స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం: వైఎస్ జగన్


ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. స్పీకర్ మీద తమకు నమ్మకం, గౌరవం పోయాయని, అందుకే తాము అవిశ్వాస తీర్మానం పెడతామని ఆయన చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింటులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. బుధవారం నాడు జల సంరక్షణపై ప్రతిజ్ఞ చేయడానికి ముందు తన వెనక నిల్చుని ఉన్న చీఫ్‌ విప్‌ శ్రీనివాసులుకు ''ప్రతిజ్ఞ చేయించడం పూర్తి కాగానే సభను వాయిదా వేయించు'' అని చంద్రబాబు సూచించారు. దీంతో కాలువ తల ఊపుతూ, చేయి ఊపుతూ స్పీకర్‌కు సైగ్‌ చేశారు. సీఎం ప్రతిజ్ఞ పూర్తికాగానే ప్రతిపక్ష నేత జగన్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్పీకర్‌ సభను గురువారానికి వాయిదా వేశారు.



ఇక గురువారం కూడా అగ్రిగోల్డ్ మీద చర్చతో మొదలైన సభ.. ఆ తర్వాత అసలు సభకు సంబంధం లేని విషయంలోకి తీసుకెళ్లడాన్ని జగన్ తప్పుబట్టారు. లక్షలాది మంది బాధితులు ఆక్రోశం వ్యక్తం చేస్తుంటే దాన్ని సరిగా పట్టించుకోకుండా సాక్షి పత్రిక, చానల్‌ గురించి చర్చ మొదలుపెట్టారన్నారు.



ఇక ఏపీ శాసన సభలో కూడా గురువారం నాడు చిత్ర విచిత్రమైన చర్చలు జరిగాయి. సాక్షి మీద చర్యలు తీసుకోవాలని, ఎడిటర్‌ను సభకు పిలిపించాలని ఇలా రకరకాలుగా మాట్లాడారు. ఆ తర్వాత ఏకంగా ప్రతిపక్ష నేతను సస్పెండ్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. సోషల్ మీడియాను ఎలా కట్టడి చేయాలో కూడా ఆలోచించాలన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర శాసనసభ చరిత్రలోనే ప్రతిపక్ష నేతను సస్పెండ్ చేయాలన్న డిమాండ్ ఎప్పుడూ రాలేదు. పైపెచ్చు సభలో ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్షం. ఆ ప్రతిపక్ష నేతను కూడా సస్పెండ్ చేయాలని తలపెట్టడం విశేషం. దీనిపై నిర్ణయాధికారాన్ని స్పీకర్‌కు వదిలేశారు, ఆయనే తుది నిర్ణయం తీసుకుంటారు.



స్పీకర్ స్థానం రాజ్యాంగబద్ధమైన స్థానమని, సీనియర్ ఎమ్మెల్యే అయిన కోడెల శివప్రసాదరావుకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని స్పీకర్ ఎన్నిక సందర్భంగా వైఎస్ జగన్ తెలిపారు. అంత విశ్వాసం ఉంచినా.. ఇప్పుడు మాత్రం ఇలా చేయడం, ఎక్కడో మొదలైన చర్చను ఎక్కడికో తీసుకెళ్లడంతో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పారు.  ఇక గురువారం నాటి సభలో బడ్జెట్ పద్దుల మీద ఎలాంటి తీర్మానం జరగలేదు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top