నీరు మీది..పేరు మాది..

నీరు మీది..పేరు మాది.. - Sakshi


సాక్షి, కాకినాడ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తామని చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ప్రధాన మైంది. పగ్గాలు చేపట్టిన వెంటనే ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరిట ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టుగా ఆర్భాటంగా ప్రకటించారు. దీంతో గుక్కెడు నీళ్ల కోసం తల్లడిల్లే పరిస్థితి ఇక ఉండబోదని గ్రామీణ ప్రజలు సంబరపడ్డారు. రూపాయి కూడా నిధులు విదల్చకుండానే చంద్రబాబు ఈ పథకాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. ఖజానాలో సొమ్ముల్లేవంటూ.. పథకాల భారాన్ని ఇతరులపై వేయాలని చూస్తున్నారు. ‘ఎన్నికల్లో నేను హామీ ఇచ్చేశాను.

 

దాని అమలు  బాధ్యత మీదే’ అంటూ అధికారుల మెడపై కత్తి పెడుతున్నారు. ‘నేను రూపాయి విదల్చను. దండుకొని వచ్చిన సొమ్ముతోనే పథకాలు అమలు చేయండి’ అంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. కేవలం ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భవనంతో పాటు మంచినీటి, విద్యుత్ సదుపాయాలను మాత్రమే కల్పించనున్నారు. నిర్వహణలో రోజువారీ వచ్చే విద్యుత్ బిల్లులను కూడా ఆయా సంస్థలే భరించాల్సి ఉంటుంది. నెలకొల్పే ప్లాంట్లలో 30 శాతం వాటి నిర్వహణను డ్వాక్రా సంఘాలకు అప్పగించనున్నారు. మిగిలిన వాటిని ప్లాంట్లు ఏర్పాటుచేసే దాతలే నిర్వహించాల్సి ఉంటుంది.

 

తొలి విడతలో 612 గ్రామాల గుర్తింపు

గాంధీజీ జయంతి రోజైన అక్టోబర్ 2 నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ర్టంలో తొలిదశలో 5 వేల గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ ప్రజలకు రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పనపై కసరత్తు జరుగుతోంది. జనాభా ప్రాతిపదిన ఒక్కొక్క ప్లాంట్‌కు రూ.2 లక్షల (1000లోపు జనాభా) నుంచి రూ.4 లక్షల (3 వేల లోపు జనాభా) వరకు ఖర్చవుతుందని అంచనా. మన జిల్లాలో వెయ్యికి పైగా పంచాయతీలు ఉండగా, వాటి పరిధిలో 2290 ఆవాస ప్రాంతాలు (హేబిటేషన్లు) ఉన్నాయి. తొలిదశలో 612 గ్రామాలను జిల్లా యంత్రాంగం గుర్తించింది. వీటిలో కనీసం 400 గ్రామాల్లో శ్రీకారం చుట్టాలని సంకల్పించింది.

 

ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిందే : కలెక్టర్

ప్రభుత్వం నుంచి నిధులొచ్చే అవకాశం లేకపోవడంతో పారిశ్రామిక వేత్తలు, దాతల సహకారం కోసం మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ నీతూ ప్రసాద్ ప్రత్యేక సమావేశ ం నిర్వహించారు. ఇప్పటికే కంపెనీ సోషల్ రెస్పాన్సిబులిటీ స్కీమ్ కింద ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా, ఈ భారం మోయలేమని కార్పొరేట్ సంస్థలు విజ్ఞప్తి చేసినా, సీఎస్‌ఆర్ ఫండ్స్‌తో ముడిపెట్టవద్దంటూ కలెక్టర్ వారికి క్లాస్ తీసుకున్నారు. ‘ఇవి ప్రభు త్వ ఆదేశాలు, అందరూ పాటించాల్సిందే, ముందుకొ చ్చి ఈ ప్లాంట్లన్నీ మీరే ఏర్పాటు చేయాలి, నిర్వహణ కూ డా మీరే చూడాలి’ అంటూ కలెక్టర్ హుకుం జారీ చేశారు. వారు పూర్తి స్థాయిలో అంగీకారం తెలియజేయకున్నప్పటికీ ఒక్కొక్క సంస్థకు పది నుంచి పాతిక ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్  లక్ష్యాలను నిర్దేశించారు. దీంతో ఏం చేయాలో తెలియక బిక్కముఖం పెట్టి ఆయా సంస్థల ప్రతినిధులు కలెక్టర్ ఆదేశాలకు ‘జీ హుజూర్’ అంటూ అంగీకరించారు. ఇలా జిల్లాలో 225 గ్రామాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు 14 సంస్థలు ముందుకొచ్చాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top