తమిళుల వల్లయింది.. ఆంధ్రుల వల్ల కాదా?

తమిళుల వల్లయింది.. ఆంధ్రుల వల్ల కాదా? - Sakshi


హైదరాబాద్‌: నేడు ఒక ప్రాచీన క్రీడను సంస్కృతిని కాపాడుకునేందుకు తమిళులు చేస్తున్న పోరాటం, నాడు అభివృద్ధి పేరిట తెలంగాణ పౌరులు చేసిన పోరాటాన్ని మించేలా ఆంధ్రప్రదేశ్‌ పౌరుల భవిష్యత్తును కాపాడేందుకు ప్రత్యేక హోదా కోసం పార్టీలకతీతంగా పోరాడదామని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. పార్టీలు, వ్యక్తుల స్వప్రయోజనాలకంటే తెలుగుజాతి మొత్తం ప్రయోజనాలు ముఖ్యం అని నిరూపించుకునే సమయాన్ని చంద్రబాబు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ పోరాటాన్ని ఎంపీల రాజీనామాలతో ప్రారంభిద్ధామని చెప్పారు.



ప్రత్యేక హోదాకు అడ్డుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని ధ్వజమెత్తారు. ఆయన తమతోపాటు ప్రత్యేకహోదాకుసై అంటే మొత్తం తెలుగుజాతిని ఏకం చేసి భారతదేశానికి ఆదర్శమయ్యే పోరాటాన్ని కలిసికట్టుగా నిర్మిస్తామని చెప్పారు. రవాణా వ్యవస్థను, మొత్తం యంత్రాంగాన్ని స్తంభింపజేసైనా ప్రత్యేకహోదా సాధించాల్సిన అవసరం ఉందన్నారు. జల్లికట్టుకోసం తమిళులు సుప్రీంకోర్టు తీర్పును సైతం పక్కనపెట్టారని, ఆర్డినెన్స్ తెచ్చుకున్నారని, అలాంటిది ప్రత్యేక హోదాపై ముందుకెళ్లాలేమా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మొత్తం తెలుగుజాతి రావాల్సిందిగా కోరారు.



'ప్రత్యేక హోదాకు అడ్డంకి చంద్రబాబునాయుడే.. ఏపీకి చెందిన ఎంపీలందరినీ రాజీనామా చేయిద్దాం. ఈ ఉద్యమం చేయకుంటే భవిష్యత్తు తరాలకు మంచి అవకాశాలు పోతాయి. ఇప్పటికే హోదా ప్రయోజనాలు వివిధ ఉద్యమాల ద్వారా ప్రజలకు చెప్పాం. భారతదేశానికే ఆదర్శం అయ్యేలా పోరాటం చేద్దాం. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చేదాక పోరాడుదాం. ఓటుకు కోట్లు కేసులో మీరు (చంద్రబాబు) ఇరుక్కుపోతారో అని కేంద్రానికి లొంగిపోయి వారి అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందోనని, సీబీఐ విచారణ చేయిస్తారేమోనని భయంతో ప్రత్యేక హోదా కు అడ్డుపడుతున్నావ్‌.



తెలుగు జాతిని జాగృతి చేద్దాం. ఇప్పటికైనా చంద్రబాబు నీచ రాజకీయాలతో ఆంధ్రుల హక్కులను కాలరాయొద్దు. పోలవరం కమీషన్లకోసం కకృతి పడొద్దు.. ప్రత్యేక హోదాను ఒక సవాల్‌గా తీసుకొండి. ప్రత్యేక హోదా అగ్నిని మీరే అడ్డుగా ఉండి ఆపేశారు. తెలుగు ప్రజల్లో నిరాశ నిర్లిప్తత ఏర్పరిచారు. ఇప్పటికైనా మరోసారి ఆ ఆలోచనను మండిద్దాం. లక్ష్యాన్ని సాధిద్దాం. ఇప్పటికైనా చంద్రబాబు చిత్తశుద్ధితో ముందుకు రావాలి. ఆయన కుంభకర్ణ నిద్ర నుంచి మేల్కొవాలి. రాజీనామాలతో ఆరంభించి ఉద్యమాన్ని ఉదృతం చేసి ప్రత్యేక హోదా సాధిద్దాం' అని భూమన మీడియా సమావేశంలో చంద్రబాబును డిమాండ్‌ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top