చెంతనే నీరు..పొలమంతా బీడు


 కర్నూలు రూరల్/ఆలూరు, న్యూస్‌లైన్ : కృష్ణా, తుంగభద్ర నదులు జిల్లా మీదుగా ప్రవహిస్తున్నా పశ్చిమ ప్రాంత దాహం మాత్రం తీరడం లేదు. ఈ ప్రాంతం ఎత్తయిన ప్రదేశంలో ఉండడంతో నీటిని ఎత్తిపోయడం తప్పితే ఇతర మార్గాల ద్వారా పారే అవకాశం లేకపోవడమే ఇందుకు కారణం. ఇది అత్యంత ఖరీదైన అంశం కావడంతో పాలకుల ఆలోచనలు ఈ దిశగా సాగడం లేదు.  కృష్ణా బేసిన్‌లో కొత్త ప్రాజెక్టుల నిర్మాణంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆంక్షలు అమల్లోకి రావడంతో ఇక కొత్త ప్రాజెక్టుల నిర్మాణం దాదాపు అసాధ్యం. అయితే క ర్ణాటక-కర్నూలు సరిహద్దులో పారుతున్న హగేరి(వేదవతి)పై ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి పశ్చిమప్రాంతాన్ని సస్యశ్యామలం చేయవచ్చని 2012లో ఓ నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఇంజినీర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినా అమలుపై శ్రద్ధ చూపకపోవడంతో పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు.

 

 పశ్చిమ ప్రాంతానికి ‘వేద’వతే!

 కృష్ణా, తుంగభద్రలపై ఎత్తిపోతల పథకాలతో పశ్చిమాన ఉన్న ఆలూరు, ఆదోని ఏరియాలోని ఎల్లెల్సీ, ఏబీసీలకు నీటిని సరఫరా చేసేందుకు వీలుంది. సముద్రమట్టానికి కృష్ణా నదీ(శ్రీశైలం జలాశయం) 270 మీటర్లు, తుంగభద్ర 330 మీటర్ల ఎత్తులో ఉండగా పశ్చిమ ప్రాంతం మాత్రం 440 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ కారణంగా ఈ ప్రాంతాన్ని తడపాలంటే ఎత్తిపోతల పథకం తప్పితే వేరే మార్గం లేదు.

 

 కర్ణాటకలో పుట్టిన వేదవతి గూళ్యం(ఆదోని) మీదుగా రాజోళిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్) ఎగువన తుంగభద్ర నదీలో కలుస్తోంది. నీటిపారుదల శాఖ నిపుణుడి నివేదిక ప్రకారం సముద్రమట్టానికి 385 మీటర్ల ఎత్తులో  పారుతున్న వేదవతి నుంచి నీటిని కేవలం 80 మీటర్ల ఎత్తిపోస్తే జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలకు తరలించేవీలుంది. హాళహర్వికి ఎగువన 3.2 టీఎంసీల సామర్థ్యంతో ఒకటి, ఆలూరు మండలం మొగలవెల్లి వద్ద 3.64 టీఎంసీల సామర్థ్యంతో మరోక జలాశయం నిర్మించి నీటిని నిల్వ చేయవచ్చు. ఈ పథకం పూర్తి చేస్తే ఆయా ప్రాంతాలకు సాగు,తాగునీటి ఇబ్బందే ఉండదు.

 

 కనీసం 8 టీఎంసీలు సరఫరా చేయవచ్చు

 వేదవతిపై ఎత్తిపోతల పథకం నిర్మిస్తే  ఏటా కనీసం 8 టీఎంసీల నీటిని ఎల్లెల్సీ, ఏబీసీ ఆయకట్టుకు సరఫరా చేసే వీలుంది. నానాయకట్టుకు సైతం అధికారికంగా నీటిని పారించే వీలుంది. ఇలా అదనంగా 80 వేల ఎకరాలకు నీరు అందిచవచ్చు.

 

 వేదవతి నుంచి సంవత్సరానికి 86 టీఎంసీలకు పైగా నీటి లభ్యత ఉందని కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు బచావత్ ట్రిబ్యునల్ ముందు వాదించాయి. 56 టీఎంసీలు మాత్రమేనని కేంద్ర జల సంఘం తేల్చి చెప్పింది. ఈ రెండింటి సగటు చేసి 50.64 టీఎంసీల లభ్యత ఉందని అప్పట్లో నిర్ధారించిన బచావత్ ట్రిబ్యునల్  కర్ణాటకకు 38.07 టీఎంసీలు, అనంతపురం జిల్లాకు 12.47 టీఎంసీల ప్రకారం వాటాలు ఇచ్చింది. అయితే నీటి లభ్యతపై సరైన సమాచారం లేకపోవడంతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా యథాస్థితిని కొనసాగించాలని ఆదేశించింది. 3 టీఎంసీలను అదనంగా కేటాయించాలన్న కర్ణాటక విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ప్రస్తుతం కర్ణాటక, ఆంధ్రలో వాడుకోగా వేదవతి నుంచి ఏటా 39 టీఎంసీలు తుంగభద్రలో కలుస్తున్నాయి. 2009-11 మధ్య వాటర్ గేజింగ్ లెక్కలు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. ఈ నీటి నుంచి కర్ణాటక కోరిన మేరకు 3 టీఎంసీలు ఇచ్చి మిగతా నీటిని మనం వాడుకునేలా ఒప్పందం చేసుకుంటే వేదవతిపై ఎత్తిపోతలకు అడ్డంకులుండవని సాగునీటి పారుదల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.    

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top