మోసపోయాం..న్యాయం చేయండి


మంత్రికి విన్నవించిన డీఎడ్ విద్యార్థులు



 ఏఎన్‌యూ :  తమకు అవగాహన లేక ప్రభుత్వ అనుమతి లేని కళాశాలల్లో చేరి మోసపోయామని, తమకు న్యాయం చేయాలని డీఎడ్ విద్యార్థులు రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావును కోరారు.  ర్యాగింగ్‌పై సమీక్ష జరిపేందుకు మంగళవారం ఏఎన్‌యూకు వచ్చిన మంత్రిని డీఎడ్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిశారు. ప్రభుత్వ నిర్ణయంతో తమ జీవితాలు ప్రశ్నార్థకంగా మారామని, దయ చేసి న్యాయం చేయాలని మంత్రి కాళ్లు పట్టుకుని కన్నీరు పెట్టారు. ఒక్కొక్కరం రూ.లక్షా ముప్పై వేల నుంచి లక్షా ఎనభై వేల వరకు కళాశాలల యాజమాన్యాలకు చెల్లించామని మంత్రికి తెలిపారు.



డీఎడ్ కోర్సు రెండో సంవత్సరంలో ఉన్నామని ఇప్పుడు పరీక్షలు రాయనీయకపోతే మా జీవితాలు ప్రశ్నార్థకంగా మారతాయని వివరించారు. పరీక్ష రాసే అవకాశం కల్పించాలని కోరారు. దీనికి మంత్రి స్పందిస్తూ అనుమతి లేని కళాశాలల్లో చదివే విద్యార్థులను పరీక్షకు అనుమతించవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. కానీ డీఎడ్ విద్యార్థుల జీవితాలు నష్టపోకూడదన్న ఉద్దేశంతో ఏం చేస్తే బాగుంటుందనే దానిపై న్యాయ సలహా అడిగామన్నారు. ఒకటి, రెండు రోజుల్లో డీఎడ్ విద్యార్థులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని వివరించారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top