ప్రజాపక్షాన ప్రభుత్వంపై పోరాటం

ప్రజాపక్షాన ప్రభుత్వంపై పోరాటం - Sakshi


{పభుత్వంపై పోరాటం వై.ఎస్.జగన్

‘ధవళేశ్వరం ప్రమాద’ బాధిత కుటుంబాలకు సాంత్వన

అభిమాన జనసందోహంగా  జగన్ పర్యటన


 

బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా... పరిహారం చెల్లింపులో ప్రభుత్వ వైఫల్యంపై ధ్వజం... నాలుగు రోజుల్లో పరిహారం చెల్లించకుంటే ఆందోళనపథం పడతామని హెచ్చరిక... ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుపై మండిపాటు... అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొంటున్నారని ధ్వజం...బాబే అవినీతి మహారాజ్ అని విమర్శల దాడి....పార్టీ నేతలకు ఆత్మీయ పలకరింపు...కార్యకర్తలతో మమేకం... ఆద్యంతం అభిమాన జన సందోహం... వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం జిల్లా  పర్యటన సంగ్రహచిత్రం ఇది. విశాఖ విమానాశ్రయం నుంచి పాయకారావుపేట వరకు అభిమాన జనసంద్రం మధ్య వై.ఎస్.జగన్ పర్యటన ఆత్మీయ యాత్రలా సాగింది.          

 

విశాఖపట్నం : ధవళేశ్వరం బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ విమానాశ్రయానికి గురువారం మధ్యాహ్నం 12.30గంటలకు చేరుకున్నారు. అక్కడి నుంచి అచ్యుతాపురం మండలం మోసయ్యపేటకు బయలుదేరారు. ఆయన మోసయ్యపేట చేరుకునేసరికి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. తడుస్తూనే జగన్ బాధిత కుటుంబాల చెంతకు వెళ్లారు. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన  22 మంది మృతుల కుటుంబసభ్యులను ఓదార్చారు. కుటుంబంలో ఏకంగా 11మందిని కోల్పోయిన వృద్ధుడు ఈగల వెంకులును చూసి ఆయన చలించిపోయారు. ప్రాణాలతో బయటపడ్డ కిరణ్‌సాయిని దగ్గరకు తీసుకుని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. రోడ్డు బాగుంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని కిరణ్ సాయి చెప్పడం ఆయన మనసును కలచివేసింది. సరైన రోడ్లు వేయని ప్రభుత్వ వైఫల్యం ఎంతోమంది ప్రాణాలు తీస్తోందని ఆవేదనగా అన్నారు. కూతురు, అల్లుడులను కోల్పోయిన పైడితల్లిని, అవతారం, నర్సింగరావులను జగన్ ఓదార్చారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సహాయం చేసిందా అని అడిగారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని వారు చెప్పడంతో జగన్ నివ్వెరపోయారు. పార్టీ తరపున సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగు రోజుల్లో ప్రభుత్వం పరిహారం చెల్లించకుంటే పార్టీ ధర్నా చేసుదని చెప్పారు.



మధుకాన్ అక్రమాలను అసెంబ్లీలో నిలదీస్తాం

 అచ్యుతాపురం నుంచి తూర్పుగోదావరి జిల్లాకు బయలుదేరిన వై.ఎస్.జగన్‌ను నక్కపల్లి వద్ద రైతులు, మధ్యాహ్నభోజన నిర్వాహకులు కలిశారు. టీడీపీ మాజీ ఎంపీ నామానాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ సంస్థ నిర్వాకం వల్ల 10గ్రామాలకు సాగునీరు అందడం లేదని రైతులు గోడువెళ్లబోసుకున్నారు. పోలవరం కాలువల నుంచి తవ్వుతున్న మట్టిని మధుకాన్ సంస్థ గెడ్డలు, వాగుల్లో పోసేస్తోందని వారు వివరించారు. దానివల్ల  తమ చెరువల్లోకి నీరు రాక  2వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదని చెప్పారు. దీనిపై కలెక్టర్‌ను కలిసి మాట్లాడాల్సిందిగా ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడుకు వై.ఎస్.జగన్ సూచించారు. అయినప్పటికీ పరిస్థితి మారకుంటే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు. తమకు ఆరునెలలుగా బిల్లులు చెల్లించడం లేదని మధ్యాహ్న భోజన నిర్వాహకులు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్య పరిష్కారానికి పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తుందని చెప్పారు.

 

చంద్రబాబు అవినీతిపై నిప్పులు


 ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుపై వై.ఎస్.జగన్ విరుచుకుపడ్డారు. తప్పు చేసి దొరికిపోయిన చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించేందుకు సెక్షన్ 8అంశాన్ని లేవనెత్తారని విమర్శించారు. ‘చేసిన హత్యను వీడియో తీయడం తప్పు అని అంటున్నారు. కానీ హత్య చేయడం అసలు తప్పు కాదా’అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. సెక్షన్ 8తోపాటు మొత్తం పునర్విభజన చట్టాన్ని అమలు చేయాలని కేంద్రాన్ని పలుమార్లు కోరామన్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడింది వైఎస్సార్ కాంగ్రెస్సేనని గుర్తు చేశారు. విభజన పాపం చంద్రబాబుదేనని నిందిస్తూ పార్లమెంటులో టీడీపీ ఎంపీలు విభజన బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిన విషయాన్ని ప్రస్తావించారు. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొంటున్న చంద్రబాబు తీరును  వై.ఎస్.జగన్ ఎండగట్టారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top