దేవా... ఇదేమి స్వాహా

దేవా... ఇదేమి స్వాహా


దేవాలయ పునర్నిర్మాణంలో అవినీతి?

 లక్షల్లో దాతల సొమ్ము దుర్వినియోగం

 

 దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అన్నట్టు దేవాలయం పునర్నిర్మాణంలో తలో చేయి వేసి లక్షల రూపాయల సొమ్ము స్వాహా చేశారని భక్తులు వాపోతున్నారు. దాతల సొమ్ముతోనే నిర్మించినట్టు ఓ వైపు చెబుతుంటే దేవాదాయ శాఖ విడుదల చేసి రూ.25 లక్షలు ఏమయ్యాయని గ్రామస్తులు నిలదీయడంతో నీళ్లు నములుతున్నారు.

 

 సాక్షి ప్రతినిధి, ఒంగోలు :  టంగుటూరు మండలంలోని పొందూరు గ్రామంలో ఉన్న దేవాలయ పునరుద్ధరణ పనులు వివాదాస్పదంగా మారాయి. ఒకవైపు ప్రభుత్వం నుంచి పునర్నిర్మాణం కోసం నిధులు రాగా, మరోవైపు దాతల నుంచి కూడా నిధులు భారీగా వసూలు చేశారు. ప్రభుత్వ నిధులతో పనులు పూర్తి చేసినట్లు శిలాఫలకం వేసిన అధికారులే, దాతలు ఇచ్చిన సొమ్మును కూడా శిలాఫలకాల్లో చూపించారు. ఈ పనుల్లో అధికారులు కుమ్మక్కై భారీగా దాతల సొమ్ము నొక్కేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై స్థానికులు దేవాదాయ శాఖ కమిషనర్‌కు, ప్రిన్సిపల్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఈ అవినీతిపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 



వివరాల్లోకి వెళ్తే...

 టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో ఉన్న శ్రీరామలింగేశ్వరస్వామి దేవస్థానం జీనోద్ధరణ పనులకు దేవాదాయ శాఖ ద్వారా రూ.25.65 లక్షల అంచనాలు ఆమోదం పొందాయి. వీటిని టెండర్లు పిలిచి పనులూ పూర్తి చేశారు. ఈ పనికి  ఖర్చయిన రూ.25 లక్షల ఖర్చులో మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కింద దేవస్థానం నిధుల నుంచి  రూ.8.55లక్షలు, ప్రభుత్వ సీజీఎఫ్ గ్రాంట్ నుంచి రూ.17 లక్షలు వచ్చాయి. ఈ పనులన్నీ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి పి.వెంకట్రావు నేతృత్వంలో పూర్తి చేశారు.  కానీ ఇదే పనులకు పొందూరు గ్రామ నివాసులైన వేజండ్ల రామారావు, కనమర్లపూడి వెంకట శేషరావు తదితరులు రామలింగేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ కమిటీ తరపున సుమారు రూ. 55 లక్షల  వరకూ వసూలు చేసి ఆలయాన్ని పునర్నిర్మించినట్లు శిలాశాసనం చెక్కించారు.



ఒకే పనిని తామంటే తాము చేసినట్లుగా దేవాదాయ శాఖ, పునర్నిర్మాణ కమిటీవారు చెప్పుకుంటున్నారు. దేవస్థానం గోడలపై ఏర్పాటు చేసిన శిలాఫలకాల ప్రకారం మొత్తం 80 లక్షల రూపాయల వరకూ ఖర్చయినట్లు కనపడుతోంది. వాస్తవంగా ఈ పనికి డిపార్టుమెంట్ రూ.25 లక్షలు మంజూరు చేసింది. దీన్ని బట్టి చూస్తే దాతలు వసూలు చేసిన మొత్తం దుర్వినియోగమైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.  ప్రహరీగోడ దగ్గర నుంచి నందీశ్వరుడు, కరెంట్ ఫ్యాన్లు, కరెంట్ కనెక్షన్, మెయిన్ గేట్ తదితర అన్ని పనులనూ చేయించినట్లు దాతలు తమ పేర్లతో శిలాఫలకాలను గుడి ఆవరణలో వేశారు.



దాతలు డిపార్టుమెంట్ నిర్ణయించిన పనులు పూర్తిగా వారి స్వంత నిధులో చేయించినట్లు శిలాఫలకాలు ఉన్నపుడు దేవస్థాన ఇంజినీర్లు బిల్లులు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆలయ ప్రతిష్ట సమయంలో కమిటీ లేకపోయినా  కమిటీ ఉన్నట్లు ప్రొటోకాల్ బోర్డులలో రాయించడంపై ఈవోపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

 ఆరోపణలు రుజువైతే బాధ్యులపై చర్యలు చేపడతాం

 టంగుటూరు మండలం పొందూరులోని రామలింగేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి అవకతవకలు జరిగినట్లు, నిధులు దుర్వినియోగమైనట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపిస్తాం. రుజువైన పక్షంలో  బాధ్యులపై కఠిన చర్యలు చేపడతాం. సీజీఎఫ్ కింద కేటాయించిన నిధులను వెనక్కు తీసుకుంటాం. అవకతవకలలో ఆలయ కార్యనిర్వహణాధికారి పాత్ర ఉందని తేలితే ఆయనపైకూడా చర్యలు తీసుకుంటాం. 

 - వెండిదండి శ్రీనివాసరెడ్డి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top