అసలేం జరిగింది?


ఏఎన్‌యూ:  ఆర్కిటెక్చర్ కళాశాల విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సమాచారం సేకరిస్తోంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో నెల్లూరు విక్రమశింహపురి యూనివర్సిటీ వీసీ ఆచార్య కె. వీరయ్య, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పి. విజయలక్ష్మి, తిరుపతి ఎస్‌వీ యూనివర్సిటీ అధ్యాపకుడు బాలకృష్ణమనాయుడులతో కూడిన కమిటీ బుధవారం యూనివర్సిటీలో విచారణ ప్రారంభించింది.

 

 ఈ విచారణ మూడు రోజుల పాటు కొనసాగను ంది. విద్యార్థిని రిషితేశ్వరి మృతికి దారి తీసిన పరిస్థితులు, కళాశాల, వసతి గృహాల్లో పరిస్థితులు, విద్యార్థుల మధ్య సంబంధాలు, విద్యాపరమైన అంశాలు, బోధకులు, విద్యార్థుల మధ్య పరిస్థితులు, పరిపాలనా పరంగా తీసుకోవాల్సిన అంశాలపై కమిటీ వివరాలు సేకరిస్తోంది. విద్యార్థుల అడ్మిషన్ సమయంలో, ఆ తరువాత యూనివర్సిటీ  చేపట్టాల్సిన చర్యలను కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తోంది.

 

 విచారణలో భాగంగా యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీ, రిజిస్ట్రార్, పలువురు ఉన్నతాధికారులు, పోలీసు, రెవెన్యూ శాఖలు, యూనివర్సిటీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ, ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి. బాబురావులను కమిటీ విచారించింది. విద్యార్థిని మృతికి కారణాలు, దీనికి సంబంధించి వారి వద్ద ఉన్న సమాచారం తెలపాలని ఆయా శాఖల అధికారులను కోరుతున్న కమిటీ వారు చెప్పిన అంశాలన్నింటినీ సమగ్రంగా నమోదు చేసుకుంది. విద్య, పరిపాలన పరమైన రికార్డులను యూనివర్సిటీ నుంచి, విద్యార్థిని మృతికి సంబంధిచిన ఎఫ్‌ఐఆర్ తదితర రికార్డులను పోలీసు అధికారుల నుంచి కమిటీ సభ్యులు సేకరిస్తున్నారు. కమిటీ ముందు వాదనలు వినిపించేందుకు దళిత సంఘాల నాయకులు, దళిత విద్యార్థి సంఘాల నాయకులు వచ్చారు. షెడ్యూల్ ప్రకారం అందరినీ కలుస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. దీంతో వారు కమిటీని కలవకుండానే వెనుదిరిగారు.

 

 ప్రధాన ద్వారం వద్ద రాకపోకలపై ఆంక్షలు:

 కమిటీ విచారణ జరుపుతున్న నేపథ్యంలో యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. కమిటీని కలవాలని భావించిన వారిని, యూనివర్సిటీకి వివిధ పనులమీద వచ్చే వారిని కూడా లోపలకు అనుమతించలేదు. వీరితో పాటు కవరేజీకి వచ్చిన మీడియాను సైతం లోపలకు అనుమతించలేదు. దీంతో మీడియా వాహనాలను గేటుబయ టనే నిలిపి మధ్యాహ్నం వరకు నిరీక్షించిన మీడియా ప్రతినిధులు ఎంతకూ లోపలకు అనుమ తించకపోవటంతో బయట నుంచే వెనుదిరిగారు.

 

 నేడు విద్యార్థులను విచారించనున్న కమిటీ ...  గురువారం ఉదయం 9 గంటలకు విద్యార్థులు, అధ్యాపకులు, యూనివర్సిటీకి సంబంధించిన ఇతర సభ్యులతో, మధ్యాహ్నం 12:30 గంటలకు వసతి గృహాల వార్డెన్లతో, 2 నుంచి 4 గంటల వరకు వీసీ తదితర ఉన్నతాధికారులతో కమిటీ సమావేశం కానుంది. ఇదిలా ఉండగా విద్యార్థులతో సమావేశం షెడ్యూల్ ప్రకారం 9:30 గంటలకు జరగాల్సి ఉండగా 9 గంటలకు ప్రారంభిస్తామని కమిటీ సభ్యులు తెలిపారని రిజిస్ట్రార్ ఆచార్య పి రాజశేఖర్ చెప్పారు.

 

 విద్యార్థులతో జరిగే బహిరంగ విచారణకు ఆర్కిటెక్చర్ విద్యార్థులు, యూనివర్సిటీలోని విద్యార్థి సమూహాలు, ఇతర విద్యార్థులు, బయట వ్యక్తులు, ఆర్గనైజేషన్లు ఎవరైనా వచ్చి అభిప్రాయాలు చెప్పవచ్చని కమిటీ స్పష్టం చేసిందన్నారు. కమిటీ ముందు హాజరయ్యే వారందరినీ యూనివర్సిటీలోకి అనుమతించటం జరుగుతుందన్నారు.

 

 ఐదుగురు చొప్పున గెస్ట్‌హౌస్‌లోకి అనుమతించి కమిటీ ముందుకు పంపటం జరుగుతుందన్నారు. మృతురాలి తల్లిదండ్రులను కూడా విచారణకు హాజరు కావాలని కమిటీ కోరిందన్నారు. ఈ మేరకు  రిషితేశ్వరి తండ్రి ఎం. మురళీ కృష్ణను ఫోన్లో తాను సంప్రదించానన్నారు. తాను వరంగల్‌లో ఉన్నానని, గురువారం ఉదయం 11.30 గంటలకు కమిటీ ముందు సమాచార మిస్తానని ఆయన తెలిపారన్నారు. యూనివర్సిటీకి వచ్చి వెళ్లేందుకు రవాణా సౌకర్యాన్ని యూనివర్సిటీ నుంచి కల్పిస్తామని కూడా ఆయనకు తెలిపామన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top