వివాహిత మౌనదీక్ష సుఖాంతం

వివాహిత మౌనదీక్ష సుఖాంతం


 బత్తిలి/భామిని: అత్తవారింట మౌన దీక్షకు దిగిన వివాహిత కథ సుఖాంతమైంది. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని ఆమె భర్తను ఒప్పించి వారితో వేరే కాపురం పెట్టించారు. వివరాలివీ.. భామిని మండలం పసుకుడిలో దీనబంధు గౌడ ఇంటి ముందు స్వాతి అనే వివాహిత బుధవారం ఉదయం మౌన దీక్ష చేపట్టింది. మంగళవారం రాత్రి అత్తవారింటికి వచ్చిన స్వాతి, ఆమె రెండేళ్ల కూతురిని చూసి అత్తింటివారు తలుపులు వేయడంతో, చేసేదిలేక అదే గడప మౌన దీక్ష చేపట్టింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. స్వాతి మూడేళ్ల క్రితం పసుకుడికి చెందిన అనంతరావు గౌడతో పేమలో పడి కులాంతర వివాహం చేసుకుంది.

 

 ఇరు కుటుంబాలను కాదని అనంతరావు పసుకుడిలో వేరే కాపురం పెట్టాడు. ప్రస్తుతం వారికి రెండేళ్ల కూతురు దీక్షిత ఉంది. అయితే ఆరు నెలల క్రితం స్వాతితోపాటు కూతురిని చైన్నైలోని ఆమె అమ్మగారింటికి తీసుకెళ్లి విడిచిపెట్టి వచ్చేశాడు. అనంతరం పసుకుడిలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్వాతి తన తండ్రి చిన్నపొందర సాయిబుతో కలిసి అత్తవారింటికి రాగా వారు తలుపులు మూసుకోవడంతో దీక్ష చేపట్టింది. చివరికి బుధవారం సాయంత్రం పసుకుడి గ్రామ పెద్దలు జోక్యం చేసుకొని వివాహిత భర్త అనంతరావు గౌడను ఒప్పించి వేరే ఇంటిలో కాపురాన్ని ఏర్పాటు చేయించారు. గ్రామసర్పంచ్ దామోదర బారికి, మాజీ సర్పంచ్ భోగాపురపు రవినాయుడు భార్యాభర్తలిద్దరితో చర్చించి మనస్పర్థలు లేకుండా కాపురం చేసుకోండంటూ వారికి నచ్చజెప్పారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top