హైదరాబాద్‌ను పోగొట్టుకున్నాం

హైదరాబాద్‌ను పోగొట్టుకున్నాం - Sakshi


 మార్కాపురం: స్వార్థ రాజకీయాలతో పాటు తన కుమారుడిని ప్రధానిగా చేయాలనుకున్న సోనియా గాంధీ దుర్బుద్ధివల్ల రాష్ట్రం విడిపోయిందని.. దీనివల్ల అంతా కలిసి అభివృద్ధి చేసుకున్నా హైదరాబాద్‌ను తెలంగాణకు ఇవ్వాల్సి వచ్చిందని  రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు వ్యాఖ్యానించారు. మార్కాపురం జెడ్పీ బాలుర పాఠశాలలో 2014 జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ అవార్డు ప్రాజెక్టుల ప్రదర్శన కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. జిల్లా విద్యాశాఖాధికారి విజయభాస్కర్ అధ్యక్షత వహించిన సభలో మంత్రి శిద్దా మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీస్తూ, సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందిస్తూ..

 

 వారిని  శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం 2010-11లో ఇన్‌స్పైర్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. బడి పిలుస్తోంది..రారూ.  కార్యక్రమం వల్ల బడి బయట ఉన్న వేలాది మంది పాఠశాలల్లో చే రారని తెలిపారు. యర్రగొండపాలెం, దోర్నాల బస్టాండ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తున్నామని, మార్కాపురం-పొదిలి రోడ్డు డబుల్ రోడ్డుగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో బోధిస్తున్న ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు ఎందుకు పంపిస్తున్నారో ప్రశ్నించుకోవాలని కోరారు. సెప్టెంబర్ 2న ఒంగోలులో జిల్లా పరిషత్ హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించనున్నామని.. జెడ్పీ పాఠశాలల్లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

 

 దొనకొండ కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే జంకె

 పశ్చిమ ప్రకాశం భాగంలో ఉన్న దొనకొండ కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేసేందుకు మంత్రి శిద్దా  ప్రభుత్వంపై వత్తిడి తేవాలని దీనికి తాము సహకరిస్తామని మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ పోస్టులు, టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఈ బడ్జెట్‌లో వెలిగొండకు రూ. 76.80 కోట్లు మాత్రమే కేటాయించారని, 2015 నాటికి వెయ్యి కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

 

 జిల్లా అభివృద్ధిపై చిన్న చూపు: ఎమ్మెల్యే డేవిడ్‌రాజు

 ప్రకాశం జిల్లాకు ఒక్క జాతీయ స్థాయి సంస్థను కేటాయించకపోవటం దురదృష్టకరమని యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి శిద్దా ఈ విషయాన్ని కే బినెట్ సమావేశంలో ప్రస్తావించాలని కోరారు. రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. డీఈఓ విజయభాస్కర్ మాట్లాడుతూ జిల్లాకు 606 ఉపాధ్యాయ పోస్టులు మంజూరయ్యాయని చెప్పారు. సైన్స్ పట్ల ఆసక్తిని కనబరిచే విద్యార్థులకు ఇన్‌స్పైర్ ప్రాజెక్టు వరమన్నారు. ప్రతి విద్యార్థికి ప్రభుత్వం 5వేల రూపాయలను విడుదల చేసినట్లు చెప్పారు.

 

 కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, రాజీవ్ విద్యామిషన్ పీఓ పి.శ్రీనివాసరావు, మార్కాపురం, ఒంగోలు డిప్యూటీ డీఈఓలు కాశీశ్వరరావు, సాల్మన్, మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ రాధిక, ఆర్డీఓ కొండయ్య,  కమిషనర్ ఎ.శ్రీనివాసరావు, ఎంపీపీ ఎల్.మాలకొండయ్య, ఎంఈఓ సీహెచ్‌పీ వెంకటరెడ్డి, జిల్లా పరిషత్ విద్యాశాఖాధికారి వెంకట్రావు, జెడ్పీటీసీ సభ్యుడు రంగారెడ్డి, మున్సిపల్ మాజీ  చైర్మన్ జక్కా ప్రకాశ్, బాలుర, బాలికోన్నత పాఠశాలల హెచ్‌ఎంలు వై.సత్యనారాయణరెడ్డి, శార్వాణి, ప్రధానోపాధ్యాయుల సంఘం డివిజన్ అధ్యక్షుడు సీఎస్ మల్లికార్జున్,  వైఎస్‌ఆర్ సీపీ పట్టణ అధ్యక్షుడు బట్టగిరి తిరుపతిరెడ్డి, యూత్ అధ్యక్షుడు మందటి మహేశ్వరరెడ్డి, పంబి వెంకటరెడ్డి, గొట్టం వెంకటరెడ్డి, కౌన్సిలర్లు వక్కలగడ్డ మల్లికార్జున్, చక్కా మధు, కనిగిరి బాల వెంకట రమణ, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పెరుమాళ్ల కాశీరావు, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు తాళ్లపల్లి సత్యనారాయణ, పండిత పరిషత్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవిచంద్ర, జీఎల్ రమేష్‌బాబు, ఎన్‌సీసీ అధికారి వెంగళరెడ్డి, సుధాకర్, జాతీయ సైన్స్ అవార్డు గ్రహీత టీ.జగన్నాథ్ పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top