వీక్ పాయింట్... వారంలోనే ఓకే

వీక్ పాయింట్... వారంలోనే ఓకే


* ఏడు రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులన్నీ ఇచ్చేస్తాం

* ఎనిమిదో రోజు నుంచే పనులు ప్రారంభించొచ్చు

* జపాన్ కంపెనీకి సీఎం చంద్రబాబు హామీ

* మోటార్ల తయారీ సంస్థ ఎన్‌ఐడీఈసీ చైర్మన్‌తో భేటీ

* రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి

*ఏపీలో వ్యాపారానికి ఉన్న సానుకూలతలపై వివరణ


 

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వస్తే అందుకు సంబంధించిన అనుమతులన్నీ వారం రోజుల్లోనే మం జూరు చేస్తామని, ఎనిమిదో రోజు నుంచే పనులు ప్రారంభించ వచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జపాన్‌లోని ప్రముఖ మోటార్ల తయారీ కంపెనీ ఎన్‌ఐడీఈసీ చైర్మన్ షిహెనోబు నాగమోరికి హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అందులో పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానం తమ రాష్ట్రమని సీఎం వివరించారు.

 

జపాన్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు నేతృత్వంలోని బృందం.. భార త కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఒసాకా నగరంలోని కన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. జపాన్‌లో సోమవారం జాతీయ సెలవుదినం అయినప్పటికీ అక్కడి ప్రభుత్వ అధికారులు, వివిధ సంస్థల ప్రతి నిధులు చంద్రబాబు బృందానికి ఘన స్వాగతం పలికినట్లు.. హైదరాబాద్‌లో ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం సోమవారం జారీ చేసిన ప్రకటనలో తెలిపింది. ఆ ప్రకటనలోని సమాచారం మేరకు.. చంద్రబాబు బృందం ఎన్‌ఐడీఈసీ చైర్మన్ షిహెనోబు నగమొరితో భేటీ అయ్యింది.

 

 ఈ సందర్భంగా.. తమ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుహృద్భావ సంబంధాలు కలిగి ఉండటమే కాకుండా అభివృద్ధి విషయంలో చిత్తశుద్ధితో ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. అయి తే తాము కొన్నేళ్ల క్రితం భారతదేశంలో వ్యాపారం, వాణిజ్యం కోసం ప్రయత్నించామని, కానీ అనుమతుల మంజూరులో జాప్యం, అవినీతి వల్ల తమ కార్యకలాపాలను విస్తరించలేకపోయామని నాగమోరి అన్నారు. దేశంలో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని చెప్పిన చంద్రబాబు.. కేంద్రం, రాష్ర్టంలో సుస్థిర ప్రభుత్వాలున్నాయని, అవి పారదర్శక విధానాలు అవలంబిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి జపాన్  పర్యటన సందర్భంగా మిమ్మల్ని కలిశారంటూ బాబు గుర్తుచేశారు. తాము నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని, రోడ్డు, జల మార్గాలు అందుబాటులో ఉన్నాయని, ఎగుమతులు, దిగుమతులతో పాటు వర్తక, వాణిజ్యాలకు రాష్ట్రం ఎంతో అనువుగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు జపనీస్ భాషలో రూపొం దించిన బ్రోచర్లను అందచేయటంతో పాటు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఒక డాక్యుమెంటరీని సైతం ప్రదర్శించారు. జపాన్‌లో ప్రసిద్ధి గాంచిన ఇకెబానా ఆర్ట్‌తో ప్రారంభమైన డాక్యుమెంటరీ, ఆంధ్రప్రదేశ్‌కు స్వాగతమంటూ చంద్రబాబు జపనీస్‌లో చేసిన వ్యాఖ్యతో ముగి యటం జపాన్ అధికారులను, ఆ కంపెనీ ప్రతి నిధులను విశేషంగా ఆకట్టుకుందని సమాచార సలహాదారు కార్యాలయం పేర్కొంది.

 

ఎన్మార్ కూ బాబు ఆహ్వానం

 అంతకుముందు ఎన్మార్ వ్యవసాయ యంత్రాలు, పనిముట్ల తయారీ సంస్థను చంద్రబాబు బృందం సందర్శించింది. ఏపీలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చేపట్టాల్సిన యాంత్రీకరణ విధానాలను బృందం అక్కడ పరిశీలించింది. జపాన్‌లో వ్యవసాయ ఆధునీకరణపై సంస్థ ఎండీ నొకి కొబాయెషి వివరించారు. యాంత్రీకరణ వల్ల తమ దేశంలో వ్యవసాయం సులభతరమైందని ఆయన చెప్పారు. భారతదేశంలోని మురుగప్పన్ సంస్థతో తమకు ఇప్పటికే ఒప్పందం ఉందని తెలిపారు.

 

 ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దేశంలోనే పొడవైన సముద్ర తీరం ఉన్న తమ రాష్ర్టంలో ఎన్మార్ కంపెనీ యంత్రాల తయారీ పరిశ్రమను ప్రారంభిస్తే ఆసియా దేశాలతో వర్తక, వాణిజ్యాలు విస్తరిస్తాయని చెప్పారు. తొలిరోజు పర్యటనలో చంద్రబాబు వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, పొంగూరి నారాయణ, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ప్రభుత్వ సమాచార సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ, ఎంపీలు గల్లా జయదేవ్, సీఎం రమేష్, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర, సీనియర్ అధికారులు ఎస్‌పీ టక్కర్, జేఎస్వీ ప్రసాద్, ఏఆర్ అనూరాధ ఉన్నారు.  

 

 భారత్‌లోనూ కార్యకలాపాలు: నగమొరి

 నగమొరి మాట్లాడుతూ ప్రపంచంలో 53 శాతం విద్యుత్‌ను మోటార్లే వినియోగిస్తున్నాయని, వాటి పనితీరును మెరుగుపరిస్తే విద్యుత్ గణనీయంగా ఆదా చేయవచ్చని చెప్పారు. తాము ఈ అంశంపైనే ప్రధానంగా దృష్టి సారించామని తెలిపారు. చిన్న, పెద్ద మోటార్ల తయారీ మార్కెట్‌లో ప్రపంచంలో 60 శాతం వాటా తమదేనని, గత 30 సంవత్సరాలుగా చైనాలో తాము వ్యాపారం నిర్వహిస్తున్నామని చెప్పారు. భారత్‌లో కూడా తమ కార్యకలాపాలు ప్రారంభించి జపాన్‌కు విదేశీ మారకద్ర వ్యం సమకూరుస్తామని నాగమోరి పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top