నాకు భర్త కావాలి..

నాకు భర్త కావాలి.. - Sakshi


► భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

► మద్దతు తెలిపిన ప్రజా సంఘాలు


ప్రొద్దుటూరు క్రైం(వైఎస్సార్‌ జిల్లా): ‘నాకు భర్త కావాలి.. నాకు ఆయన ఇంట్లో ఆశ్రయం కల్పించండి’ అంటూ ఒక మహిళ తన భర్త ఇంటి ముందు నిరసన చేపట్టింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు గుండ్లదుర్తి రాజేంద్రప్రసాద్‌రెడ్డి స్వగ్రామం ఎర్రగుంట్ల మండలంలోని మాలెపాడు. అయితే కొన్నేళ్ల నుంచి ప్రొద్దుటూరులోని లింగారెడ్డి నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన ఇద్దరు కుమార్తెల్లో సుమలత చిన్న కూతురు. 2015 అక్టోబర్‌లో బాలాజినగర్‌–1లో నివాసం ఉంటున్న చిలకల గురు ప్రతాపరెడ్డితో సుమలత వివాహం జరిగింది. అతను హైదరబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు.


వివాహ సమయంలో తల్లిదండ్రులు కట్నకానుకల కింద 60 తులాల బంగారు ఇచ్చారు. పెళ్లైన నాలుగు రోజులకే ఆమె అత్తగారింటికి వెళ్లింది. కొన్ని రోజుల తర్వాత గురు ప్రతాప్‌ హైదరాబాద్‌కు సంసారాన్ని మార్చాడు. ‘ఐదు ఎకరాలు పొలం రాసిస్తేనే ఇక్కడ ఉండు, లేకుంటే మీ అమ్మగారింటికి వెళ్లిపో’ అని భర్త, అత్తా మామలు చెప్పారు. ఈ క్రమంలోనే గత ఏడాది భార్య చేతులు కట్టేసి, తాళి తెంచి భర్త చిత్రహింసలకు గురి చేశాడు.


ఈ సంఘటనపై హైదరాబాద్‌లోని నాసింగ్‌ పోలీస్‌స్టేషన్‌లో భర్తపై 498 ఏ సెక్షన్‌ కింద కేసు నమోదైంది. భర్తతోపాటు అత్తా, మామ, ఆడపడచుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా హైదరాబాద్‌లోని మరో మహిళతో తన భర్తకు వివాహేతర సంబంధం ఉన్నట్లు సుమలత ఆరోపిస్తోంది. ఏడాది నుంచి ఆమె అమ్మగారింట్లోనే ఉంటోంది. ప్రతాప్‌రెడ్డి రూ.15 లక్షలు నగదు ఇస్తే విడాకులు తీసుకునేలా పెద్దలు పంచాయితీ చేశారు. అయితే జరిగిన ఒప్పందం ప్రకారం డబ్బు ఇవ్వలేదు. ఇటీవల రూ.4 లక్షలు మాత్రమే ఇస్తామని ఆమె అత్తా, మామలు చెప్పి పంపించారు.


డబ్బు వద్దని తనకు భర్త కావాలని, ఇంట్లో తనకు ప్రవేశం కల్పించాలని కోరుతూ ఆమె బుధవారం బాలాజీనగర్‌లో భర్త ఇంటి ముందు నిరసన చేపట్టింది. మహిళా సంఘం జిల్లా నాయకురాలు మరియమ్మ, సులోచన, ముంతాజ్, నాగలక్షుమ్మ, లక్ష్మీదేవి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మోహన్, జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, వలి, విజయ్, చెన్నారెడ్డి, కొండన్న తదితరులు ఆమెకు మద్దతుగా నిలిచారు. టూ టౌన్‌ పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువురిని స్టేషన్‌కు రమ్మని చెప్పారు. విచారించి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆమె నిరసన విరమించింది.      

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top