ప్రతి ఓటమి గెలుపు నేర్పుతుంది

ప్రతి ఓటమి గెలుపు నేర్పుతుంది - Sakshi


చాపాడు: ఏ ఆటలోనైనా ప్రతి ఓటమి గెలుపును నేర్పుతుందని.. గెలిచిన వారు పొంగిపోకూడదని, ఓడిన వారు కుంగిపోకూడదని.. క్రీడా స్ఫూర్తితో విద్యార్థులు ఏ రంగంలోనైనా రాణించవచ్చని జీఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక కలెక్టర్ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు.  శ్రీచైతన్యభారతి ఇంజనీరింగ్ కాలేజీలో గత మూడు రోజులుగా జరుగుతున్న 2014-15 ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడలు ఆదివారంతో ముగిశాయి. ముగింపు క్రీడా ఉత్సవాలకు హాజరైన  వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రీడల్లో పాల్గొంటే మంచి శరీర సౌష్టవం వస్తుందన్నారు.



క్రీడలతో శరీరానికి ఉత్తేజం, ఉల్లాసం వస్తుందన్నారు. విద్యార్థి దశలో క్రీడలలో పాల్గొనే విద్యార్థులలో క్రీడా స్ఫూర్తి అధికంగా ఉంటుందని దీని కారణంగా భవిష్యత్తులో ఏ రంగంలోనైనా రాణిస్తారన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫిజికల్ డెరైక్టర్ నాగేశ్వరరావు, ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డి, సీబీఐటీ, వీబీఐటీ ప్రిన్సిపాళ్లు డాక్టర్ పాండురంగన్వ్రి, డాక్టర్ శ్రీనివాసులరెడ్డి, పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరెడ్డి, పీడీలు ఈశ్వరయ్య, సునీల్ పాల్గొన్నారు.

 

2014-15 ఇంటర్ పాలిటెక్నిక్ విజేతలు

వాలీబాల్‌లో: పులివెందుల లయోలా పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు(విన్నర్స్) రాజంపేట ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు(రన్నర్స్)

 

కబడ్డీలో: బద్వేలు ఎస్వీసీఎం కాలేజీ టీం(విన్నర్స్) ఓబులవారిపల్లె ప్రభుత్వ కాలేజీ టీం విద్యార్థులు(రన్నర్స్)

200 మీటర్ల పరుగులో: బద్వేలు ఎస్వీసీఎం కళాశాలకు చెందిన కె.వెంకటరమణ(ప్రథమ), బి.శివనారాయణ(ద్వితీయ), కమలాపురం ప్రభుత్వ కాలేజీకి చెందిన కె.అనిల్‌కుమార్(తృతీయ) గెలుపొందారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top