వేతనాలు పెంచమంటే లోటు బడ్జెట్ అంటారా?


- అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి

ఒంగోలు : గత నలభై సంవత్సరాల నుండి అంగన్‌వాడీలు సేవలు అందిస్తున్నారు. ఉదయం 9గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. నెలకు కార్యకర్తకు 4200, ఆయాకు 2200రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. వేతనాలు పెంచమంటే లోటు బడ్జెట్ అంటున్నారు. అంత లోటు బడ్జెట్ ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టాభిషేకానికి 30కోట్లు ఎలా ఖర్చు చేశారు. మంత్రుల ఇంటి అద్దె 50వేల నుండి లక్ష రూపాయలకు ఎలా పెంచారు. సింగపూర్, జపాన్ టూర్లకు కోట్లాది రూపాయలు ఏవిధంగా ఖర్చు చేస్తున్నారని’ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కారుసాల సుబ్బరావమ్మ ధ్వజమెత్తారు. యూనియన్ జిల్లా కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు బుధవారం ఒంగోలు వచ్చిన సందర్భంగా స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.



2014 ఫిబ్రవరి అంగన్‌వాడీలు 13రోజులపాటు సమ్మె నిర్వహించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్‌వాడీల డిమాండ్లకు సంబంధించిన ఫైల్ సిద్ధం చేసిందన్నారు. ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాలతో గవర్నర్ పాలన రావడం, అంగన్‌వాడీల ఫైల్ పెండింగ్‌లో ఉందన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించిన తరువాత అంగన్‌వాడీల వేతనాల పెంపుతోపాటు పదవీ విరమణ అనంతరం ప్రోత్సాహకాల గురించి కలిస్తే స్పందించలేదన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీఓలను రద్దు చేసిన ఆయన అంగన్‌వాడీలకు సంబంధించిన పెండింగ్ ఫైల్ గురించి ఉద్దేశ్యపూర్వకంగా తొక్కి పెట్టారన్నారు. చంద్రబాబును కలిసి వేతనాల పెంపు గురించి అడిగితే లోటు బడ్జెట్ అంటూ బీద పలుకులతో కాలం వెళ్ళదీస్తున్నారని విమర్శించారు. మిషన్ మోడ్ పేరుతో అంగన్‌వాడీ కేంద్రాల్లో పదిశాతం ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుయుక్తులు పన్నుతుందన్నారు.



అదనపు విధులు.. రాజకీయ వేధింపులు

అంగన్‌వాడీలకు అదనపు బాధ్యతలు అప్పగించడంతోపాటు రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నారని కారుసాల సుబ్బరావమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఓటరు నమోదు ప్రక్రియ నుండి మరుగుదొడ్ల సర్వే వరకు అంగన్‌వాడీలను వినియోగించుకోవడంతో కేంద్రాలను సక్రమంగా నిర్వహించలేకపోతున్నారన్నారు. అదే సమయంలో అంగన్‌వాడీలపై రాజకీయ వేధింపులు మొదలైనాయన్నారు. గుంటూరు జిల్లా నాదెళ్లలో 80మంది అంగన్‌వాడీలను తొలగించారని, తూర్పుగోదావరి జిల్లాలో 227మందిని తొలగిస్తే కోర్టు జోక్యంతో వెనక్కు తీసుకున్నారన్నారు. ఇందిరమ్మ అమృత హస్తం పథకానికి సంబంధించిన బిల్లులు అంగన్‌వాడీల ఖాతాలో కాకుండా వీఓఏల ఖాతాలో జమ చేస్తున్నారన్నారు. దీంతో అంగన్‌వాడీలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఈనెల 26, 27తేదీల్లో పోస్టుకార్డు ఉద్యమం, 9నుండి 11వ తేదీ వరకు మండల తహసీల్ధార్ కార్యాలయాల వద్ద రిలే దీక్షలు, 13వ తేదీ ఆర్‌డీఓ కార్యాలయాల ముట్టడి, 17వ తేదీ చలో అసెంబ్లీ నిర్వహిస్తున్నట్లు కారుసాల సుబ్బరావమ్మ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఈదర అన్నపూర్ణ పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top