కార్మికుల నిరసనలతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తం

కార్మికుల నిరసనలతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తం - Sakshi


న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వివిధ సంఘాల కార్మికుల గర్జనతో కలెక్టరేట్ అట్టుడికిపోయింది. ప్రభుత్వ శాఖల్లో వివిధ స్కీమ్‌ల కింద విధులు నిర్వర్తిస్తున్న వర్కర్ల కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.



పలువుర్ని పోలీసులు బలవంతంగా ఈడ్చుకుపోయి అరెస్టు చేయడంతో టూటౌన్ పోలీసు స్టేషన్‌కు ఎదుట రోడ్డుపైనే బైఠాయించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శనగా వచ్చి కలెక్టరేట్ వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. విద్యుత్ రంగంలో థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనే డిమాండ్లతో కలెక్టరేట్ ప్రాంగణం మార్మోగిపోయింది.



ఒంగోలు టౌన్: ప్రభుత్వ శాఖల్లో వివిధ స్కీమ్‌ల కింద విధులు నిర్వర్తిస్తున్న వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గురువారం నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో స్కీమ్ వర్కర్లు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఉదయం 11.30 గంటలకు రెండు గేట్ల ముందు బైఠాయించారు. కలెక్టరేట్ లోపలికి, బయటకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ముట్టడికి దిగిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉండటంతో పోలీసులు కొంతమేర సంయమనం పాటించారు.



దాదాపు గంట సేపు ముట్టడి జరగడం, అదే సమయంలో ఉద్యోగస్తులు బయటకు వచ్చేందుకు సిద్ధమవుతుండటంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భం గా ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.  ఈ క్రమంలో తోపులాట కూడా చోటుచేసుకుంది. మహిళలను బలవంతంగా అదుపులోకి తీసుకునేటప్పుడు వేటపాలెం ఐసీడీఎస్ ప్రాజెక్టుకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్త బుల్లెమ్మాయి  స్పృహ కోల్పోయింది.



దాంతో పోలీసులు హుటాహుటిన ఆమెను రిమ్స్‌కు తీసుకెళ్లారు. మిగిలిన ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్టుచేసి టూటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసు ల చర్యలను నిరసిస్తూ కలెక్టరేట్ నుంచి టూటౌన్ పోలీసు స్టేషన్ వరకు స్కీమ్ వర్కర్లు ప్రదర్శనగా బయలుదేరి అక్కడ రోడ్డుపైనే బైఠాయించారు. అరెస్టు చేసిన ఆందోళనకారులను పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేయడంతో స్కీమ్ వర్కర్లు అక్కడ నుంచి వెనుదిరిగారు.



ప్రభుత్వ తీరు దుర్మార్గం:

అంతకు ముందు కలెక్టరేట్ ముట్టడిని ఉద్దేశించి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కే ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని స్కీమ్ వర్కర్లపై తెలుగుదేశం ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. కొన్నేళ్ల నుంచి పనిచేస్తున్న వేలాది మందిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నపలంగా వీధులపాలు చేశారన్నారు.  స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని కోరితే నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని,  కేసులకు తాము భయపడేది లేదని, అవసరమైతే నిరవధిక సమ్మెకు దిగి ప్రభుత్వ కార్యకలాపాలను స్తంభింప చేస్తామని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.



స్కీమ్ వర్కర్ల కడుపు కొడుతున్నారు

సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో 20 వేల మంది స్కీమ్ వర్కర్లు సమ్మెకు దిగడంతో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయన్నారు.  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీకి చెందిన కొంతమంది శాసనసభ్యులు స్కీమ్ వర్కర్ల కడుపు కొడుతున్నారని విమర్శించారు. పర్చూరు శాసనసభ్యుడు ఎనిమిది మంది అంగన్‌వాడీ కార్యకర్తలను నిర్దాక్షిణ్యంగా తొలగించారన్నారు. ఐకేపీ యానిమేటర్లు సమ్మెకు దిగితే వెంటనే విధుల్లోకి చేరకుంటే తొలగిస్తామని బెదిరిస్తున్నారన్నారు.  కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మనోజ, ఐకేపీ యానిమేటర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రశాంతి తదితరులు ప్రసంగించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top