కేంద్రీయ విద్యాలయానికి వసతేదీ..?

కేంద్రీయ విద్యాలయానికి వసతేదీ..? - Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మూడేళ్ల కృషితో జిల్లాకు రెండు కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి. ఒంగోలు–2 కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అధికారులు ఇంకా వసతి ఖరారు చేయకపోవడంతో ఈ విద్యా సంవత్సరంలో విద్యాలయం ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. ఇదే జరిగితే.. అసలే వెనుకబాటుతనంతో ఉన్న ప్రకాశం జిల్లా మరింతగా నష్టపోనుంది.

 

ప్రకాశం జిల్లాలో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు కోసం ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా కృషి చేశారు. ఆయన పోరాట ఫలితంగానే జిల్లాకు రెండు కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి. కొత్త విద్యాసంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం దేశ స్థాయిలో 35 కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేయగా ఏపీకి రెండు కేటాయించారు. పశ్చిమ ప్రాంతమైన యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పెద్దారవీడు మండలం రాజంపల్లిలో ఒకటి కాగా ఒంగోలుకు కొత్తగా రెండో కేంద్రీయ విద్యాలయం మంజూరు చేశారు. 

 

ఈ విద్యా సంవత్సరంలో జూన్‌ 30 నాటికి విద్యాలయం ఏర్పాటుకు అవసరమైన భవన వసతి కల్పించాలి. ఈ మేరకు జిల్లా అధికారులు కేంద్రీయ విద్యాలయం డిప్యూటీ కమిషనర్‌కు నివేదిక పంపాలి. ఆ తరువాత వారు పరిశీలించి వసతులు ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాతనే విద్యాలయానికి అనుమతులిస్తారు. సకాలంలో వసతులు చూపించకపోతే ఈ ఏడాదికి విద్యాలయం అనుమతులు వచ్చే అవకాశం ఉండదు. యర్రగొండపాలేనికి మంజూరైన విద్యాలయానికి రాజుపాలెం గ్రామంలో వసతులు సిద్ధంగా ఉన్నాయి. ఒక్క ఒంగోలు విద్యాలయం ఏర్పాటుకు వసతులను చూపించడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. 

 

ఇటీవల దీనికి సంబంధించి కేంద్రీయ విద్యాలయం డిప్యూటీ కమిషనర్‌ మణివన్నన్, వారి బృందం జిల్లాలో పర్యటించింది. ఒంగోలు కేంద్రంకు సంబంధించి వసతి ఏర్పాటుపై జిల్లా కలెక్టర్‌ను సంప్రదించింది. ఇక్కడి అధికారుల నిర్లక్ష్యాన్ని బృందం కలెక్టర్‌ దృష్టికి తెచ్చింది. అయితే నిర్ణీత గడువులోనే వసతులు సమకూర్చుతామని కలెక్టర్‌ అధికారులకు హామీ ఇచ్చారు. ఆ తరువాత గతంలో కేంద్రీయ విద్యాలయం నిర్వహించిన పీవీఎస్‌ మున్సిఫల్‌ స్కూల్‌ నే ఎంపిక చేయాలని కలెక్టర్‌ కింది స్థాయి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. 

 

అయితే దీనికి సంబంధించిన అనుమతులు ఇంకా వెలువడినట్లు లేదు. మళ్లీ నివేదిక కేంద్రీయ విద్యాలయం అధికారులకు చేరాలి. వారు వచ్చి పరిశీలించి అంగీకారం తెలపాలి. ఈ తతంగానికి సమయం పడుతుంది. కలెక్టర్‌ ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా ఉన్నారు. మున్సిపల్‌ పాఠశాల ఎంపిక ఆయన తలుచుకుంటే క్షణాల్లో పని. ఈ నెల 30 లోపు వసతి చూపించకపోతే కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ప్రశ్నార్థకమౌతుంది. అదే జరిగితే వెనుకబడిన ప్రకాశం మరింత నష్టపోతుంది. ఈ పరిస్థితి లో సకాలంలో వసతి సమకూర్చి కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి కలెక్టర్‌ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top