విద్యుత్ చార్జీల పెంపు ఉపసంహరించాలి

విద్యుత్ చార్జీల పెంపు ఉపసంహరించాలి - Sakshi


కేసీఆర్, చంద్రబాబులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్

ప్రజలపై భారం మోపడంలో ఇద్దరు చంద్రులు

పోటీపడుతున్నారంటూ విమర్శ


 

హైదరాబాద్: పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించాలని తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ డిమాండ్ చేశారు. అభివృద్ధిలో కాకుండా ప్రజలపై భారం మోపడంలో ఇద్దరు చంద్రులు పోటీపడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి పండుగనాడు ప్రభుత్వం విద్యుత్ షాక్ ఇచ్చిందని మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగంతో కలిసి శివకుమార్ విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన మరునాడే చార్జీల పెంపు దారుణమని, దీనిని వైఎస్సార్‌సీపీ ఖండిస్తోందని పేర్కొన్నారు.



అంతర్జాతీయంగా బొగ్గు ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో చార్జీలను తగ్గించాల్సింది పోయి పెంచడం సరికాదన్నారు. విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పార్టీపరంగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామని.. రెండు రోజుల్లో పార్టీ రాష్ర్ట కమిటీ భేటీ అయి ఈ కార్యక్రమాల తేదీలను ప్రకటిస్తుందని చెప్పారు. వ్యవసాయ సంక్షోభం కారణంగా వెయ్యిమంది వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. గ్రామాల్లో ప్రస్తుతం ఆరు గంటల విద్యుత్ కూడా సరఫరా చేయడం లేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ మాటల్లో దిట్ట అని, మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని శివకుమార్ విమర్శించారు. విద్యుత్ చార్జీలతో పాటు పెట్రోల్, డీజిల్‌లపై అదనంగా వసూలు చేస్తున్న వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ తన పాలనా కాలంలో ఒక్కసారి కూడా విద్యుత్ సహా ఏ చార్జీలు కూడా పెంచలేదని గుర్తుచేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top