డిజిటల్ ఏపీ ఆవిష్కరిస్తాం

డిజిటల్ ఏపీ ఆవిష్కరిస్తాం


ఐటీ కంపెనీల సీఈవోల సదస్సులో సీఎం చంద్రబాబు    

హైటెక్ సిటీని తలదన్నే రీతిలో విశాఖలో ‘సిగ్నేచర్ టవర్’

 ఐటీ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిని చేస్తాం

 ప్రతి ఇంటిని ఒక ఐటీ కేంద్రంగా మారుస్తాం

 సిలికాన్ కారిడార్‌గా విశాఖ అభివృద్ధి చేస్తాం

 గూగుల్, విప్రో తదితర సంస్థలతో ఒప్పందాలు


 

 సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో విస్తారంగా ఉన్న సహజ వనరులు, మానవ వనరులను సద్వినియోగం చేసుకుని అతి త్వరలోనే ‘డిజిటల్ ఆంధ్రప్రదేశ్’ను ఆవిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి కనీసం ఒకర్ని ఈ-ఆక్షరాస్యునిగా చేయడంతోపాటు ఒకర్ని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. ఐటీ కంపెనీల సీఈవోలతో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విశాఖపట్నంలో నిర్వహించిన సదస్సులో ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇన్నోవేషన్-స్టార్ట్ అప్ విధాన పత్రాలను విడుదల చేశారు. రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు గూగుల్ సంస్థతో రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఐటీ కంపెనీల స్థాపనకుగాను విప్రో, సమీర్, టెక్ మహేం ద్ర, టిస్సాల్వ్, మోబ్‌మి సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకుంది. అదే విధంగా 16 ఐటీ కంపెనీలకు విశాఖపట్నం, విజయవాడలలో భూములు, ఇంక్యుబేషన్ సెంటర్‌లో స్థలాలు కేటాయించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తూ ఏమన్నారంటే...

 

 - రానున్న నాలుగేళ్లలో రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం. ఐటీ రంగ ఫలాలను సామాన్యునికి అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. స్వయంసహాయక సంఘాల కార్యకలాపాలను ఆన్‌లైన్ విధానంలోకి తీసుకువస్తాం. చిన్నతరహా- మధ్యతరహా పరిశ్రమలు, వ్యాపారాలను ఆన్‌లైన్ విధానంలోకి తీసుకువచ్చి వాటి విస్తరణకు బాటలు వేస్తాం.

 - ఇంటర్‌నెట్ సేవలను తెలుగు భాషలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మా ప్రభుత్వం గూగుల్ సంస్థకు పూర్తిగా సహకరిస్తుంది. ప్రతి ఇంటిని ఓ ఐటీ కేంద్రంగా రూపాంతరం చెందేలా చేస్తాం.

 - హైదరాబాద్‌లోని హైటెక్ సిటీని తలదన్నేరీతిలో విశాఖపట్నం మధురవాడలో ‘సిగ్నేచర్ టవర్’ను నిర్మిస్తాం. ఇందుకోసం త్వరలోనే టెండర్ల ప్రక్రియ చేపడతాం. విశాఖపట్నంను సిలికాన్ కారిడార్‌గా అభివృద్ధి పరుస్తాం. ముంబాయి తరువాత దేశానికి ఆర్థిక, పారిశ్రామిక రాజధానిగా విశాఖపట్నంను తీర్చిదిద్దుతాం.

 - రాజకీయ- పరిపాలన రాజధానిగా విజయవాడ, ఆధ్యాత్మిక రాజధానిగా తిరుపతిలను అభివృద్ధి పరుస్తాం. ఈ  మూడు మెగాసిటీలతోపాటు రాష్ట్రంలో 30 స్మార్ట్ సిటీలను తీర్చిదిద్దుతాం. విశాఖపట్నం జిల్లాలో ఉన్న బాక్సైట్‌తోపాటు వివిధ జిల్లాల్లో ఉన్న ఖనిజ సంపదను వెలికితీస్తాం.

 

 - ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాలలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉండేలా చర్యలు తీసుకుంటాం. హారాష్ట్రంలో ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగా లు, ఎలక్ట్రానిక్ రంగంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఐటీ కంపెనీల స్థాపనకు వీలుగా సింగిల్ విండో విధానం ద్వారా నాలుగు వారాల్లోనే  అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు.

 - సమావేశంలో ఐటీ శాఖ సలహాదారు జె.సత్యన్నారాయణ, ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిష్ గోపాలకృష్ణన్, మోబ్‌మి సీఈవో సంజయ్ విజయ్‌కుమార్‌లతోపాటు నాస్కామ్, గూగుల్, టీసీఎస్, విప్రో, టెక్ మహేంద్ర సంస్థల ప్రతినిధులు, పలు ఐటీ సంస్థల సీఈవోలు పాల్గొన్నారు.

 -ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, పీతల సుజాత, ఎంపీలు కె. హరిబాబు, అవంతి శ్రీనివాస్, కొత్తపల్లి గీత, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, వాసుపల్లి గణేష్, బండారు సత్యన్నారాయణమూర్తి, తదితరులు  హాజరయ్యారు.

 

 20 ఎకరాల్లో సిగ్నేచర్ టవర్!

 విశాఖశివారులోని మధురవాడలో ‘సిగ్నేచర్ టవర్’ పేరిట ఐటీ కేంద్రం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మధురవాడ ఎస్‌ఈజెడ్‌లోని హిల్-3 మీద 20 ఎకరాలను కేటాయించాలని నిర్ణయించింది. సీఎం సోమవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించి టవర్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఈమేరకు భూ కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ యువరాజ్‌తోపాటు ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు. సిగ్నేచర్ టవర్ డిజైన్‌ను నిర్ణయించేందుకు టెండర్ల ప్రక్రియ చేపట్టాలని సూచించారు.

 

  అలాగే విశాఖపట్నంలో ఐఐఎంతోసహా పలు ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు కోసం భూములు గుర్తింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. కేంద్ర మానవ వనరుల శాఖ ఉన్నతాధికారులతో హైదరాబాద్‌లో త్వరలో సమావేశం నిర్వహించనున్నామని, ఆలోపు భూముల గుర్తింపు పూర్తి చేయాలని చెప్పారు. ఆ సమావేశం తర్వాత విశాఖలో ఏఏ విద్యా సంస్థలు ఏర్పాటు చేసేది స్పష్టత ఇస్తామని సీఎం తెలిపారు.  

 

 ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభం

 అంతకుముందు సీఎం చంద్రబాబు విశాఖపట్నం శివారులోని మధురవాడలోని ఐటీ ఎస్‌ఈజెడ్‌లో రూ.23 కోట్లతో నిర్మిం చిన టెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ (సన్‌రైజ్ స్టార్ట్‌అప్)ను ప్రారంభిం చారు. ఏపీఐఐసీ అధికారులతో మాట్లాడి ఐటీ రంగ సమస్యలను తెలుసుకున్నారు. విశాఖపట్నంలో ఐటీ, పర్యాటక రంగాలను జోడించి అభివృద్ధి పరిచేలా ప్రణాళిక రూపొందించమని అధికారులకు సూచిం చారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. విద్యార్థులు నిరంత రం కొత్త ఆలోచనలతో ముందుకువచ్చి అందుబాటులోని టెక్నాలజీని ఉపయోగిం చి అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top