నరకానికి నో గేట్

ఫిరంగిపురంలో గేటులేని రైల్వే లెవెల్ క్రాసింగ్


ప్రాణాలు తీస్తున్న కాపలాలేని రైల్వే లెవెల్ క్రాసింగ్స్

ముందస్తు రక్షణ చర్యలు చేపట్టడంలో రైల్వే శాఖ విఫలం

మెదక్ రైల్వే దుర్ఘటనతోనైనా గుణపాఠం నే ర్చేనా?

 సంగడిగుంట (గుంటూరు): కాపలాలేని రైల్వే లెవెల్ క్రాసింగ్స్ ప్రాణాంతకంగా మారాయి. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో కాపలాలేని రైల్వే లెవెల్ క్రాసింగ్స్ మొత్తం 135 ఉన్నాయి. కాపలా దారుడు లేకపోవడంతో ఆ దారిలో వెళ్లే పలు వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రమాదం జరిగిన అనంతరం ఆ లెవెల్ క్రాసింగ్ వద్ద యుద్ధ ప్రాతిపదికన గేటు ఏర్పాటు చేస్తున్నారు తప్ప ముందస్తు రక్షణ చర్యలు చేపట్టడంలో రైల్వే శాఖ విఫలమవుతున్నట్టు తేటతెల్లమవుతోంది. మెదక్ జిల్లాలో గురువారం జరిగిన ఘోర రైలు ప్రమాదంతో గుంటూరు జిల్లా ప్రజానీకం దిగ్భ్రాంతికి గురైంది. ఇప్పటికైనా కాపలాలేని రైల్వే లెవెల్ క్రాసింగ్‌లపై అధికారులు దృష్టిసారించాలని కోరుతున్నారు.



  దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ప్రదీప్ కుమార్ శ్రీవాత్సవ జూన్ 2న చేసిన ప్రకటన ప్రకారం జోన్ పరిధిలో 1,431 లెవెల్ క్రాసింగ్స్ ఉండగా వాటిలో 655 కాపలాలేని లెవెల్ క్రాసింగ్స్ ఉన్నాయి.

  వీటిని 2015-16 నాటికి పూర్తిగా కాపలా ఉండే లెవెల్ క్రాసింగ్స్‌గా, రైల్వే అండర్ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రహదారి మళ్లింపు, కాపలాదారుతో గేటుల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించినట్లు ప్రకటించారు.

  గుంటూరు రైల్వే డివిజన్‌లో మాత్రం 135 కాపలాలేని రైల్వే లెవెల్ క్రాసింగ్స్ ఉన్నాయి.

  గత ఐదేళ్లలో గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని కాపలాలేని లెవెల్ క్రాసింగ్స్(యూఎల్‌సీ) వద్ద 7 ప్రమాదాలు జరిగాయి. పలువురు మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా గుంటూరుకు అతి సమీపంలో బండారుపల్లి వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో దాదాపు 14 మంది వ్యవసాయ కూలీలు మృతి చెందిన సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రమాదం జరిగిన తరువాత రైల్వే గేటును ఏర్పాటు చేశారు.

  ఇప్పటికీ జిల్లాలోని ఫిరంగిపురం లెవెల్ క్రాసింగ్ 209, నంబూరు లెవెల్ క్రాసింగ్ 8 తదితర ప్రాంతాల్లో కాపలాదారుడు లేడు.పొందుగల వద్ద గేటు ఏర్పాటు జరుగుతుంది.

  డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు ప్రమాదం జరిగిన చోటే రక్షణ చర్యలు చేపట్టి కాపలాదారుని ఏర్పాటు, గేటు ఏర్పాటు చేశారు తప్ప ముందుగా రక్షణ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అయితే కాపలాలేని లెవెల్ క్రాసింగ్స్‌ను పూర్తిగా తొలగించడం, రహదారి మళ్లింపు, రైల్వే ఓవర్‌బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిలు తదితర రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

 హెచ్చరిక బోర్డులను పట్టించుకోవడం లేదు..

డివిజన్ పరిధిలో కాపలాలేని రైల్వే లెవెల్ క్రాసింగ్స్ 135 ఉన్నాయి. వీటిలో 27 లెవెల్ క్రాసింగ్స్ ఈ ఏడాదిలోపు పూర్తి చేసేందుకు లక్ష్యంగా పని జరుగుతోంది. నిధుల కేటాయింపును బట్టి ప్రాధాన్యత నిస్తూ 2015-17 ఏడాదిలోపు అన్నింటినీ తొలగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.  కాపలాలేని క్రాసింగ్స్ వద్ద ప్రమాదాలు జరగటానికి కారణం రైల్వే శాఖ ఏర్పాటు చేసిన ప్రమాద నివారణ సూచనలు పాటించకపోవడమే. ప్రమాద హెచ్చరిక సూచికలను పట్టించుకోకుండా పట్టాలు దాటేందుకు ప్రయత్నించి ప్రమాదాల బారిన పడుతున్నారు.

 - ఎం.హెచ్.సత్యనారాయణ, సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top