మద్యంపై కన్నెర్ర

మద్యంపై కన్నెర్ర - Sakshi


సర్కారు మద్యం పాలసీపై మహిళా లోకం కన్నెర్ర చేసింది. ఒంగోలులో మద్యం టెండర్లు అడ్డుకునేందుకు ఉద్యమ స్ఫూర్తితో నిరసన బాట పట్టింది. ప్రగతిశీల మహిళా సంఘం, ఐద్వా, యువజన, విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు ఆదివారం ఆందోళన చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి పోలీసు స్టేషన్లకు తరలించారు.

 

 ఒంగోలు క్రైం : రాష్ట్ర ప్రభుత్వ నూతన మద్యం పాలసీపై జిల్లా మహిళా సంఘాల నేతలు కన్నెర్ర చేశారు. మద్యం పాలసీ విడుదలైనప్పటి నుంచి మహిళా సంఘాలు ప్రభుత్వ తీరుపై మండిపడుతూనే ఉన్నాయి. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో చివరకు మద్యం షాపుల కోసం టెండర్లు నిర్వహిస్తున్న కల్యాణ మండపం వద్దకు చొచ్చుకుపోయేందుకు ఆదివారం ప్రయత్నించారు. ప్రగతిశీల మహిళా సంఘం, ఐద్వా,  యువజన, విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.



ముందుగానే  సమాచారం తెలుసుకున్న పోలీస్ అధికారులు ప్రత్యేక పోలీస్ బలగాలతో ఒంగోలు నగరంలో పహారా కాయించారు. నగరంలోని అన్ని వీధుల్లో ఉదయం నుంచి ప్రత్యేక పోలీస్ బలగాలు సంచరిస్తూనే ఉన్నాయి. అయినా  స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి టెండర్లు నిర్వహించే బచ్చల బాలయ్య కల్యాణమండపం వరకు నిరసన ప్రదర్శన చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీస్ బలగాలతో సిద్ధంగా ఉన్న ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మహిళా సంఘాల నేతలను స్థానిక ఎస్‌బీఐ సెంటర్లోనే పోలీసులు అడ్డుకున్నారు.



బలవంతంగా పోలీసులు, మహిళా పోలీసులు, మహిళా నేతలను వ్యానుల్లో ఎక్కించి కొత్తపట్నం, జరుగుమల్లి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. మహిళా సంఘాల నేతలు పోలీసులతో తీవ్రంగా ప్రతిఘటించారు. మద్యం మహమ్మారి మహిళల పాలిట శాపమంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. గోళ్లతో రక్కడం, చీరెలు చించండీ... అంటూ పోలీసులే అనైతిక చర్యలకు పాల్పడ్డారంటూ మహిళ సంఘాల నేతలు యు.ఆదిలక్ష్మి, ఎస్‌కే మున్వర్ సుల్తానా, కె.రమాదేవి తెలిపారు.



పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.పద్మ మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి రాగానే మద్యం షాపులు రద్దు చేస్తానని బూటకపు వాగ్దానాలిచ్చారని మండిపడ్డారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చొప్పర జాలన్న, అరుణోదయ అంజయ్య, అఖిల భారత రైతు కూలి సంఘం ఉపాధ్యక్షుడు వై.వి.కృష్ణారావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. పీవోడబ్ల్యూ, అఖిల భారత రైతుకూలి సంఘం, ప్రగతిశీల యువజన సంఘం, మహిళా, యువజన, విద్యార్థి సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top