'ఎస్జీటీ పోస్టుల అర్హతపై కేంద్రానికి లేఖ రాస్తాం'

'ఎస్జీటీ పోస్టుల అర్హతపై కేంద్రానికి లేఖ రాస్తాం' - Sakshi


-మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు



కర్నూలు : సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులకు బీఈడీ చేసిన అభ్యర్థులను అర్హులుగా గుర్తించాలని కోరుతూ ఈ నెలాఖరులోపు కేంద్రానికి లేఖ రాయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం కర్నూలుకు వచ్చిన మంత్రిని బీఈడీ అభ్యర్థులు కలసి తమకు ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పించాలని కోరారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ లో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అర్హులుగా గుర్తించిన విషయాన్ని వారు మంత్రి దృష్టికి తీసుకురాగా.. అందుకు ఆయన స్పందించి ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తాను చర్చించానని, కేంద్రానికి లేఖ రాయమని సలహా ఇచ్చినట్లు చెప్పారు. ఈ నెలాఖరులో తానే ఢిల్లీకి వెళ్లి మానవ వనరుల శాఖాధికారులను కలసి పశ్చిమ బెంగాల్‌కు అనుమతి ఇచ్చిన విధంగానే ఏపీకి ఇవ్వాలని కోరతానన్నారు.



ఒకవేళ కేంద్రం ఏస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అర్హులుగా గుర్తిస్తే ప్రస్తుతం ప్రకటించిన డీఎస్సీలోనే అమలు చేయాలని బీఈడీ అభ్యర్థులు కోరగా దానిపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మే 9,10,11 తేదీల్లో డీఎస్సీ-2015 పరీక్షలు జరిపేందుకు నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటికే ఆ పరీక్షలకు సంబంధించిన హాల్‌టిక్కెట్లు కూడా అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకున్నారని, పరీక్షలను వాయిదా వేయకపోవచ్చునని మంత్రి సూచన ప్రాయంగా తెలిపారు. రాష్ట్ర విద్యార్థినులకు ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, సైకిళ్లు ఇచ్చే యోచనలో ఉన్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top