సమస్యలు తీరేనా?

సమస్యలు తీరేనా? - Sakshi


జిల్లాలోని పేద రోగులకు అనంతపురం సర్వజనాస్పత్రే పెద్దదిక్కు. వేలకు వేలు వెచ్చించి ప్రైవేటు వైద్యం చేయించుకోలేని వారు ఈ ఆస్పత్రినే నమ్ముకుంటున్నారు. నిత్యం వందలాది మంది ఇక్కడికొచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందడం లేదు. సిబ్బంది, పడకల కొరత, కరెటు కష్టాలు, మరుగుదొడ్లు సరిగా లేకపోవడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. చాలా సమస్యలు ఏళ్లుగా కొనసాగుతున్నాయి.



వాటిని పరిష్కరించడంలో యాజమాన్యం విఫలమవుతోంది. ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ (హెచ్‌డీఎస్) సమావేశాల్లో చర్చించడం మినహా శాశ్వత పరిష్కారాన్ని చూపడం లేదు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ అధ్యక్షతన జరిగే సమావేశంలోనైనా తగిన పరిష్కారం లభిస్తుందేమోనని ప్రజలు వేచిచూస్తున్నారు. ఈ సమావేశం కోసం పది అంశాలతో అజెండా సిద్ధం చేశారు. కనీసం మూడింటిని నెరవేర్చినా కాస్త ఊరట లభిస్తుందని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి.    

                  

కలగా 124 జీఓ

నాలుగేళ్ల క్రితం 124 జీఓ విడుదలైంది. అప్పటి నుంచి జీఓ ఆచరణ అంగులం కూడా ముందుకు కదల్లేదు. ఆస్పత్రిలో ప్రధానంగా నెలకొన్న సమస్యలు జీఓ అమలుతో తీరుతాయని యాజమాన్యం గొంతెత్తి చెబుతున్నా...పాలక వర్గం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అమలు జరిగితే సిబ్బంది కొరత తీరి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందుతాయి. ఇందులోని 510 పోస్టుల్లో 134 స్టాఫ్‌నర్సు పోస్టులుకాగా, మిగితావి పారామెడికల్ పోస్టులు. ఈ పోస్టుల భర్తీ జరిగితే పేద ప్రజలకు వైద్యం ఆలస్యం కాదు. అటువంటిది ఈ జీఓ కలగానే మిగులుతోంది.



కరెంటు కష్టాలు..

ఇటీవల ఆస్పత్రిని కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. తరచూ విద్యుత్ సమస్యలతో రోగులు అల్లాడిపోతున్నారు. వెంటిలేటర్లపై ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల పరిస్థితి అంతా ఇంతా కాదు. కరెంటు తరచూ షార్‌‌ట సర్క్యూట్ గురికావడంతో ఏకంగా ఆర్థో ఓటీ థియేటర్‌నే మూసేశారు. వారం రోజుల క్రితం ఆస్పత్రిలోని రక్తనిధి కేంద్రం ఎదురుగా ఉన్న ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డు కాలిపోయింది. ఫలితంగా గైనిక్, చిన్నపిల్లల విభాగం, రేడియాలజీ విభాగంలో కరెంటు లేకుండా పోయింది. కరెంటు సరఫరాకి ఆటంకం కల్గకుండా శాశ్వత పరిష్కారం కావాల్సి ఉంది. ప్రస్తుతం ముగ్గురు ఎలక్ట్రీషియన్‌లు మాత్రమే ఉన్నారు. షాట్ సర్క్యూట్‌తో రోగులు ప్రాణాలకే ప్రమాదం లేకపోలేదు. దీనిని ఏవిధంగా గట్టెక్కుతారో చూడాలి.



మరమ్మతుకి నోచుకోని టాయిలెట్స్

ఆస్పత్రిలోని నాలుగు వార్డులలో టాయిలెట్స్ మరమ్మతుకు నోచుకోవడం లేదు. 23 మరుగుదొడ్లు అధ్వాన్నస్థితికి చేరుకున్నాయి. దీంతో వాటికి  తాళం వేశారు. రోగులు, వారి సహాయకులు సులభ్ కాంప్లెక్స్‌కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆస్పత్రికి అధిక సంఖ్యలో పేద వారే వస్తుంటారు. అటువంటిది వారికి కనీస సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. స్వచ్చభారత్ పేరిటి అన్ని చోట్ల పనులు చేస్తున్నారు కానీ, ఆస్పత్రిలో మాత్రం మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు.

 

500 పడకలు 700 రోగులు

ఆస్పత్రిని ప్రధానంగా పీడిస్తున్న సమస్యల్లో పడకల కొరత ఒకటి. 500 పడకల సామర్థ్యం కల్గిన ఆస్పత్రిలో 700 మంది ఇన్‌పేషంట్లు ఉంటున్నారు. వీరికి అడ్మిషన్ ఇస్తున్నారు కానీ మంచాలు మాత్రం చూపడం లేదు. దీంతో చాలా మంది రోగులు కటిక నేలపై పడుకున్న సందర్భాలు కోకొల్లలు. బాలింతలు, గర్భిణీలు నేలపై పడుకుని నానా అవస్థలు పడుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేస్తే తప్ప రోగుల కష్టాలు తీరవని చెబుతున్నారు. వైద్య సేవల్లో జాప్యం జరుగుతుండడంతో రోగులు ప్రైవేట్ బాట పడుతున్నారు. ఏదిఏమైనా ఈ హెచ్‌డీఎస్ సమావేశంలోనైనా...ఆస్పత్రి మెరుగుపడుతుందో లేదో వేచి చూద్దాం.



నిద్రమత్తులో ఏపీఎంఎస్‌ఐడీ అధికారులు

ఆస్పత్రిలో ఏ పనులు చేయాలన్నా ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులే చేయాలి. అటువంటిది వీరు ఏమాత్రం ముందడుగు వేయడం లేదు. కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడిన అనేక సందర్భాలున్నా స్పందించడం లేదు. ఊరు బయట తమ కార్యాలయం ఉందని తప్పించుకుని తిరుగుతున్నారన్న విమర్శలు వినబడుతున్నాయి. ఆస్పత్రిని డీఈ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. అలాంటిది ఎవరూ పట్టించుకోవడం లేదు. వీరి కింది స్థాయి సిబ్బంది డీఎంహెచ్‌ఓ కార్యాలయం పక్కన ఉన్న టీ కొట్టులో మాత్రం దర్శనమిస్తుంటారు. కరెంటు కాలిపోతోందంటే అటువైపు తొంగి చూడని అధికారులు పిచ్చాపాటి మాట్లాడుకునేందుకు వస్తున్నారు. ఈ శాఖ నిద్రమత్తులో ఉందని వీరిని మేలుకొలిపేలా జిల్లా కలెక్టర్ ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top