ఏం చేద్దాం..


విశాఖపట్నం:  చాలా ప్రత్యామ్నాయ మార్గాలు వదిలేసి విద్యుత్ చార్జీలు పెంచాల్సిన అవసరం ఏమిటంటూ వినియోగదారులు సంధించిన ప్రశ్నకు  ఈపీడీసీఎల్‌లో అంతర్మథనం మొదలైంది. ఇటీవల వినియోగదారుల నుంచి వ్యతిరేకతను చూశాక ప్రతిపాదించిన మేరకు చార్జీలు పెరుగుతాయో లేదోననే అనుమానం పుట్టుకొచ్చింది. గతేడాది కూడా ఇదే విధంగా టారిఫ్‌లు ఇచ్చినా చార్జీలు పెంచకుండా పాత టారిఫ్‌నే కొనసాగిస్తూ ఏపీఈఆర్‌సీ నిర్ణయం ప్రకటించింది.



ఈసారి కూడా అదే పునరావృతమైనా లేక ప్రతిపాదించిన స్థాయిలో చార్జీలు పెరగకపోయినా ఈపీడీసీఎల్ ఆర్థిక లోటు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సంస్థ సీఎండీ ఆర్ ముత్యాలరాజు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి సారించారు. వాటిపైనే రోజూ కార్పొరేట్ కార్యాలయంలో డెరైక్టర్లు, సీజీఎంలతో విస్తృతంగా చర్చిస్తున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలో 52.18 లక్షల విద్యుత్  వినియోగదారులున్నారు. వీరికి విద్యుత్ సరఫరా అందించేందుకు 941 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, 150181 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ,33/11కెవి సబ్‌స్టేషన్లు 653 ఉన్నాయి. ఇవి తరచుగా మరమ్మతులకు గురవుతుండటం వల్ల విద్యుత్ అమ్మకాలపై ప్రభావం పడుతోంది.  ఫలితంగా ఫెయిల్యూర్ శాతం 4.89 నమోదయింది. ఫిబ్రవరి, మార్చి నెలలు కూడా జతకలిసే సరికి ఈ శాతం మరింత పెరుగుతుంది. ఇప్పటికే నర్శీపట్నంలో రూ.3.31 కోట్లతో ఈ పనులు పూర్తి చేసింది. 15శాతం పైబడి నష్టాలు కలిగిన 9పట్టణాల్లో  ఈ పనులకు రూ.61.82 కోట్లు మంజూరు చేశారు. పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులను సీఎండీ ఆదేశించారు. అదే విధంగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ రూ.61.44 కోట్లతో ఈపీడీసీఎల్ పరిధిలోని 29 పట్టణాల్లో చేపట్టిన ఫీడర్ వారీగా ఎనర్జీ ఆడిట్ నివేదికలు సేకరించడం,  కేంద్రీకృత వినియోగదారుల సేవాకేంద్రాల ఏర్పాటు పనులు 28 పట్టణాల్లో పూర్తికాగా విశాఖలో మార్చి 8వ తేదీ నాటికి పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు.



సబ్‌స్టేషన్లపై భారం పడకుండా చేయడం ద్వారా అమ్మకాలు పెంచుకునే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ ఫరఫరా కోసం రూ.25.25 కోట్ల ఖర్చుతో 430 కిలో మీటర్ల 33కెవి లైన్లు ఇంటర్ లింకింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలనుకుంటున్నారు. విద్యుత్‌ను పొదుపు చేయాలని కూడా ఈపీడీసీఎల్ ప్రయత్నిస్తోంది. దాని కోసం 5స్టార్ రేటెడ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు మాత్రమే వినియోగించనున్నారు. ప్రస్తుతం అమ్మకాల ద్వారా వస్తున్న రూ.7898.223 కోట్ల ఆదాయాన్ని ఇలాంటి విధానాల ద్వారా పెంచుకోవాలని ఈపీడీసీఎల్ భావిస్తోంది.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top