అదే తంతు.. సాగునీటికి వంతు

అదే తంతు.. సాగునీటికి వంతు


గోదావరి డెల్టా ఆయకట్టుకు రబీ సాగులో ఈ ఏడాది నీటి ఇబ్బందులు తప్పేటట్టు లేవు. మార్చి నెలాఖరులోపు రబీ సాగు పూర్తి చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. జనవరి నెలాఖరుకు గానీ పూర్తిస్థాయిలో నాట్లు పడే అవకాశం కనిపించడం లేదు. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున ఈసారి వంతులవారీ విధానమే శరణ్యమని అధికారులు అంటున్నారు.

 

* డెల్టా ఆయకట్టుకు వంతులవారీ విధానం తప్పదంటున్న అధికారులు

*గత ఏడాదిలో పోలిస్తే 40 శాతం తక్కువగా వర్షపాతం

* 8 నుంచి 10 టీఎంసీల నీటి కొరత

* క్రాస్‌బండ్స్ వేసి ఇంజిన్లతో నీరు తోడేందుకు రూ.4.50 కోట్లు ఖర్చవుతాయని అంచనా


కొవ్వూరు :  2014 రబీ సీజన్‌లో గోదావరి డె ల్టా పరిధిలో ఉభయ గోదావరి జిల్లాల్లో 8.96 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. మరో 1.16 లక్షల ఎకరాల్లో చేపల చెరువులున్నాయి. ఇప్పటి వరకు పశ్చిమ డెల్టా, తూర్పు డెల్టా పరిధిలో 35 శాతం చొప్పున నాట్లు వేయగా, సెంట్రల్ డెల్టాలో మాత్రం కేవలం 20 శాతం నాట్లు పడ్డాయి. పూర్తి స్థాయిలో నాట్లు పడడానికి మరో నెలరోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కంటే వర్షపాతం 40 శాతం తక్కువగా నమోదైంది. దీంతో ఈసారి వంతుల వారీ విధానం అనివార్యంగా కనిపిస్తోంది.



ఈ సీజన్‌లో 35 టీఎంసీల నీరు గోదావరిలో సహజ సిద్ధంగా లభిస్తుండగా మరో 40 టీఎంసీల నీరు సీలేరు నుంచి వస్తుందని అంచనా వేస్తున్నారు. అదనంగా ఎనిమిది నుంచి 10 టీఎంసీల నీరు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి నీటిలభ్యత సానుకూలంగా ఉన్నప్పటికీ నాట్లు ఆలస్యమైతే సాగునీటి ఇబ్బందులు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈనెల 13వ తేదీన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ధవళేశ్వరంలో జరిపిన సమీక్షా సమావేశంలో రబీ సాగుకు సాగునీటి ఇబ్బందులు అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. దీనిలో భాగంగా సాగునీటి విడుదలను క్రమబద్ధీకరించేందుకు లస్కర్లను కాంట్రాక్టు పద్ధతిపై నియమించాలని ఆదేశించారు.



ప్రస్తుతం గోదావరికి ఇన్‌ఫ్లో జలాలు 10వేల క్యూసెక్కులు వస్తాయని అంచనా వేయగా 11,900 క్యూసెక్కుల నీరు లభ్యమవుతుందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈనెలాఖరు నాటికి 60 శాతం మేరకు నాట్లు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జనవరి నెలాఖరు నాటికి నాట్లు పూర్తయితే మేనెలాఖరు నాటికి గానీ పంట చేతికి అందదు. మార్చి నుంచి వేసవి తీవ్రత పెరగడంతో సాగునీరు అధికంగా అవసరమవుతుంది. పంట పొట్టదశలో ఉన్న సమయంలో నీటిఎద్దడి తలెత్తితే దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉండడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు.

 

సరాసరి రోజుకి 10వేల క్యూసెక్కుల నీరు అవసరం

ప్రస్తుతం సీలేరు విద్యుత్ ఉత్పత్తిని బట్టి  2,800 నుంచి 3,500 క్యూసెక్కుల జలాలు లభ్యం అవుతున్నాయి. సహజ జలాలు ఎనిమిది నుంచి తొమ్మిది వేల క్యూసెక్కులు అందుతున్నాయి. జనవరి నుంచి ఐదు నుంచి ఆరు వేల క్యూసెక్కుల సహజ జలాలు మాత్రమే లభ్యమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సరాసరి రోజూ 10వేల క్యూసెక్కుల నీరుసాగు అవసరం. డిసెంబర్ నుంచి సహజ జలాలు తగ్గే అవ కాశం ఉండడంతో సీలేరు జలాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది.



కనీసం సహజ జలాలు, సీలేరుతో కలిపి తొమ్మిది వేల క్యూసెక్కులు ఉంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదు. ఫిబ్రవరి నెలలో రబీ పంట ఈనిక దశలో ఉంటుంది కనుక 11 నుంచి 12 వేల క్యూసెక్కుల వరకు నీరు అవసరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో నీటి పొదుపును పాటించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు రూ.4.50 కోట్లతో ప్రతిపాదనలు

గోదావరి డెల్టా కాలువలకు క్రాస్‌బండ్‌ల ఏర్పాటు, ఇంజన్ సాయంతో నీరు తోడడం, కాలువల్లో తూడు తొలగింపు తదితర పనులకు రూ.4.50 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. నీటిఎద్దడి అధిగమించేందుకు అవసరమైతే వంతులవారీ విధానం అమలు చేస్తాం. దుబారాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్ధితుల్లోను మార్చి నెలాఖరు నాటికి కాలువలకు నీటి విడుదల నిలిపివేయాలి. లేదంటే వచ్చే ఖరీఫ్ సీజన్‌కు కాలువలకు, లాకులకు మరమ్మతులు చేపట్టే అవకాశం ఉండదు.

 -సుగుణాకరరావు, ఎస్‌ఈ, నీటిపారుదల శాఖ హెడ్ వర్క్సు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top