చూపెట్టేదొకటి..కట్టేదింకొకటి

చూపెట్టేదొకటి..కట్టేదింకొకటి - Sakshi


 రాజమండ్రిలో, దానిలో విలీనం అవుతాయంటున్న పంచాయతీల్లో ప్లాన్‌కు విరుద్ధంగా, అనుమతి లేకుండా భవన నిర్మాణం యథేచ్ఛగా సాగిపోతోంది. భద్రతను బేఖాతరు చేస్తూ ఆకాశ  హర్మ్యాలు కట్టేస్తున్నారు. రెండు, మూడ ంతస్తులకే అనుమతి పొంది అయిదంతస్తులు నిర్మించేస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో కళ్లు మూసుకుంటున్నారు. అడ్డగోలుగా భవనాలు కడుతున్న బిల్డర్లకు ఇప్పుడు తెలుగుదేశం ప్రజాప్రతినిధులు అండగా నిలవడంతో మరింత ఇష్టారాజ్యంగా మారింది.

 

 సాక్షి, రాజమండ్రి :నగరంలో, నగర పరిసరాల్లోని పంచాయతీల్లో నిర్మాణంలో ఉన్న భవనాల్లో అనేకం. నిబంధనలను  పునాదుల్లో పాతి పెట్టి కడుతున్నవేనంటే అతిశయోక్తి కాదు. ఈ వ్యవహారంలో బిల్డర్లకు కొమ్ము కాస్తున్నది అవినీతిపరులైన అధికారులు, అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులే. రాజమండ్రి శివార్లలోని దివాన్‌చెరువు, బొమ్మూరు పంచాయతీల్లో అనుమతులకు విరుద్ధంగా అపార్ట్‌మెంట్ల నిర్మాణం కొనసాగుతోంది. ఈ ప్రాంతాల్లో 15కు పైగా భవనాలను మూడంతస్తులకే అనుమతులు పొంది,  ఐదంతస్తులతో నిర్మించారు. ఇంకా నిర్మాణంలో ఉన్న ఇలాంటి భవనాలకు టీడీపీ నేతలు అండగా ఉన్నారు.

 

  బిల్డర్లు మూడంతస్తుల అపార్టుమెంట్లు కడుతున్నట్టు  ధృవపత్రాలపై స్థల యజమాని సంతకం తీసుకుంటున్నారు. కానీ నాలుగు, ఐదు అంతస్తుల కట్టడాలు ప్రారంభిస్తున్నారు. ఇటీవల రెండు భవనాల విషయంలో స్థల యజమానులు బిల్డర్లతో గొడవ పడగా.. భవనాల ఎత్తు ఇతర అంశాలు అనుమతులకు లోబడే ఉంటాయని నచ్చ చెప్పినట్టు తెస్తోంది. బహుళ అంతస్తుల భవనాల విషయంలో డీటీసీపీ అనుమతులు తప్పనిసరి. తాము నిర్మాణానికి అనుగుణంగా అనుమతులకు దరఖాస్తు చేశామని, అవి రానున్నాయని పంచాయతీ కార్యదర్శులకు చెబుతూ బిల్డర్లు వారికి భారీగా ముడుపులు ముట్టచెబుతున్నారు. ఈ అక్రమ కట్టడాలపై డీటీసీపీ అధికారులకు కూడా లక్షల్లో ముడుపులు ముట్టచెబుతున్నారు. దీంతో అక్రమ నిర్మాణాలు నిరాటంకంగా సాగిపోతున్నాయి.

 

 కొనుగోలుదారులకు తప్పని ఇక్కట్లు

 బహుళ అంతస్తుల భవనాల నిర్మాణంలో ముందుగా రెండు బెడ్ రూం ప్లాట్లతో అపార్టుమెంట్లు కట్టేందుకు అనుమతులు పొందుతున్న బిల్డర్లు మూడు బెడ్ రూంలతో నిర్మిస్తున్నారు. దీంతో వీటిని కొనాలనుకునే వారు రుణాలు పొందడంలో ఇబ్బందులకు గురవుతున్నారు. బొమ్మూరులో తహశీల్దారు కార్యాలయం సమీపంలోనే ఒక భవనం అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం అవడంతో అందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరించినట్టు తెలుస్తోంది. సాక్షాత్తూ ఒక జాతీయ బ్యాంకు ఉద్యోగే ముందు ప్లాట్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుని, తర్వాత రుణం కోసం తమ బ్యాంకును సంప్రదించగా భవన నిర్మానం ప్లాన్‌కు విరుద్ధంగా ఉండడంతో అధికారులు నిరాకరించినట్టు సమాచారం. దాంతో ఆ ఉద్యోగి మరో బ్యాంకును ఆశ్రయించి రుణం పొందినట్టు తెలుస్తోంది. ఇదే ప్రాంతంలో మరో అపార్టుమెంట్‌ను కూడా ప్లాన్‌తో పొంతన లేకుండా నిర్మించడంతో గృహ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు వెనుకాడుతున్నారు. అయితే నిర్మాణాలు పూర్తయ్యాక తనిఖీలు జరిగితే భారీగా పెనాల్టీలు పడతాయని కొనుగోలుదారులు సంశయిస్తుండగా ఆ సొమ్ములు తామే కడతామని బిల్డర్లు నమ్మబలుకుతున్నారు.

 

 రాజమండ్రిలో టీడీపీ కార్పొరేటర్ల అండ

 రాజమండ్రి నగరంలో కూడా అనుమతులకు భిన్నంగా భవన నిర్మాణాలు అధికార పార్టీ కార్పొరేటర్ల అండతో సాగిపోతున్నాయి. గోకవరం బస్టాండ్ సమీపంలో చిన్న స్థలంలో ఓ భారీ భవంతి నిర్మాణం చకచకా చరుగుతోంది. ఈ భవనానికి అసలు అనుమతులు రాకుండానే నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో నగరంలో ఓ మూడంతస్తుల భవనం కూలిన ఘటనను గుర్తు చేసుకుని ఆందోళన చెందుతున్నారు. సన్నగా పొడవుగా నిర్మిస్తున్న ఈ భవనం అలాంటి ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందంటున్నారు. నగరపాలక మండలిలో నంబర్-2గా ఉన్న ఒక కార్పొరేటర్ టౌన్ ప్లానింగ్ అధికారులను ప్రభావితం చేసి, ఈ భవన నిర్మాణానికి అండగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇటీవల అనుమతులు లేవని ఒక భవనాన్ని కూల్చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులకు తమ కార్యాలయానికి దగ్గరలో జరుగుతున్న ఈ నిర్మాణం కనిపించలేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top