తెల్లకార్డు లేకపోయినా వైద్య సేవలు

తెల్లకార్డు లేకపోయినా వైద్య సేవలు - Sakshi


దివంగత వైఎస్ రూపొందించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంగా పేరు మార్చింది. ఈ పథకం ద్వారా తెల్లరేషన్‌కార్డుదారులు, ఉద్యోగుల హెల్త్‌కార్డుల ద్వారా మొత్తం 1,885 జబ్బులకు ఉచితంగా వైద్యం పొందవచ్చు. తెల్లరేషన్ కార్డుదారులకు 1,044 వ్యాధులకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవ కింద వైద్య సేవలను ఇలా పొందవచ్చు.                              - ఆకివీడు

 

ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో సేవలు ఇలా..

ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో తెల్లరేషన్ కార్డు లేని నిరుపేదలు సేవలు పొందాలంటే ముందుగా మండలంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి ధ్రువపత్రాన్ని పొందాలి. ఈ ధ్రువపత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు పంపుతారు. కలెక్టర్ అనుమతితో ఎన్టీఆర్ వైద్య పథకానికి అనుమతి కార్డు లభిస్తుంది. అప్పుడు వైద్య సేవలు పొందేందుకు వీలు ఉంటుంది.

 

ఏయే జబ్బులకు చికిత్సలంటే..

ఈ పథకం ద్వారా మెదడు, క్యాన్సర్, నరాలు, జనర ల్ సర్జరీ, ఎముకలు, వెన్నుముక, చెవి, ముక్కు, గొంతుక, చిన్న పిల్లల వ్యాధులు, పుట్టుకతో వచ్చే వ్యాధులు తదితర 1,044 రకాల జబ్బులకు ఎన్టీఆర్ వైద్య సేవలో వైద్య సదుపాయం ఉంది.

 

జిల్లాలో 20 ఆసుపత్రుల్లో సేవలు..

ముందుగా దగ్గర్లోని ఆరోగ్య మిత్రలను కలవాలి. అన్ని ప్రధాన ప్రభుత్వాసుపత్రుల్లో ఆరోగ్యమిత్రలు ఉన్నారు. వారు ఆయా జబ్బులకు స్పెషలిస్ట్ వైద్యులున్న ఆసుపత్రులకు రోగుల్ని పంపిస్తారు. అందుబాటులో ఉన్న స్పెషలిస్టులతో ఉచితంగా వైద్యం చేయిస్తారు. రాష్ట్రంలోని అన్ని సూపర్ స్పెషాలిటీస్ ఆసుపత్రులు, ప్రభుత్వాసుపత్రులు, ఇతర స్పెషలిస్టు ఆసుపత్రుల్లో వైద్యం పొందవచ్చు. మన జిల్లాలో 9 ప్రైవేట్, 8 ప్రభుత్వ, 3 డెంటల్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్యసేవలు అందుతున్నాయి. రోగులు ఆయా ఆసుపత్రుల్లోని సిబ్బందిని సంప్రదించవచ్చు.  ఏమైనా సందేహాలుంటే నేరుగా వైద్యులను సంప్రదించవచ్చు.

 

తెలంగాణలో కూడా వర్తింపు

తెలంగాణ రాష్ట్రంలో కూడా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కార్డు ద్వారా వైద్య సేవలు పొందవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రముఖ ఆసుపత్రులు ఉండడంతో ఈ సౌకర్యాన్ని అక్కడ కూడా వర్తింప చేశారు. ఇతర పట్టణాల్లోని సూపర్ స్పెషల్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం పొందవచ్చు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top