చేనేత ప్రదర్శనలో ఆకలి కేకలు

చేనేత ప్రదర్శనలో ఆకలి కేకలు


శ్రీకాకుళం టౌన్: చేనేత వస్త్రాల విక్రయానికి ఏర్పాటు చేసిన ప్రదర్శనలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన దుకాణదారులకు ఆకలిదప్పులు తప్పలేదు. రెండు దశాబ్దాలుగా ప్రదర్శన నిర్వహణ వ్యయాన్ని చేనేత జౌళిశాఖ పెంచకపోవడంతో అమ్మకందారులకు భోజనం కూడా పెట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకుంటామని వేదికలపై చెప్పడం తప్ప క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు.

 

చేనేత వస్త్రాలను నేతకార్మికుల నుంచి సొసైటీల ద్వారా సేకరిస్తారు. వాటిని మార్కెట్‌లో విక్రయించి వచ్చిన లాభాలను జీతాలుగా పంచుకోవడం ఎన్నోఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. ఏడాదికొకసారి ప్రతి జిల్లాలో చేనేత వస్త్రాల విక్రయ ప్రదర్శన తప్పనిసరి. విక్రయ ప్రదర్శనకు చేనేత జౌళిశాఖ జిల్లా శాఖలకు అనుమతిస్తుంది. ఈ అనుమతి మేరకు ప్రదర్శన నిర్వహణకు ఆశాఖ ఉన్నతాధికారులు రూ. 2 లక్షల నిధులు చెల్లిస్తారు.



1994లో నిర్ణయించిన మేరకు ప్రదర్శన పది రోజుల పాటు ఉండాలి. అయితే రెండు దశాబ్దాలు దాటినా నిర్వహణ వ్యయం పెంచకపోవడంతో వచ్చిన అమ్మకందార్లకు భోజనాలు కూడా పెట్టుకోలేని స్థితిలో చేనేత జౌళిశాఖ ఉంది. గతంలో ప్రదర్శనకు 10 రోజులు అవకాశం ఉండేది. నిర్వహణ వ్యయం పెంచని అధికారులు ప్రదర్శనను ఎనిమిది రోజులకు తగ్గించారు. దీంతో అమ్మకాలు అంతంతమాత్రంగానే సాగుతున్నాయని అమ్మకందారులు వాపోతున్నారు.

 

ఈ నెల 16 నుంచి 24 వరకు ప్రదర్శన


జిల్లా కేంద్రంలో ఈ నెల 16 నుంచి 24వ తేదీ వరకు రైస్ మిల్లర్స్ హాల్ వరండాలో చేనేత వస్త్ర ప్రదర్శన నిర్వహించారు. ఆరు జిల్లాల నుంచి చేనేత వస్త్రాలతో దుకాణదారులు హాజరయ్యారు. చేనేత వస్త్రాలను విక్రయించేందుకు వచ్చిన వారు సొసైటీ సభ్యులే కావడంతో వారికి భోజన వసతి సౌకర్యాలు సొసైటీలే సమకూర్చుకోవాల్సి వస్తోంది. రోజూ ఒక్కో దుకాణంలో రూ. 5వేల వరకు విక్రయాలు జరుగుతున్నాయని, అందులోనే 12 శాతం నిధులు దుకాణంలో వినియోగించుకుంటున్నామని అమ్మకందారులు వాపోతున్నారు.

 

చేనేత జౌళిశాఖ ఏడీ రాజారావు ఏమన్నారంటే...

ఈ ఏడాది అక్టోబర్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శన వల్ల అమ్మకాల్లో గిరాకీ గుర్తించాం. అందువల్లే మూడు నెలల్లో మళ్లీ చేనేత ప్రదర్శన ఏర్పాటు చేశాం. రాష్ట్ర స్థాయిలో ప్రదర్శన నిర్వహణకు రూ. 2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు. వాటితోనే ప్రచారం, ప్రారంభోత్సవ కార్యక్రమం, ప్రదర్శన వద్ద మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. పెరిగిన ధరలకు తగ్గట్టు నిర్వహణ వ్యయం పెంచాల్సి ఉంది. ఉన్నతస్థాయిలో అనేకమార్లు అడినప్పటికీ నిధులు పెంచక పోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top