అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి

అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి - Sakshi


వల్లభాపురం (కొల్లిపర):

 వివాహమైన 11 నెలలకే ఓ యువతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. వేధింపులకు పాల్పడుతున్న భర్తే హత్యచేసి పారిపోయి ఉంటాడని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన కొక్కిలిగడ్డ సీతారామ్‌కు కృష్ణా జిల్లా కోడూరు మండలం దింటిమేరక గ్రామానికి చెందిన నాగజ్యోతితో గత అక్టోబర్‌లో వివాహమైంది. పెళ్లి సందర్బంగా రూ.22 వేలు కట్నం కింద ఇచ్చారు. నెలరోజులకే ఆదనపు కట్నం తెమ్మంటూ వేధింపులు మొదలయ్యాయి. మూడు నెలల క్రితం భార్యను పుట్టింటికి పంపాడు. అయితే నెల క్రితం సీతారామ్ తండ్రి దానారావు దింటిమేరక వెళ్లి ఇకపై వేధింపులు ఉండవని హామీ ఇచ్చి కోడల్ని తీసుకువచ్చాడు. ఈనెల 13న దింటిమేరక వెళ్లివద్దామని చెప్పి సీతారామ్ తన భార్యను గ్రామం వద్ద ఉన్న కృష్ణానదిలో పడవపై ఏరవతలకు తీసుకువెళ్లాడు. అప్పటినుంచి భార్యాభర్తలు కనిపించకుం డాపోయారు. అదేరోజు తన సెల్‌ఫోను నుంచి కుటుంబసభ్యులకు జ్యోతి ఫోన్‌చేసి మాట్లాడింది. మరుసటి రోజు నుంచి ఆ ఫోన్ పనిచేయకపోవడంతో ఆందోళనకు గురై తండ్రి వెంకటేశ్వరరావు బంధువులతో కలసి 15న వల్లభాపురం వచ్చా రు. సీతారామ్ కుటుంబసభ్యులను విచారించగా, 13నే జ్యోతి దింటిమేరక వెళ్లిపోయిందని, తమ కుమారుడూ కనపడడం లేదని ‘మీరే ఏదో చేసి ఉంటారంటూ’ వారిపై సీతారామ్ సోదరులు వాదనకు దిగారు. దీంతో వెనుదిరిగి వెళ్లి గాలింపుచేపట్టినా ఫలితం లేకపోవడంతో జ్యోతి తండ్రి శనివారం కొల్లిపర పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దంపతులు కనపడడం లేదంటూ దినపత్రికల్లో వార్తలు రావడంతో గ్రామస్తులు కొందరు జ్యోతిని వారంక్రితం లంకలో చూశామని చెప్పడం తో అక్కడకు వెళ్లిచూడగా, గుడిసె దగ్ధమై ఉంది. అందులో ఒక అస్థిపంజరం ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. అస్థిపంజరానికి ఉన్న గాజు జ్యోతిదేనని తండ్రి వెంకటేశ్వరరావు తెలిపాడు. తమ కుమార్తెను అల్లుడే హత్యచేశాడని ఆరోపించాడు.

 ఆది నుంచి వేధింపులే..

 పెళ్లయిన నాటి నుంచి అనుమానంతో సీతారామ్ తరచూ భార్యను వేధిస్తుండేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఎక్కడికి వెల్లినా అమెను కూడా తన వెంట తీసుకువేళ్లేవాడని, ఇటీవల కాలంలో ఎవరో జుట్టు బాగుంది అని చెప్పడంతో అమెకు గుండు గీయించాడని చెప్పారు. అదనపు కట్నం తెమ్మంటూ పదేపదే వేధిస్తుండే వాడని, మూడు నెలల క్రితం ఇంటికి వస్తే చేసేది లేక తమతోనే ఉంచుకున్నామని తండ్రి బోరుమన్నాడు. తిరిగి పంపకుండా ఉన్నా తమ కూతురు బతికేదని కన్నీటిపర్యంతమయ్యాడు. జ్యోతి మరణవార్త తెలిసి అమె బందువులు, గ్రామస్తులు పెద్దఎత్తున ఆ ప్రదేశానికి చేరుకున్నారు. తెనాలి డీఎస్పీ టీపీ విఠలేశ్వర్, రూరల్ సీఐ టి.మురళీకృష్ణ, ఎస్‌ఐ జి.సుబ్బారావు, కొల్లిపర పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రాథమికంగా సీతారామ్ హత్య చేసి పరారై ఉంటాడని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో వాస్తవాలు తెలుస్తాయన్నారు.







 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top