మాకు ఓటేస్తేనే అభివృద్ధి

మాకు ఓటేస్తేనే అభివృద్ధి - Sakshi


- ముఖ్యమంత్రి చంద్రబాబు

- ఉభయ గోదావరి జిల్లాల వల్లనే అధికారంలోకి వచ్చాం

- ఆ రెండు జిల్లాలను అభివృద్ధి చేయడం మర్యాద

- అప్పుడే మాకు అనుకూలంగా ఓటేయని వారికి కనువిప్పు

 

హైదరాబాద్:
‘‘మాకు అనుకూలంగా మ్యాండేట్ ఇచ్చిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. అప్పుడే మ్యాండేట్ ఇవ్వని వారికి తెలిసొస్తుంది. టీడీపీ అధికారంలోకి రావడానికి ఉభయగోదావరి జిల్లాల ప్రజలే కారణం. ఆ జిల్లాలను అభివృద్ధి చేయడం మర్యాద. ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయడం మర్యాద అన్పించుకోదు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తెగేసి చెప్పారు. ఈ విషయంలో తనకు ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌తో కలిసి శనివారం క్యాంప్ కార్యాలయం లేక్‌వ్యూ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు.



సీఎం కర్నూలు జిల్లాను పట్టించుకోవటం లేదని, ఉభయ గోదావరి జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా... ఆయన తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలనూ తాము అభివృద్ధి చేస్తామన్నారు. కర్నూలు జిల్లాకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. నీటిపారుదల రంగంలో ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. పరిశ్రమలు, ప్రముఖ విద్యా సంస్థలు, ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌లు కూడా వస్తున్నాయని చెప్పారు. కర్నూలులో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ఢి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎప్పుడూ జరగలేదని తెలిపారు.



ఈ విషయంలో ఎవరితోనైనా చర్చకు సిద్ధమన్నారు. అయితే టీడీపీ అధికారంలోకి రావడానికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వడమే కారణమని చెప్పారు. తమను ఆదరించి, అన్ని విధాలా అండగా నిలుస్తున్న ఉభయగోదావరి జిల్లాలను అభివృద్ధి చేయడం మర్యాదన్నారు. అలా చేయడం ద్వారా తమకు అనుకూలంగా మ్యాండేట్ (టీడీపీకి ఓటేయని) ఇవ్వని వారికి కనువిప్పు కలుగుతుందని చెప్పారు. ఈ మాత్రం నాయకులకు తెలియకపోతే ఎలా?  అని పరోక్షంగా కేఈని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

 

దసరా పర్వదినాన శంకుస్థాపన.. జూన్ 6 న కేవలం భూమి పూజే

దస రా పండుగ రోజున ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి పునాదిరాయి పడనుంది. జూన్ 6న ఉదయం 8.49 గంటలకు రాజధాని శంకుస్థాపన అంటూ ప్రచారం చేసినప్పటికీ, ఆ రోజున కేవలం భూమి పూజకే పరిమి తం కానున్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి శనివారం సూచనప్రాయంగా వెల్లడించారు. శంకుస్థాపన మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మో దీని ఆహ్వానిస్తామని చెప్పారు.



హైదరాబాద్‌లో ని లేక్‌వ్యూ అతిథిగృహంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజనలో హేతుబద్ధంగా వ్యవహరించకపోవడం వల్ల ప్రజలు ఆందోళనలో ఉన్న పరిస్థితుల్లో టీడీపీకి అధికారం ఇస్తే సింగపూర్ వంటి రాజధానిని నిర్మిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చానని చెప్పారు.  హైదరాబాద్‌ను నాశనం చేశారంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తోన్న విమర్శలను బాబు దృష్టికి తీసుకెళ్లగా..  ఆయనే మరోవైపు తమది ధనిక రాష్ట్రం అని చెబుతున్నారనీ మరలాంటపుడు నాళాలు.. రోడ్లు బాగు చేసుకోలేరా? అని అన్నారు. జూన్ 2న చేపట్టే  నవ నిర్మాణ దీక్ష ఉదయం 10.30 గంటల్లోపు పూర్తిచేస్తామన్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులను దీక్షకు తీసుకురావొద్దని చెప్పామన్నారు.

 

మాట వినని ఉద్యోగులపై బదిలీ వేటు.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

పనిచేయని.. మాట వినని అధికారులను దారికి తేవడమే లక్ష్యంగా ‘బదిలీ’ అస్త్రాన్ని ప్రయోగించాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో శనివారం రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిపాలనలో మెరుగైన ఫలితాలు సాధించడం, కొత్తదనం నింపడం కోసం కలెక్టర్లకు అదనపు అధికారాలు కల్పిస్తున్నామన్నారు. మంత్రులు, కలెక్టర్లు సమన్వయంతో పనిచేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునన్నారు. వచ్చే మూడు నెలల్లోగా ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్ అందించాలని ఆదేశించారు. ఇందులో జన్మభూమి- మా ఊరు కమిటీలను భాగస్వాముల్ని చేయాలన్నారు. స్థానిక సంస్థల సహకారంతో మజ్జిగ, ఓఆర్‌ఎస్ పేకెట్‌లను పంపిణీ చేయించి.. వడదెబ్బ బారి నుంచి ప్రజలను కాపాడాలని కలెక్టర్లను ఆదేశించారు.

 

గవర్నర్‌తో బాబు భేటీ

సీఎం చంద్రబాబు  శనివారం రాత్రి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. రాత్రి ఏడు గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన సుమారు 40 నిమిషాల పాటు అక్కడ ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వ వ్యవహారశైలిపై ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇటీవలి కాలంలో స్వచ్ఛ తెలంగాణ, హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా పలు సభల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చేసిన ప్రసంగాలు, ఏపీ ఉన్నత విద్యామండలికి తాళాలు వేయటం వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయని తెలిసింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు... సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టీడీ జనార్ధనరావు, బీద రవిచంద్రయాదవ్, గౌనివాని శ్రీనివాసులును అభ్యర్థులుగా ఎంపిక చేశారు. వారి జాబితాను గవర్నర్‌కు సీఎం అందించారని చెబుతున్నారు. వచ్చే నెల ఆరోతేదీన రాజధానికి భూమి పూజ ముహూర్తం విషయాన్ని గవర్నర్‌కు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top