'పోలీస్ అండతో వైఎస్సార్‌సీపీని అణగదొక్కుతాం'

'పోలీస్ అండతో వైఎస్సార్‌సీపీని అణగదొక్కుతాం' - Sakshi


కర్నూలు: రాష్ర్టంలో వైఎస్సార్‌సీపీని అణచివేసేందుకు అధికార తెలుగుదేశంపార్టీ ఎంతకైనా తెగిస్తుందన్న విషయం మరోసారి స్పష్టమైంది. వైఎస్సార్‌సీపీ నేతలను అణగదొక్కేందుకు పోలీసుల సాయం కూడా తీసుకుంటామని సాక్షాత్తూ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మనసులో మాట బయటపెట్టేశారు. ఎక్కడ ఏ అధికారి కావాలో జాబితా ఇస్తే, అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకునేలా చంద్రబాబును ఒప్పిస్తానని మంత్రి అచ్చెన్నాయుడు ఆయనకు మద్దతునిచ్చారు.



కర్నూలు జిల్లా టీడీపీ మినీ మహానాడు సాక్షిగా టీడీపీ వ్యవహారశైలి బట్టబయలైంది. కర్నూలు శివారులోని ఎంఆర్‌సీ కన్వెన్షన్‌లో శనివారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పాచక్రపాణిరెడ్డి అధ్యక్షతన మినీ మహానాడు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కేఈ మాట్లాడుతూ... జిల్లాలో వైఎస్సార్‌సీపీని అణగదొక్కేందుకు పోలీసుల సహాయం తీసుకోవాలని మనసులో మాట చెప్పేశారు. ‘‘ఇది ఫ్యాక్షన్ జిల్లా. జిల్లాలో మంత్రాలయం, ఆదోని, బనగానపల్లె వంటి ఫ్యాక్షన్ ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది. 11 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. ఈ ప్రాంతాల్లో పర్యటించి వాళ్లను ఎట్లా అణగదొక్కాలి? ఏ విధంగా పోలీసు సాయం తీసుకోవాలి? అనే విషయాల్ని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలి’’ అని ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడుకు చెప్పారు.



వైఎస్సార్‌సీపీ నేతల గర్వాన్ని అణగదొక్కాలంటే ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. అలా జరిగేలా ఇన్‌చార్జి మంత్రి ప్రయత్నించాలని కోరారు. ఇన్‌ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు కూడా దీటుగానే స్పందించారు. ‘‘మండలాల్లో ఏయే అధికారుల వల్ల ఇబ్బంది ఉంది, ఎవరు ఉండకూడదు, ఎవరు కావాలనే జాబితా ఇస్తే దానిపైనే నేను సంతకం పెట్టి అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకోవాలని అధినేతను కోరతా’’నని హామీ ఇచ్చారు. నియోజకవర్గాల్లో కార్యకర్తల కష్టాల గురించి జాబితాలు సిద్ధంచేసి ఇస్తే అధినేత దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.



జిల్లాలో టీడీపీ ఓటమికి చంద్రబాబే కారణమని కేఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికల అనంతరం బాబును కలవడానికి ఎప్పుడు పోయినా... మీ జిల్లాలో మూడు సీట్లే గెలిచారు.. పశ్చిమగోదావరిలో 16కు 16 సీట్లొచ్చాయంటున్నారు. ఆయన దృష్టంతా పశ్చిమగోదావరిపైనే ఉంది. కర్నూలుపైన లేదు. ఇందులో మా తప్పేం లేదు. ఎన్నికలకు నెల రోజుల ముందు కాంగ్రెస్‌లో ఊగిసలాడుతున్న వారిని పార్టీలో చేర్చుకున్నారు. ప్రజలు వారిని నమ్మకపోవడంతో ఓడిపోయారు. మైనార్టీ, క్రిస్టియన్ ఓట్లూ రాలేదు’’ అని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top