ఖర్చు భారీ.. స్పందన సారీ


సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ఏర్పాటు చేసిన సీజీఆర్‌ఎఫ్ (కన్జ్యూమర్ గ్రీవెన్సెస్ రీడ్రసల్ ఫోరం)కు స్పందన కరువైంది. ప్రతినెలా నిర్వహిస్తున్న ఈ గ్రీవెన్స్ డేకు పదుల్లోపే ఫిర్యాదులు అందుతున్నాయి. బిల్లుల నమోదులో నిర్లక్ష్యం, కొత్త మీటర్లు, కనెక్షన్ ఇవ్వడంలో అలసత్వం, లో వోల్టేజీ తదితర సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన సీజీఆర్‌ఎఫ్ కమిటీ ఈనెల 15న ఏలూరులో గ్రీవెన్స్ నిర్వహించగా 11 ఫిర్యాదులే అందాయి. 16న రాజమండ్రిలో ఏర్పాటు చేయగా ఇద్దరే వచ్చారు. ఈ నెల 21న శ్రీకాకుళంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో నాలుగే ఫిర్యాదులందాయి. కాగా విజయనగరంలో ఈనెల 23న, విశాఖలో ఈనెల 28న గ్రీవెన్స్ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

 

 ఎందుకిలా?

 2005లో ఏర్పాటైన సీజీఆర్‌ఎఫ్‌లో ఇద్దరు సీఈలు, ఓ ఎస్‌ఈ సభ్యులుగా ఉంటారు. రెండేళ్ల కాలపరిమితి ఉంటుంది. వాస్తవానికి సీజీఆర్‌ఎఫ్ నిర్వహణకు ఈపీడీసీఎల్ సంస్థ భారీగా ఖర్చు చేస్తోంది. పలు ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తోంది. గ్రీవెన్స్‌లో అందిన దరఖాస్తుల పరిశీలన, సమస్య పరిష్కారానికి 45 రోజుల గడువిచ్చినా..

 

 వారంలోపే పరిష్కారం లభిస్తోంది. అయితే త్రిసభ కమిటీ వద్దకు రాకుండా వినియోగదారుల్ని ఆ శాఖ సిబ్బందే అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తమ స్థాయిలోనే సమస్య పరిష్కరించేస్తామని, పదో పరకో ఇచ్చేస్తే పని అయిపోతుందని చెబుతూ తప్పుదోవ పట్టిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

 

 పెండింగ్ పరిస్థితి ఏంటి?

 ఐదు జిల్లాల్లో 2014లో 444 ఫిర్యాదులు నమోదైతే అందులో త్రిసభ్య కమిటీ 440 దరఖాస్తులకు మోక్షం కల్పించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 126 ఫిర్యాదులొస్తే 54 పరిష్కారమయ్యాయి. 72 పెండింగ్‌లో ఉన్నాయి. దీనికి కోర్టు లావేదేవీలు, హియిరింగ్ పూర్తిస్థాయిలో లేకపోవడం, సమయానికి సిబ్బంది వినియోగదారుల వద్దకు వెళ్లి పూర్తిస్థాయిలో పరిశీలించకపోవడమే కారణమని తెలుస్తోంది. పాత కమిటీ గడువు ముగిసిపోవడం, మళ్లీ కొత్త కమిటీ బాధ్యతలు చేపట్టడం, పెండింగ్ దరఖాస్తుల్ని పరిశీలించే క్రమంలో ఇబ్బందులొచ్చినట్టు తెలిసింది. గ్రీవెన్స్ నిర్వహించే నోడల్ అధికారి(డీఈ, టెక్నికల్)కి ఇతర బాధ్యతలు అప్పగించడం కూడా జాప్యానికి కారణమని తెలుస్తోంది.

 

 పోస్టుకార్డు రాసినా..

 ఇదే విషయమై త్రిసభ్య కమిటీ సభ్యులు ఆర్.శ్రీనివాసరావు, ఎం.వై.కోటేశ్వరరావు, భాస్కరరావుల వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా  గ్రీవెన్స్‌కు హాజరుకాలేనివారు కనీసం తెల్లకాగితం, పోస్టుకార్డుపైన అయినా తమ సమస్య రాసి పంపినా స్పందిస్తామన్నారు. ఫిర్యాదుల రిజిస్ట్రేషన్, ఎస్సెమ్మెస్, ఎక్‌నాలెడ్జ్‌మెంట్ విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తామన్నారు. తాము బాధ్యతలు స్వీకరించాక ఇప్పటివరకు 76 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top