ఆరోగ్య భారత్ అక్కర్లేదా


‘వ్యాయామ విద్యా కళాశాలలకు ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా అనుమతులు ఇచ్చింది. ఉద్యోగాలు వస్తాయనే ఆశతో లక్షలాది రూపాయలు ఫీజులు కట్టి చదివాం. చివరకు డీఎస్సీ-14లో ఒక్క పీఈటీ పోస్టయినా లేకుండా చేశారు. పాఠశాలల్లో పీఈటీ వ్యవస్థ అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోందా.. అలాంటప్పుడు పీఈటీ కాలేజీలకు అనుమతులు ఎందుకిస్తున్నారు. ఆరోగ్య భారత్ కావాలంటే.. పాఠశాలల్లో వ్యాయామ విద్యను విధిగా బోధించాలి. విద్యార్థులకు శారీరక దారుఢ్యం లేకుంటే మానసిక ఉల్లాసం ఎక్కడి నుంచి వస్తుంది. జిల్లాలో ఒక్క పీఈటీ పోస్టును డీఎస్సీలో నోటిఫై చేయకపోవటం దారుణం. ప్రాథమిక స్థాయి నుంచీ పిల్లలకు వ్యాయామ విద్య ఉండాల్సిందే.



పీఈటీ పోస్టుల్ని భర్తీ చేయలేనప్పుడు మేం వ్యాయూమ విద్యను అభ్యసించి ఏం లాభం. మేం సాధించిన సర్టిఫికెట్లు ఎందుకు పనికొస్తాయి. వాటిని ప్రభుత్వానికి ఇచ్చేస్తాం. కాల్చేయమనండి’ నిరుద్యోగ పీఈటీల ఆక్రోశమిది. డీఎస్సీ-14లో పీఈటీ పోస్టుల్ని భర్తీ చేసేందుకు సర్కారు చర్యలు తీసుకోకపోవడంపై ఏలూరు శాంతినగర్‌లో శుక్రవారం ‘సాక్షి’ నిర్వహించిన చర్చావేదిక కార్యక్రమంలో నిరుద్యోగ పీఈటీలు తమ ఆవేదనను ఇలా వెళ్లగక్కారు.

 

‘ఉత్త’ర్వులేనా..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేస్తున్న జీవోలు ఉత్తుత్తి ఉత్తర్వులుగానే మిగిలిపోతున్నారుు. గతంలో కిరణ్ సర్కారు జారీచేసిన జీవో 55 పీఈటీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేలా ఉంది. ఉన్నత పాఠశాలలో 820 మంది విద్యార్థులు ఉంటేనే ఒక పీఈటీని ఇవ్వాలని అప్పట్లో జీవో ఇచ్చారు.

 జీవో 63 మాత్రం పాఠశాలల్లో విధిగా వ్యాయామ విద్య ఉండాలి చెబుతోంది. వారానికి 6 పీరియడ్లు వ్యాయూమ విద్యాబోధనకు కేటాయించాలనే నిబంధన సైతం ఉంది. పాఠశాల ప్రాంగణాల్లో యోగా, మాక్‌డ్రిల్, లెజిమ్స్, జమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్ వంటివి విద్యార్థులకు నేర్పించాలి.



దీంతోపాటు తరగతి గదుల్లో ఆరోగ్య విద్యను పాఠ్యాంశంగా బోధించాలని ఉంది. విద్యాహక్కు చట్టం కూడా విద్యార్థులకు వ్యాయామ విద్య ఉండాలని చెబుతోంది. ఇదే సందర్భంలో ప్రభుత్వం పిల్లలను ఉదయం 9నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు తరగతి గదుల్లోనే ఉంచాలంటూ ఉత్తర్వులు ఇస్తోంది. వ్యాయామ విద్యను ఇంకెప్పుడు నేర్పించాలనేది స్పష్టత ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను తానే తిరస్కరిస్తున్నట్టు కనిపిస్తోంది.

 

ఒక్క పోస్టూ లేదా...

జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతం 470 మంది పీఈటీలు పనిచేస్తున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒక్క పీఈటీ అయినా లేరు. డీఎస్సీ-14లో జిల్లాలో ఒక్క పీఈటీ పోస్టు నోటిఫై చేయలేదు. జిల్లాలో 16 పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా విద్యా శాఖ అధికారులు కావాలనే ఖాళీలు చూపించకుండా నిరుద్యోగ పీఈటీలకు అన్యాయం చేశారు.

 జిల్లాలో గోపన్నపాలెం వ్యాయామ కళాశాలతోపాటు మరో రెండు పీఈటీ కాలేజీలు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా 200 మంది వరకు పీఈటీలు బయటకు వస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1,500మంది పీఈటీ నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారు.

 

పీఈటీ వ్యవస్థ వద్దంటే చెప్పండి

పాఠశాలల్లో పీఈటీలు అవసరం లేదని ప్రభుత్వం భావిస్తే ఆ విషయూన్ని బహిరంగంగా ప్రకటించాలి. రెండేళ్లు కష్టపడి చదివితే కనీసం ఉద్యోగం రాని దుస్థితి ఉంది. కాలేజీలు పెంచేశారు. పోస్టులు మాత్రం తగ్గించేశారు. మూడు నెలలకు ఓసారి డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ కాలం గడిపేస్తున్నారు. ఇప్పుడు డీఎస్సీ ప్రకటన చేసినా పీఈటీలకు మొండిచేయి చూపిస్తే మా బతుకులు ఏం కావాలి.

 - ముద్దాడ చిన్నారావు, నిరుద్యోగ పీఈటీ

 

ఇంత నిర్లక్ష్యమా

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలంటున్నారు. మరి 820 మంది విద్యార్థులను ఒక్క పీఈటీ ఎలా అదుపు చేయగలడు. గతంలో 250 మంది పిల్లలకు ఒక పీఈటీ, 400మంది ఉంటే ఇద్దరు, విద్యార్థుల సంఖ్య అంతకు మించితే పీడీని నియమించేవారు. ఇప్పుడేమో పూర్తిగా పీఈటీలను నిర్లక్ష్యం చేస్తున్నారు. వ్యాయామ ఉపాధ్యాయులకు గుర్తింపు లేదా.

-  వి.నారాయణరావు, నిరుద్యోగ పీఈటీ

 

మోదీ, సచిన్ చెప్పారుగా

ప్రధాని నరేంద్రమోదీ వ్యాయామం చేయాలంటున్నారు. సచిన్ కూడా వ్యాయామ విద్య కావాలని చెప్పారు. మరి అదే ప్రభుత్వం ఇలా ఎందుకు చేస్తోంది. రూ.50 వేలు అప్పుచేసి మరీ పీఈటీ కోర్సు చదివాను. కానీ ఉద్యోగం వచ్చే పరిస్థితి కనిపిం చడం లేదు. జీవో-74 ప్రకారం ఉద్యోగాల్లో 2 శాతం పోస్టులను స్పోర్ట్స్ కోటాలో కేటాయించాలి. ప్రభుత్వం అదికూడా చేయటం లేదు.

- ఎన్.దుర్గాప్రసాద్, నిరుద్యోగ పీఈటీ

 

యూపీ స్కూల్స్‌లోనూ పీఈటీ ఉండాలి

ఉన్నత పాఠశాలలతోపాటు యూపీ స్కూల్స్‌కూ పీఈటీ పోస్టులు మంజూరు చేయాలి. యూపీ స్కూల్స్‌లో 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులు ఉంటారు. అక్కడ విద్యార్థులకు వ్యాయామ విద్య కావాలంటే పీఈటీ పోస్టులు భర్తీ చేయాలి. హైస్కూళ్లలో 9, 10 తరగతి విద్యార్థులకు ఎలాగూ పబ్లిక్ పరీక్షల పేరుతో వ్యాయామ విద్య బోధించడం లేదు. కనీసం యూపీ స్కూల్స్‌లో అయినా వ్యాయూమ విద్యను అమలు చేయాలి.   

-  ఎన్.వసంత్, నిరుద్యోగ పీఈటీ

 

పీఈటీ పరీక్షల్లోనూ అన్యాయమే

డీఎస్సీలో ఎలాగూ పీఈటీ పోస్టులు భర్తీ చేయటం లేదు. చివరకు పరీక్ష విషయంలోనూ అన్యాయం చేస్తున్నారు. మాకు సంబంధం లేని జనరల్ నాలెడ్జ్‌కు 30 మార్కులు, ఇంగ్లిష్‌కు 30 మార్కులు ఇచ్చారు. ఈ విధానం సరికాదు. 120 మార్కులకు సబ్జెక్టులో ఇస్తూ మిగిలిన 60మార్కులు మాకు సంబంధం లేని అంశాలపై పరీక్ష పెడితే అర్హత ఎలా సాధిం చాలి. ఇక్కడా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పీఈటీ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.           

 - ఎం.సరిత, పీఈటీ అభ్యర్థి

 

సర్కారు బడులను అభివృద్ధి చేయరా

ప్రభుత్వ పాఠశాల లను బలోపేతం చేయాలి. ఉపాధ్యాయుల పిల్లలు విధిగా అక్కడే చదివేలా చేయాలి. ప్రభుత్వ స్కూళ్లలో చదివిన పిల్లలకే ప్రత్యేకంగా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. పేద వారికి నాణ్యమైన విద్య అందించాలంటే ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేయాలి.

 - బి.సురేష్, నిరుద్యోగ పీఈటీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top