నీటి సాక్షిగా నిర్లక్ష్యం!


డెల్టా ప్రాంత రైతాంగానికి గుండె కాయ లాంటి ప్రకాశం బ్యారేజీ గేట్లు రూపురేఖలు కోల్పోతున్నాయి. పుష్కర కాలానికే తుప్పుపట్టి శిథిలస్థితికి చేరుతున్నాయి. పాడైపోయిన గేట్లకు మరమ్మతులు చేపట్టనున్నట్టు సాక్షాత్తూ రాష్ట్ర నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించి ఐదు నెలలు దాటినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. కాలయాపన చేసే కొద్ది మరమ్మతుల వ్యయం పెరిగే ప్రమాదం లేకపోలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.     

 - తాడేపల్లి రూరల్

 

  2002లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీ మొత్తం 74 గేట్లు(వర్టికల్) మార్చేందుకు నిర్ణయించి ఆ మేరకు పనులు ప్రారంభించింది. ఈ విషయంలో నైపుణ్యం కలిగిన సీతానగరం పీడబ్ల్యూడీ వర్క్ షాప్ కార్మికులను కాదని, గేట్లు మార్చే పనులను తెలుగుదేశం ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది.

 

 ఒప్పందం మేరకు ఆ సంస్థ కొత్త గేట్లు ఏర్పాటు చేసింది. అయితే పాత గేట్ల డిజైన్‌ను మార్చడంతో వీటీపీయస్‌లో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. బ్యారేజీ పాత గేట్లు 12 అడుగుల ఎత్తు ఉండగా, కొత్త గేట్లు అర అడుగు మేర తగ్గడంతో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడినట్టు గుర్తించారు.కొత్త గేట్లు ఎత్తు పెంచాలని వీటీపీఎస్ ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని కోరడంతో మరో అర అడుగు రేకు అమర్చి 12 అడుగులకు మార్చారు. ఈ క్రమంలో పైనుంచి ప్రవహించే నీరంతా గేట్లపైనే పడుతోంది. ఈ కారణంగా కొత్త గేట్లు సైతం 12 ఏళ్లకే పూర్తిగా తుప్పుపట్టాయి. అంతేగాక నీటి ఒత్తిడిని తట్టుకునేందుకు సపోర్టుగా ఏర్పాటు చేసిన ఐరన్ చానళ్లు సైతం తుప్పు పట్టి ఊడిపోయాయి. ఈ రెండు విషయాలు ఈ ఏడాది ఆగస్టులో దినపత్రికల ద్వారా వెలుగు చూడడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ప్రకాశం బ్యారేజీని సందర్శించింది. గేట్లు తుప్పు పట్టిన మాట వాస్తవమేనని నిర్ధారించింది.

 

 అనంతరం కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం 37 కోట్ల రూపాయలు కేటాయించి తక్షణం ప్రకాశం బ్యారేజీ గేట్లకు మరమ్మతులు నిర్వహించాలని ఆదేశించింది.ఆ సమయంలోనే మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ప్రకాశం బ్యారేజీ గేట్లకు మరమ్మతులు చేపడుతున్నట్టు చేసిన ప్రకటన నేటికీ అలానే మిగిలిపోయింది. నిధులు ఉన్నా పనులు చేపట్టకపోవడంపై అటు రైతులు, ఇటు ఆ శాఖ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గేట్ల మరమ్మతులకు చొరవ చూపాలని కోరుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top