నీటి కష్టాలు

నీటి కష్టాలు - Sakshi


సాక్షి,చిత్తూరు : జిల్లా వ్యాప్తంగా ఏర్పడిన తాగునీటి ఎద్దడి కారణంగా ప్రభుత్వం 2,800 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. ఇందుకోసం నెలకు రూ.7కోట్లు ఖర్చు చేస్తోంది. జనవరి  నుంచి  ఇప్పటివరకూ తాగునీటి సరఫరాకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే.. జనవరిలో 1,317 గ్రామాలకు  నీటి సరఫరా కోసం రూ  2,48,16,432 కోట్లు, ఫిబ్రవరిలో 1,697 గ్రామాలకు రూ.2,64,78 963 కోట్లు, మార్చిలో 2,096 గ్రామాలకు రూ 6,17,53,239 కోట్లు, ఏప్రిల్‌లో 2,560 గ్రామాలకు 6.52 కోట్లు, మే నెలలో 2610 గ్రామాల పరిధిలో 6.57 కోట్లు ఖర్చు చేయగా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో 2800 గ్రామాలకు నీటిని సరఫరా చేసి, నెలకు రూ.7కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన రోజురోజుకు జిల్లాలో నీటి సమస్య పెరుగుతూనే ఉంది.     



 మొక్కుబడిగా ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం     

 ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా ప్రజలందరికీ రూ.2కే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తానని చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిం చి ఏడాదిన్నర  ముగుస్తోంది. కాని జిల్లాలో తంబళ్లపల్లె, మదనపల్లె లాం టి ఫ్లోరైడ్ ప్రాంతాలతో సహా ఈ పథకం ద్వారా ఏ ఒక్కరికీ  తాగునీరు అందడం లేదు. కేవలం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో మొక్కుబడిగా ఈ పథకాన్ని ప్రారంభించి చేతులు దులుపుకున్నారు. ఈ పథకానికి ఒక్కపైసా నిధులు కూడా  వెచ్చించేందుకు ప్రభుత్వం ససేమిరా అంటోంది. దాతలు ముందుకొస్తే తప్ప ఈ పథకాన్ని కొనసాగించలేమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. 



దాతలు నామమాత్రంగా కూడా  ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా కేవలం 38 చోట్ల మాత్రమే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఇందులో కుప్పంలో 18 ప్లాంట్లు, చిత్తూరులో 3, శ్రీకాళహస్తిలో 4, నగరిలో 2, పలమనేరు, పుంగనూరు, సత్యవేడు, చంద్రగిరి నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అవి కూడా పూర్తిస్థాయిలో నడిచే పరిస్థితి లేకుండా పోయింది. ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందకపోవడంతో కలుషితమైన నీటిని తాగి వేలాది మంది ప్రజలు వ్యాధుల బారిన  పడుతున్నారు.



 బాబు రాకతో కండలేరు ప్రాజెక్టుకు గ్రహణం

 జిల్లావాసుల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.4300 కోట్లతో కండలేరు తాగునీటి పథకానికి రూపకల్పన చేశారు. జిల్లాలోని తిరుపతి, తిరుమల, చిత్తూరు, మదనపల్లి, పీలేరు, పలమనేరు, తది తర ప్రాంతాల్లోని 45 మండలాల పరి దిలోని 8,468 గ్రామాలకు తాగునీరు అందించాలన్నది ఈ పథకం లక్ష్యం. ఈ పథకం వల్ల  వేలాది గ్రామాలకు తాగునీరు అందించే  అవకాశమున్నా  పథకాన్ని పూర్తి చేస్తే పేరు కిరణ్‌కుమార్‌రెడ్డికి వస్తుందన్న అక్కసుతో  చంద్రబాబు ఈ పథకాన్ని  పక్కన బెట్టారు.



 నీటి సరఫరాలో అక్రమాలు

 నీటి సరఫరా పేరుతో టీడీపీ నేతలు పె ద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిసింది. పేరుకు వేలాది ట్యాంకర్లు చూపిస్తున్నా ఇవన్నీ తప్పుడు లెక్కలేనన్న ఆరోపణలున్నాయి. కాకి లెక్కలు చూపించి పెద్ద ఎత్తున నిధులు బొక్కుతున్నారు. నీళ్లు సరఫరా చేయకుండానే టీడీపీ నేతలు నిధులు బొక్కుతున్నారన్న ఆరోపణలున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top