నారు.


రైతుల ఖాతాలను తగ్గించడానికి రకరకాల సాకులతో ఆరునెలలుగా రుణమాఫీ కసరత్తును సాగదీస్తూనే ఉన్నారు. ఆరు నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో ఒక్క రైతుకూ ఒక్క రూపాయి రుణమూ మాఫీ కాలేదు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత బుధవారం విజయవాడలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ప్రసంగించిన చంద్రబాబు ఏకంగా హామీలనే మార్చేశారు. వ్యవసాయ రుణాలు అని మేనిఫెస్టోలో, ఊరూరా సభల్లో హామీలిచ్చిన చంద్రబాబు... పంటపైన తీసుకున్న రుణాలు రద్దు చేస్తామనే తాను హామీనిచ్చానని పార్టీ సమావేశంలో  మాట మార్చారు. అప్పట్లో రుణాలన్నీ మాఫీ చేస్తాన్న చంద్రబాబు... ఇప్పుడేమో ఒక కుటుంబం ఎన్ని బ్యాంకుల్లో రుణం తీసుకున్నా లక్షన్నర మాత్రమే రద్దు చేస్తామని చాలా స్పష్టంగా చెప్పానని అంటున్నారు. ఎన్నికలకు ముందు ఈ హామీలపై ఎలాంటి షరతులు, ఆంక్షలు మాటమాత్రంగానైనా చెప్పకుండా ఇప్పుడు వ్యవసాయ రుణాలకు బదులు పంట రుణాలను రద్దు చేస్తామంటూ అసలు హామీనే పక్కదారి పట్టించడం పట్ల పార్టీ నేతల్లోనే విస్మయం వ్యక్తమైంది. డ్వాక్రా సంఘాల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు..  డ్వాక్రా రుణాలను మాఫీ చేసేది లేదని, మూల ధనంగా ప్రతి సంఘానికి లక్ష రూపాయలిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మాట మార్చటం తెలిసిందే. మహిళలు ఎక్కడంటే అక్కడ డబ్బులు అప్పులు తీసుకోవడంవల్లే తిరిగి చెల్లించే శక్తిలేక అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నారంటూ సీఎం తరచూ వ్యాఖ్యానించడంపట్ల మహిళల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

 

 టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిందేమంటే

 హావ్యవసాయ రుణాల మాఫీ. తొమ్మిది గంటల ఉచిత విద్యుత్. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం. వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి. సౌర విద్యుత్ కోసం 75 శాతం సబ్సిడీ. రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి. ప్రకృతి వైపరీత్యాలు, పంట నష్ట నివారణకు రైతువారిగా ఇన్సూరెన్స్. రైతు బాగుంటే సమాజం బాగుంటుంది.  సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. దెబ్బతిన్న రైతుల్లో ఆత్మవిశ్వాసం కలిగించి భవిష్యత్తుపట్ల భరోసా నింపేందుకే తెలుగుదేశం పార్టీ రుణ మాఫీ ప్రకటించింది.

 హాతెలుగుదేశం పార్టీ వ్యవసాయ రుణాలను మాఫీ చేసేందుకు నిర్ణయించింది. పార్టీ అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ ఫైలుపై మొదటి సంతకం చేస్తాం. రుణ మాఫీ వ్యవసాయ రంగానికి కొంత ఉపశమనం మాత్రమే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top