చంద్రబాబును అరెస్ట్ చేయకపోవటం దారుణం: వైఎస్ జగన్

చంద్రబాబును అరెస్ట్ చేయకపోవటం దారుణం: వైఎస్ జగన్ - Sakshi


కాకినాడ : తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది.  తుఫాన్ కారణంగా మృతి చెందిన మత్స్యకారుడు పి.వెంకటేశ్వరరావు కుటుంబాన్ని ఆయన శుక్రవారం పర్లోపేటలో పరామర్శించారు. ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.  ఇన్నిరోజులు అయినా మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు.  మత్స్యకారుల ప్రాణాలను చంద్రబాబే తీశారని, వాతావరణ పరిస్థితులపై కనీస హెచ్చరికలు కూడా ప్రభుత్వం చేయలేదన్నారు. వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఎలాంటి సాయం అందటం లేదని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.



హఠాత్తుగా చంద్రబాబు నాయుడు ఇప్పుడే సెక్షన్-8 ఎందుకు అంటున్నారని, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సెక్షన్-8 అన్నది ఒక భాగం మాత్రమే అని వైఎస్ జగన్ అన్నారు. చట్టంలో హామీలు అమలు చేయాలంటూ ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను పలుమార్లు కలిశామని, మొత్తం చట్టాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. అప్పటి ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరినట్లు వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.



విషయాన్ని పక్కదారి పట్టించడానికి చంద్రబాబు ఇప్పుడు సెక్షన్-8 అంటున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. లంచాలు తీసుకున్న డబ్బుతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి యత్నిస్తున్నారని, బహుశా దేశచరిత్రలో ఎప్పుడూ ఇలా జరిగి ఉండదన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్ల నుంచి రూ.20 కోట్లు ఇవ్వడానికి యత్నించి పట్టుబడ్డారని, నల్లధనంతో వారిని కొనుగోలు చేయడానికి నేరుగా చంద్రబాబు ఫోన్లో మాట్లాడరని, వీడియోల్లో దొరికినా చంద్రబాబును అరెస్ట్ చేయకపోవడం దారుణమన్నారు. సిగ్గుమాలిన చంద్రబాబు...ప్రజలను తప్పుదోవ పట్టించడానికి సెక్షన్-8 ప్రస్తావిస్తున్నారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఎన్డీ తివారీ విషయంలో చెప్పిన నీతిని చంద్రబాబు ఇప్పుడు ఎందుకు ఆచరించడం లేదని ప్రశ్నించారు. ఎన్డీ తివారీకి  ఓ నీతి...చంద్రబాబుకు మరో నీతా అని వైఎస్ జగన్ నిలదీశారు.



అనంతరం ఆయన కాకినాడ  జగన్నాథపురం బయల్దేరి వెళ్లారు. ఇటీవల మృతి చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ చామకూర ఆదినారాయణ(నాగబాబు) కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. తదుపరి కాకినాడరూరల్ నియోజకవర్గం పగడాలపేట వెళతారు. ఆ తర్వాత వైఎస్ జగన్ కాకినాడ నుంచి బయలుదేరి ఏజెన్సీలోని గంగవరం మండలం  పాతరామవరం చేరుకుంటారు. అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పిస్తారు.



పాతరామవరం నుంచి పి. నెల్లిపూడి, సీహెచ్. నెల్లిపూడి, కొత్త నెల్లిపూడి మీదుగా కొత్తాడ చేరుకుంటారు. కొత్తాడలో మృతుడు శారపు అబ్బులుదొర కుటుంబాన్ని ఆయన ఓదారుస్తారు. అనంతరం కొత్తాడ నుంచి సూరంపాలెం చేరుకొని ఎనిమిది మంది మృతుల కుటుంబాలను , క్షతగాత్రులను పరామర్శిస్తారు. అనంతరం సూరంపాలెం రిజర్వాయర్ సమీపంలో రంపచోడవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top